రుద్రమదేవి మరణంపై వివాదమేల?


Mon,March 26, 2018 01:22 AM

రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిని నేనే రాణిగా నిలబెట్టిన అనే గన్నారెడ్డి డైలాగ్ లాంటిదే ఈ వ్యాఖ్యానం కూడా. నిజ చరిత్రలో ఎవరిపాత్ర ఎంతదో చెప్పే ఆధారాల అన్వేషణ జరిగిందా? వెతికినదెంత? చరిత్రకు చేర్చినదెంత? ఎందుకింత తొందరపాటు లో చరిత్రకారులకు? రుద్రమదేవి మరణాన్నొక వివాదాస్పదం చేయడం పని లేని చరిత్రకారులు చేసే పనే.

చరిత్రను నిర్మించడానికి ప్రాథమిక ఆధారాలు లిఖిత ఆధారాలు, వస్త్వాధారాలు. చరిత్ర పరిశోధకులు ఈ ఆధారాలను గురించి వ్యాఖ్యానించేటప్పుడు సత్యాన్ని ప్రకటించడంలో స్వీయ ఆలోచనాధోరణులు చరిత్రకు నష్టం కలిగిస్తుంటాయన్నది సత్యం. ఉన్నదున్నట్టుగా చెబుతున్నామంటూనే చరిత్రకారులు విపరీత వ్యాఖ్యానాలు చేయడం చరిత్ర చేసుకున్న దౌర్భాగ్యం.

కాకతి రుద్రమదేవి మరణాన్ని తెలుపుతున్న ఏకైక ఆధారం చం దుపట్ల శాసనం. ఈ శాసనంలో రుద్రమహాదేవి దేవలోకానకు విచ్చేస్తేని శివలోక ప్రాప్తిగాను, మల్లికార్జునాయునింగారికి శివలోక ప్రాప్తిగాను వారి భృత్యులు పువుముంమడిగారు శా.శ.1211విరోధి సం. మార్గశిర శు. ద్వాదశి (క్రీ.శ.1289 నవంబరు 27) రోజున చండ్రుపట్ల సోమనాథదేవరకు, సాగి ఓగిరానకు రాసముద్రము వెనుక వ్రిత్తిగా భూమిని కొంత యిచ్చాడని వుంది.

ఇందులో విచ్చేస్తేని అనే మాట మర్యాదపూర్వకపదం. మహారాణి రుద్రమకు ఆ మాట వాడి మల్లికార్జునునికి ఆ మాట వాడకపోవడం రాచమర్యాదే తప్ప ఇంకొకటి కాదు. ఈ మాటకు విపరీతార్థం తీసి వ్యాకరణ పరిభాషలో అర్థంచెప్పి విచ్చేస్తేని అన్నది అసమాపక క్రియ కనుక రుద్రమదేవి మరణించి స్వర్గానికి వస్తే శివలోకప్రాప్తి జరుగాలని పువు ముంమడి కోరుకున్నాడా? 1295లో చనిపోయే రాణిరుద్రమదేవి చావుకు ముందుగానే వారి పేరుమీద దేవునికి కానుకలు చెల్లిస్తారా ఎవరైనా? ఇదెక్కడి సంప్రదాయం. బతికుండంగా మరణశాసనాన్ని రచిస్తారా? ఒకరు చచ్చివుంటే స్వర్గం చేరాలని, బతికున్నవారు కూడా చనిపోతే స్వర్గానికి వెళ్ళాలని శాస నం వేయిస్తారా? చక్రవర్తి(ణి)కదా ఆమె ప్రాణాపాయస్థితి నుంచి కోలుకోవాలని ప్రతాపరుద్రుడే దానధర్మాలు చేసివుండవచ్చుకదా లేదా పువు ముంమడే వేరొక శాసనం చెక్కించవచ్చుకదా. చచ్చినవారిని, బతికివున్నవారిని ఒకేశాసనంలో కలుపుతా రా? ఇదేం విజ్ఞ త? రుద్రమదేవి అసహాయస్థితిలో అంబదేవుని చర్యలవల్ల అపస్మారస్థితిలో పడి వుండొచ్చనే ఊహ సినిమాటిక్ విజన్ మాత్రమే.

1295 వరకు రుద్రమదేవి బతికి ఉంటే... ఏంచేసింది? ఒక విదేశీయాత్రా రచనను నమ్మదగిందని, ఇక్కడ దొరికిన శాసనానికే మో విపరీతార్థం తీయడం చరిత్రకారునికి ఏం శోభనిస్తుంది. ఎం దుకు రుద్రమదేవి మరణాన్ని వివాదాస్పదం చేస్తున్నట్టు?
రుద్రమదేవిని దేవగిరిరాజు కుమార్తె, అని, గణపతిదేవుని భార్య గా అతని మరణాంతరం విధవరాలే రాజ్యమేలుతున్నదని రాసిన మార్కోపోలో రచనను నమ్మాలా?
రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిని నేనే రాణిగా నిలబెట్టిన అనే గన్నారెడ్డి డైలాగ్ లాంటిదే ఈ వ్యాఖ్యానం కూడా. నిజ చరిత్రలో ఎవరిపాత్ర ఎంతదో చెప్పే ఆధారాల అన్వేషణ జరిగిందా? వెతికినదెంత? చరిత్రకు చేర్చినదెంత? ఎందుకింత తొందరపాటు లో చరిత్రకారులకు? రుద్రమదేవి మరణాన్నొక వివాదాస్పదం చేయడం పనిలేని చరిత్రకారులు చేసే పనే.చరిత్రంటే ఇదేనా అని అసహ్యించుకునేట్లు చేయడానికా? ఇకనన్నా ఈ రాతలు మానండని విజ్ఞప్తి.
- శ్రీరామోజు హరగోపాల్, 9949498698

502
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles