చరిత్ర రచనలోనూ వివక్షే


Sun,April 8, 2018 11:41 PM

తెలుగువారి చరిత్ర ఆధారాల్లో తెలంగాణ చరిత్ర ఆధారాలు నిరాదరణకు గురికావడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, ఈ గ్రంథం కూర్పులో తెలంగాణకు చెందిన చరిత్రకారులు లేకపోవడం. రెండు, తెలంగాణ చరిత్ర ఆధారాల గురించి రాసిన రచయితలు తెలంగాణ చరిత్ర-సంస్కృతులపై వచ్చిన ఆధారాలను గురించి తెలుసుకోలేకపోవడం, తెలుసుకునే ప్రయత్నాన్ని సమగ్రంగా చేయక అశ్రద్ధ వహించడం. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది స్పష్టమవుతున్నది.
telugu
ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తెలుగువారి సాం స్కృతిక చరిత్ర పేరుతో ఎనిమిది సంపుటాలను ప్రచురించింది. ఒక్కొక్క సంపుటానికి సుమారు 40మంది చరిత్ర కారులు రచనలు చేశారు. మొత్తంగా 8 సంపుటాలను మూడు వందల మంది రచయితలు కలిసి వెలియించారు. సహజంగానే ఎవరి చరిత్రను వారు ఈ ఎనిమిది సంపుటా ల్లో వెతుక్కోవడం సహజం. ఇవి సమగ్ర ఆంధ్రప్రదేశ్ చరి త్ర పేరుతో ప్రచురితమయ్యాయి కాబట్టి, సమగ్ర అంశాల నుంచి ఎవరికి కావలసినవి వారు ఏరుకోవడానికి ప్రయత్నిస్తారు. కాని తెలంగాణ చరిత్ర-సాంస్కృతిక అంశాలు ఈ సంపుటాల్లో సమగ్రంగానే కాదు, కొన్నిచోట్ల స్థాలీపులాక న్యాయంగా కూడా దొరుకడం లేదు. అదెలా? అందుకు కారణాలేమిటి? తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబ ట్టి, తన చరిత్రను తాను తెలుసుకోవలసిన తరుణమిది. కాబట్టి ఈ సమగ్ర సంపుటాలు తెలంగాణ చరిత్రను ఎంతవరకు సమగ్రతను చేకూర్చాయి, ఎంతమొత్తాన్ని విడిచిపెట్టాయి అని తెలుసుకోవలసి ఉంది. ఇదే ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తెలంగాణ చరిత్ర పేరుతో ఒక అనుబంధ సంపుటాన్ని ప్రచురించింది. ఈ 8 సంపుటాల్లో నుంచి తీసిన ఈ పుస్తకంలో తెలంగాణ ప్రజా సంస్కృతి ప్రతిబింబించలేదని అనేక ఉపపత్తులను చూపుతూ ఒక వ్యాసం రాసి ఒక ప్రధా న దిన పత్రికలో ప్రచురించాను.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తన చివరి సంపుటంగా తెలుగువారి చరిత్ర ఆధారాలు అనే పుస్తకాన్ని ప్రచురించింది. తెలంగాణ ప్రజల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ సంపుటంలోనైనా గత సంపుటాల్లో చోటుచేసుకున్న పొర పాట్లు పునరావృతం కావేమోనని ఆశించాం. కానీ ఇప్పుడు అంతకుమించి తెలంగాణ చరిత్ర వంచితమైంది. అదెలాగో చూద్దాం.

యావత్ తెలుగు ప్రజానీకాన్ని తెలంగాణ నుంచి వందలాది సంవత్సరాలు పరిపా లించిన శాతవాహనులు, విష్ణుకుండినులు, కాకతీయుల పేర్లతో అధ్యాయాలను నిర్మించకుండా చాలా జాగ్రత్తగా తొలినాళ్ళ చరిత్ర అనే అధ్యాయంలో తొలి రెండు రాజ వంశాలను తొలి మధ్యయుగ చరిత్ర అనే అధ్యాయంలో కాకతీయ రాజవంశాన్ని చేర్చి అప్రాధాన్య చారిత్రక యుగాలుగా చిత్రించారు. తెలుగురాష్ర్టాలతో పాటు మధ్య భారత ప్రాంతాలను పాలించిన రాజవంశాలది అప్రాధాన్య చరిత్ర అవుతుందా? కాకతీయుల తరువాత కేవలం మూడున్నర దశాబ్దాలు పాలించిన ముసునూరి నాయక వంశానికి ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించారు. వారి తర్వాత కేవలం కోస్తాంధ్రను మాత్రమే సుమారు వందేండ్లు పాలించిన రెడ్డిరాజుల పేరిట మరో ప్రత్యేక అధ్యాయం కేటాయించారు. చాలా సంతోషం. ఇందుకు అభ్యంతరం లేదు. మరి ఆ రాజవంశాలకు సమకాలికులుగా తెలంగాణ ప్రాంతాన్ని వందేండ్లు పరిపాలించిన రేచర్ల పద్మ నాయకుల పేరిట మరో అధ్యాయం నిర్మించవ ద్దా? నిర్మించలేదు. కాబట్టే ఈ ప్రశ్న ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. తెలుగువారి చరిత్ర అంటేనే సామాన్యులు శాతవాహనులు, కాకతీయుల చరిత్ర అనుకుంటారు. ఆ పేర్లు వేయి పేజీల ఆధారాల పుస్తకంలో అధ్యాయాలుగా కనిపించకపో తే అయోమయంలో పడరా?తెలంగాణీయులే కాదు, ఆంధ్రులు కూడా ఆ అధ్యాయాలు కనిపించకపోతే ఆసక్తిహీనులవుతారు.

ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయాన్ని సమీక్షిద్దాం. ప్రాక్ చరిత్రకు సంబంధించిన ఆధారాల మీద రాస్తూ ఎన్.చంద్రమౌళిక గారు ప్రాక్ చరిత్రలో రాతి చిత్రలేఖనాలు ముఖ్యమైనవని. ఈ మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఔత్సాహి క పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, పరిపక్వత లేనివారు (అమెచ్యూర్స్) వీటిపైన పనిచేస్తున్నారు అని రాశా రు. కానీ ఆయన ఇచ్చిన 36 పేజీల ఆధారాల జాబితాలో ఏ ఒక్కరి కృషిని, రచననూ పేర్కొనలేదు. నేను 2016లో శ్రీకాకుళంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రాచీన చరిత్ర విభాగం అధ్యక్షునిగా వ్యవహరించినప్పుడు ఈ చం ద్రమౌళిగారు నాకు సహాయకుడిగా వ్యవహరించారు. ఆ సందర్భం లో వీరికి నేను రాతి చిత్రలేఖనాల మీద రాసిన పుస్తకాన్ని ఇచ్చి, ఈ చిన్న పుస్తకం సూటి గా కొత్త విషయాలను చెప్పడం వల్ల రాష్ట్ర ప్రభ్వు (పర్యాటక శాఖ) నుంచి ఆ సంవత్సరపు ఉత్తమ గ్రంథంగా అవార్డు అందుకుంది అని చెప్పాను.

నా పుస్తకంలోని రెండు అంశా లు రాష్ట్ర పురావస్తుశాఖ రాతి చిత్ర లేఖనాల మీద ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్‌లో ప్రచురితమయ్యాయనీ చెప్పా ను. 2017 పురావస్తు శాఖ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో నేను తెలం గాణ రాతి చిత్రలేఖనాల మీద 40 పుటల వ్యాసం సమర్పించాను. ఆ సంద ర్భంగా మొదటిసారిగా నేను తెలంగాణలో 60 రాతి చిత్రలేఖనా స్థలాలున్నాయని చెప్పిన విషయం చరిత్రకారుల్లో, వార్తల్లో ఆసక్తికర అంశమైం ది. నేను ఇచ్చిన జాబితాను, ప్రాథమిక అంశాలను చంద్రమౌళి గారు, ఆ తరువాత కొద్దిరోజుల్లోనే జరిగిన 2017-ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రాచీన చరిత్ర విభాగ అధ్యక్ష ప్రసం గంలో చెప్పినట్లు బుక్‌లెట్ ప్రచురితమైంది. కాని అందులో నా ప్రసంగ పత్రం ప్రస్తావనగానీ, నా మోనోగ్రాఫ్ ప్రస్తావన గానీ, చివరికి పురావస్తు శాఖ ప్రచురిం చిన పుస్తకాల ప్రస్తావన గానీ లేదు.

