సాహిత్య కళానిధి కపిలవాయి


Mon,April 2, 2018 01:31 AM

కొంతమంది మహోన్నతులు జీవించిన కాలంలోనే మనం జీవించడం ఆనందం కలిగిస్తుంది. అలాంటి అతికొద్ది మంది లో శతాధిక గ్రంథకర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ఒకరు.
Lingamurthy
అనేక సాహిత్య ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన నిత్య కృషీవలుడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, తాళపత్రాల పరిష్కర్తగా, విమర్శకుడిగా, నాటకకర్తగా, చరిత్రకారుడిగా ఆయన ప్రస్థానం తెలుగు సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఆయన రచించిన కవితలు, గీతాలు,వచనాలు, శతకాలు, వచన శతకాలు, కావ్యాలు, ద్విపదలు, నాటకాలు, ఉదాహరణలు, స్థల చరిత్రలు, బాల సాహి త్యం ఆయన ప్రతిభకు అద్దం పడుతాయి.
నిత్యం సాహిత్య రచనలో మునిగితేలే సృజనశీలి కపిలవా యి. ఇప్పటికే 90కి పైగా గ్రంథాలను ప్రచురించారు. మరో 30 గ్రంథాలు ఇంకా అముద్రితంగా ఉన్నాయి. మరుగున పడ్డ తాళపత్రాలను పరిష్కరించిన మేధావి ఆయన. ఆయా తాళపత్రాల్లోని వివిధ అంశాలను వివరించి, ప్రాచీన కవులను నేటి తరానికి పరిచయం చేసిన గొప్ప విశ్లేషకులు. ఆయనతో మాట్లాడటం మన పరిజ్ఞానాన్ని పెంచుతుంది. సాహిత్యపు లోతులను మన ముందు ఉంచే నడిచే విజ్ఞాన సర్వస్వం కపిలవాయి. అనే క స్థల చరిత్రలకు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణం పోశా రు. వివిధ శాస్ర్తాలలో ప్రతిభను ప్రదర్శించారు.

ఆయన రచనలు తెలుగు భాష ఉత్కృష్టతకు అద్దం పడుతా యి. అత్యంత క్లిష్టమైన చిత్రపది, శబ్దపది బంధాలతో రచనలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్న సాహిత్య దురంధరుడు. ఆయన రచనలు తెలుగు పలుకుబడుల సౌందర్యాన్ని పాఠకుల కళ్లెదుట ఉంచుతాయి. ఆయన రచనల్లో పది శతకాలు, ఏడు ద్విపద కావ్యాలు, మూడు సంకీర్తనలు, పదిహేడు చారిత్రక కథనాలు, మూడు ఆధ్యాత్మిక గ్రంథాలు, రెండు కథల సంపుటాలు ఉన్నాయి. నాలుగు ప్రత్యేక సంచికలకు సంపాదకులుగా ఆయన వ్యవహరించారు. మరో నాలుగు వ్యాఖ్యాన సహిత కావ్యాలను వెలువరించారు. ప్రాచీన సాహిత్యంలోని 25 కావ్యాలను ఆయన పరిష్కరించారు. వాటిని వ్యాఖ్యాన సహితంగా వెలుగులోకి తీసుకువచ్చారు. దాదాపు 300కు పైగా గ్రంథాలకు విలువైన పీఠికలు రాశారు.
భాగవతంలోని పది కథలకు వ్యాఖ్యానంతో భాగవత కథా తత్వం వెలువరించారు కపిలవాయి. కన్నడ భాషలో ఉన్న విశ్వబ్రాహ్మణుల సంస్కృతి వివరాలను తెలుగులోకి అనువదించి పలువురి మన్ననలందుకున్నారు. భువనవిజయాన్ని రాజ రథం పేరుతో నాటకీకరించారు. మూడు తరాలలోని వారి వంశ చరిత్రను మా భగోట అనే పేరుతో గ్రంథస్థం చేశారు. యయాతి చరిత్రను టీకా తాత్పర్య సహితంగా వెలువరించా రు. ఈ గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన ధీరజన మనో విరాజితంను పీఠిక సహితంగా వెలుగులోకి తెచ్చారు. యోగాసక్త పరిణయ ప్రబంధాన్ని ప్రాచ్యలిఖిత భాండాగారం ప్రచురించింది. ప్రాచీ న ఆభరణాల విశేషాలతో కూడిన మాంగల్య శాస్త్రంను పరిష్కరించారు. మాంగల్య ధారణలోని గూఢార్థాలను, విశేషాల ను ఈ గ్రంథం వివరిస్తుంది. స్వయంగా స్వర్ణకార వృత్తి చేయ డం ఈ గ్రంథ రచనకు ఉపకరించిందని ఆయన పేర్కొంటారు.