అంటే తెలంగాణ చరిత్రకారులు, పురావస్తుశాఖ చేసిన పరిశోధనలు, ప్రచురించిన పుస్తకాలు ప్రామాణికమైనవి కావునా, లేక ప్రస్తావనార్హమైనవి కావనా? మరి ఆయన ప్రస్తావించినప్పుడు వాటికి ఆధారాలె వ్వి?ఆధారాలు చూప ని ఆయన రచన ప్రామాణికమవుతుందా? తొలినాళ్ళ చరిత్ర అనే అధ్యాయంలో పి.సోమసుందరరావు , డి భాస్కరమూర్తి శాతవాహనుల్లో సిముకుడి తరువాత కృష్ణుడు, ఆయన తరువాత శాతకర్ణి రాజుల య్యారు అని రాశారు. వీరికంటే ముందు పి.వి.పరబ్రహ్మశాస్త్రి గారు కోటి లింగాల సాతవాహనుని తరువాత మొదటి శాతకర్ణి, అతని తరువా త సిముకుడు రాజులైనారు అని రాశారు. ఆయన వాదాన్ని ఒప్పుకుంటే దక్షిణాది తొలి సామ్రాజ్యం తెలంగాణలో పుట్టిం దని ఒప్పుకున్నట్లవుతంది అనుకున్నారేమో. ఈ అధ్యాయ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రిగారి వాదాన్ని అంగీకరించలేదు, కొట్టివేయనూ లేదు. కోటిలింగాలలోను, మరికొద్ది చోట్ల లభించిన నాణాల ఆధారంగా దేమె రాజారెడ్డి గారు శాతవాహన రాజుల్లో పురాణాలు, శాసనాలు ప్రస్తావించని రాజులను గుర్తించారు, వారి క్రమాన్నీ ఇచ్చారు. ఈనేపథ్యం తో పలు పుస్తకాలు రాశారు.

ఆయన చెప్పిన అంశాలను గాని, ఆయన పుస్తకాలను గాని ఈ అధ్యాయాలు పేర్కొనలే దు. బి.ఎన్.శాస్త్రిగారు విష్ణుకుండినుల రాగి శాసనాలను వెలుగులోకి తెచ్చి వారి తొలి రాజధానులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమరాబాదు (ఆనాటి అమరా వతి), నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం అని నిరూపించారు. తొలినాళ్ళ ఆంధ్రులు సాంఘిక చరిత్ర అనేక పుస్త కం రాశారు. వీటినీ ఈ అధ్యా య రచయితలు పేర్కొనలేదు.
ముసునూరి నాయకులు అనే అధ్యాయంలో ఒక్క తెలుగు పుస్తకాన్ని ప్రస్తావిం చలేదు. తెలుగువారి చారిత్రక ఆధారాలులో తెలుగు పుస్తకాలు కనిపించకూ డదా? ఈ ముసునూరి నాయకులు తమ కులానికి చెందినవారు అంటూ వారి పాలనా వైభవాన్ని కీర్తిస్తూ ఒకాయన ఒక పెద్ద పుస్తకం రాశారు. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ఇంగ్లీషు పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురణ సంస్థవారు తెలుగు లో ప్రచురించారు. దాన్నైనా పేర్కొనవలసింది.
కాకతీయుల తర్వాత కోస్తాంధ్రను పాలించిన రెడ్డి రాజ్యా ల చారిత్రక ఆధారాలను ఒక ప్రత్యేక అధ్యాయంలో ప్రస్తావించారు.

కానీ ఇటీవల ఈమని శివనాగిరెడ్డి వంటి ప్రసిద్ధ చరిత్రకారులు రాసిన కొండవీడు చరిత్ర వంటి గ్రంథాల ప్రస్తావన చేయలేదు. రెడ్డి రాజులకు సమకాలికులుగా తెలంగాణను పరిపాలించిన రేచ ర్ల పద్మనాయకుల చరిత్ర ఆధారాల మీద ప్రత్యేక అధ్యాయం నిర్మించలేదు సరికదా, కనీసం ప్రత్యేకంగా ఒక పేరాను రాయలేదు. రెడ్డి రాజులు, పద్మనాయకులు పోటీలు పడి పాలన సాగించారు. సాహిత్యాది కళలను పోషించారు. కాకతీయుల కాలంలో భారతం తెలుగులో రచించబడగా, పద్మనాయకుల కాలం లో పది రామాయణాలు రచించబడినాయి. తెలుగు మహాభాగవతం, తొలి తెలుగు పరిశోధన గ్రంథం (మడికి సింగన సకలనీతి సమ్మతము), ప్రసిద్ధ అలంకార శాస్ర్తా లు.. ఇలా ఎన్నో మౌలిక రచనలు పద్మనాయకుల పోషణలో వెలుగు చూసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వాటిని, వాటి ఆధారాలను ఎక్కడా ప్రస్తావించలేదు.

బహమనీలు, కుతుబ్‌షాహీలకు సంబంధించిన అధ్యాయా ల్లో, ఆ వంశాల పాలనా చరిత్రకు సంబంధించిన ఆధారాలు సాలార్‌జంగ్ మ్యూజియంలోను, రాజ్యభిలేఖనా సంస్థలలోను (స్టేట్ ఆర్కీవ్స్), ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్, లైబ్రరీలోనూ ఉన్నాయని వాటి జాబితాను ఇవ్వడం వల్ల ఈ అధ్యాయాలను రాసే అధ్యాపకులకు వారి శ్రమను తగ్గించినట్లయింది. కాని కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో వారి సామంతులుగా గద్వాల, వనపర్తి, దోమకొండ, పాపన్నపేట, కొల్లాపూర్, పాల్వంచ మొదలైన సంస్థానాలు స్థానిక పాలనను చేపట్టాయి. తెలుగు సాహిత్యాది కళలను పోషించాయి. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఝాన్సీ వంటి రాజ్యాలను వనపర్తి సంస్థానపు సైన్యం ఓడించి తమ వీరత్వాన్నీ చాటుకున్నాయి. ఇవేవీ, వీటికి సంబంధించిన ఆకరాలేవీ తెలుగువారి చారిత్రక ఆధారాలు గ్రంథంలో ప్రత్యేకంగా కనిపించవు.

కుతుబ్‌షాహీల తర్వాత తెలంగాణను మొఘలు ప్రతినిధు లు పాలించారు. వారి పాలనను సర్వాయి పాపన్న, బల్మూరి కొండలరాయుడు వంటివారు ఎదిరించారు. వీటికి పత్య్రేక ఆధారాలివ్వలేదు. సమకాలీన ఆంధ్రప్రదేశ్ అనే అధ్యాయ పు కాలం 1956-2000 అని రాశారు. 2016 వరకు మనుగడలో ఉన్న ఆధారాలను సంకలనం చేస్తున్నామన్నప్పుడు, 2014లో తెలుగు రాష్ర్టాలు విడిపోయినప్పు డు 2000 సంవత్సరం నాటికే సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్రను కుదించి చెప్పడంలో ఆంతర్యమేమిటి? 2001 నాటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉధృతంగా జరిగిన ప్రజా ఉద్యమ చరిత్రను నమోదు చేయవద్దనేదే కదా! మరి అలాంటప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తాంధ్రకు పరిమిత మైన నేపథ్యాన్ని మాత్రం చెప్పినట్లవుతుందా? 1956కు ముందు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, వాటికి సంబంధించి ఆయా కాలాల్లోనే వెలువడిన వందలాది ఆధార గ్రంథాలను ప్రస్తావించలేదు.

సాహిత్య ఆధారాలు అనే అధ్యాయంలో తెలంగాణలో వెయ్యేళ్ళ నుంచి వెలువడుతున్న విలువైన గ్రంథాలను గురించి కూడా ప్రాథమిక సమాచారాన్ని వ్వలేదు. వేములవాడ చాళుక్యుల కాలపు పంపకవి రచనలు, మల్లియరేచన కవిజనాశ్రయం, కాకతీయుల కాలపు విశ్వేశ్వర దేశికుల వారి రచనలు, పండితారాధ్య చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం, పద్మనాయకుల కాలపు నవనాథ చరిత్ర, సకలనీతి సమ్మతము వంటి ఎన్నో గ్రంథాల్లో ఉన్న చారిత్రక ఆధారాలను సముచిత రీతిన ప్రస్తావించలేదు.

జానపద కళలు అనే అధ్యాయంలో బిరుదురాజు రామరా జు ఇదే అంశంపై రాయగా భారత ప్రభుత్వం ప్రచురించిన ఆంగ్ల గ్రంథాన్నీ ఆధారాల జాబితాలో పేర్కొనలేదు. ఈ అధ్యాయంలో గిరిజన సాహిత్యాది కళలను గురించి ప్రస్తా వించారు. సంతోషం. మరి నేను తెలంగాణ గిరిజనుల విషయమై సుమారు పది పుస్తకాలు రాశాను. ఒక్కటీ ప్రస్తావనకు నోచుకోలేదు. పాతవాటినే పునశ్చరణ చేశారు.