లింగమూర్తి వివిధ గ్రంథాల రచన కోసం విస్తృతంగా పర్యటించారు.మరుగునపడిన అనేక శాసనాలను వెలుగులోకి తెచ్చారు. జానపదుల పద సంపదను అందరికీ ఎరుకపరిచా రు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి, అనేక గ్రంథాలను రచించా రు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ దేవాలయాల చరిత్రను వెలికితీసి, పాలమూరు జిల్లా దేవాలయాలు అనే పేరుతో ప్రచురించారు. అమరాబాదు స్థల చరిత్రను శ్రీమత్ప్రతాపగిరి ఖండంఅనే గ్రంథంగా వెలువరించారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా మాండలికంలోని దాదాపు ఆరువేల పదాల కు అర్థం, పదప్రయోగ సహితంగా పామర సంస్కృతం రాశా రు. మాండలికంలోని జాతీయాలను కూడా ఈ గ్రంథంలో చేర్చడం విశేషం. నాటి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, జానపదుల వ్యవహారంలోని పలు పదాలను సేకరించి, రచించిన ఉత్తమ గ్రంథమిది. క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలతో పాలమూరు కవి పండిత కుటుంబాలు పేరుతో రాసిన గ్రంథం అముద్రితంగా ఉన్నది.
సాహిత్య శిఖరం కపిలవాయి లింగమూర్తిపై నలుగురు కవులు శతకాలను కూడా వెలువరించారు. లింగమూర్తి శత కం పేరుతో వైద్యం వేంకటేశ్వరాచార్యు లు, గురుబ్ర హ్మ పేరుతో డాక్టర్ బాలస్వామి, గురుమూర్తి శతకం పేరుతో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ శతకాలను రాశారు.

ఆయన సాహిత్య వైశిష్ట్యంపై పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఆయన రచనలపై ఆరుగురు పరిశోధకులు ఎం.ఫిల్., పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. ఉస్మానియా, వేంకటేశ్వర, మధురై, తెలుగు విశ్వవిద్యాలయా ల్లో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి.
పలు గౌరవ పురస్కారాలు, బిరుదులను డాక్టర్ కపిలవాయి లింగమూర్తి పొందారు. 1992లో కవితా కళానిధి, పరిశోధక పంచానన బిరుదులను పొందారు. 1996లో కవి కేసరి అనే బిరుదును పొందారు. 2005లో వేదాంత విశారద, 2008లో సాహితీ విరాణ్మూర్తి, 2010లో గురు శిరోమణి, 2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి అనే బిరుదులను వివి ధ సంస్థలు ఆయనకు అందజేశాయి.
తెలంగాణ రాష్ర్టావతరణ అనంతరం తొలి డాక్టరేటు స్వీకరించిన సాహితీవేత్తగా ప్రత్యేకత పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో గౌరవ డి.లిట్ పట్టాను పొం దారు. తెలంగాణ అవతరణకు పూర్వం అదే విశ్వవిద్యాలయం 2011 సంవత్సరంలో విమర్శ, పరిశోధన రంగాల్లో ప్రతిభా పురస్కారం అందజేసింది.

నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరిట ఏర్పాటు చేసిన పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారం, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం స్మారక పురస్కారం, వట్టికోట ఆళ్వారు స్వామి శతజయంతి పురస్కారం, పాలగుమ్మి పద్మరాజు శతజయంతి పురస్కా రం, దేవులపల్లి రామానుజరావు శతజయం తి పురస్కారం మొదలైనవి ఆయన అందుకున్నారు. తిరుపతిలో 2012లో జరిగిన నాలు గో ప్రపంచ తెలుగు మహాసభల్లో విశిష్ట పురస్కారం పొందారు.
పలు సంస్థలు ఆయనకు వేర్వేరు సందర్భాల్లో పురస్కారాలను అందజేశాయి. వాటి లో రాజమండ్రి విశ్వబ్రాహ్మణ పీఠం, అనుమనిగిరి అచలపీఠం, కోసిగి రుద్రాక్షమఠం, తిరుపతి పులికంటి సాహితీ సాంస్కృతిక సం స్థ, తెనాలి కందుకూరి రుద్రకవి పీఠం, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు, కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, నోరి నరసింహశాస్త్రి చారిటబుల్ ట్రస్టు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్, తెలుగు భాషా సాంస్కృతిక మండలి, తెలంగాణ సారస్వ త పరిషత్తు, పాల్కురికి సోమనాథ కళాపీఠం తదితర సంస్థలు ఆయనను సత్కరించాయి. తెలంగాణలోనే కాకుండా బెంగళూ రు, రాజమండ్రి, కడప, తిరుపతి, విజయవాడ తదితర రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఆయ న గౌరవ సత్కారాలు, పురస్కారాలు పొందారు.
కొంతమంది మహోన్నతులు జీవించిన కాలంలోనే మనం జీవించడం ఆనందం కలిగిస్తుంది. అలాంటి అతికొద్ది మంది లో శతాధిక గ్రంథకర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ఒకరు.
- డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్‌రావు
94410 46839

511
Tags

More News

VIRAL NEWS