లలిత కళలు అనే అధ్యాయంలో కూడా రచయిత ఈ అం శంపై వచ్చిన నూతన గ్రంథాలను ప్రస్తావించలేదు. ఆయన కనీసం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ముద్రితమైన పుస్తకాల జాబితానైనా చూడవలసింది. ఆయన ఇచ్చిన పాత జాబితాలో ఆయన కనీసం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ముద్రితమైన పుస్తకాల జాబితానైనా చూడవలసింది. ఆయన ఇచ్చిన పాత జాబితాలొ తెలంగాణ నుంచి వచ్చిన ప్రధాన గ్రంథాలూ ప్రస్తావించబడలేదు. ప్రథ మ వచనాచార్యుడిగా ప్రశంసించబడిన కృష్ణమాచార్యుల (కాకతీయుల కాలపు ఖమ్మం జిల్లా వాసి) సింహగిరి వచనాలను ప్రస్తావించలేదు. స్వయంగా రాజు సర్వజ్ఞ సింగభూపాలుడు రచించిన సంగీత సుధాకరం, రసార్ణవ సుధాకరం (అలంకారశాస్త్రం), రత్నపాంచాలిక, రామదాసు రచనలు ఇత్యాది ఎన్నో గ్రంథాలు సముచిత స్థానంలో ప్రస్తావనకు నోచుకోలేదు. అసలు రచయిత ఇచ్చిన ఆధారాల జాబి తా కూడా అక్షరాది క్రమంలో (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) లేవు.

అనుబంధాలు అనే అధ్యాయంలో ఆయా సంస్థల్లో ఉన్న తెలుగు వారి చరిత్ర ఆధారాల గురించి ప్రస్తావించి మంచిపని చేశారు. కాని ఆయా సంస్థల గురించి ఇచ్చిన ఉపోద్ఘాతం దగ్గరే ఆయా సంస్థల్లో ఉన్న ఆధారాల జాబితా ను ఇస్తే బాగుండేది. అలా కాకుండా మరోచోట జాబితాను ఇవ్వడం వల్ల పునరుక్తి దోషం చోటుచేసుకున్నది. వేటపాలెం గ్రంథాలయంలో ఉన్న ముఖ్యమైన గ్రంథాల జాబితానైనా బాగుండేది. గ్రంథ విస్తరణభీతి ఉన్నదా అంటే అదీ లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, కాంగ్రెస్ ప్రచురించిన వ్యాసాల జాబితాను కూడా 141 పేజీల్లో పొందుపరిచారు. రాష్ట్ర పురావస్తు శాఖ ఇటీవల వెలుగులోకి తెచ్చిన బృహత్‌శిలా యుగపు వివరాలు, రాతి చిత్రలేఖనాల పుస్తకం వంటి వి మాత్రమే కాదు, వార్షిక నివేదికలు, సిరీస్ ప్రచురణలు, ఇండో ముస్లెమికా సీరీస్, ప్రత్యేక ప్రచురణలు మొదలైన పాత గ్రంథాలను కూడా చాలావాటిని ప్రస్తావించలేదు. ఇం డియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ వారు ప్రచురించిన జాబితాను ఇచ్చారు కానీ అందులో భారత చరిత్రను, దక్షిణ భారత చరిత్రను అధ్యయనం చేసిన వివరాలే ఎక్కువగా ఉన్నాయి. దక్కన్ ప్రాంత చరిత్రపై గత పదిహేనేండ్లుగా వెలువడుతున్న డెక్కన్ స్టడీస్ జర్నల్ నుంచి కూడా వ్యాసాల జాబితాను ఇవ్వలేదు. కాలం మారుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన ఆధారాలు-వెబ్‌సైట్స్, ఈ-బుక్స్-అసలు ప్రస్తావించబడలేదు.

ఇలా తెలుగువారి చరిత్ర ఆధారాల్లో తెలంగాణ చరిత్ర ఆధారాలు నిరాదరణకు గురికావడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, ఈ గ్రంథం కూర్పులో తెలంగాణకు చెందిన చరిత్రకారులు లేకపోవడం. రెండు, తెలంగాణ చరిత్ర ఆధారాల గురించి రాసిన రచయితలు తెలంగాణ చరిత్ర-సంస్కృతులపై వచ్చిన ఆధారాలను గురించి తెలుసుకోలేకపోవడం, తెలుసుకునే ప్రయత్నాన్ని సమగ్రం గా చేయక అశ్రద్ధ వహించడం. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది స్పష్టమవుతున్నది.
- డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ 94909 57078

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles