దేశీ రీతుల రత్నావళి


Sun,March 18, 2018 11:04 PM

నృత్తరత్నావళి 8 అధ్యాయాలతో కూడిన గ్రంథం. దీనిని రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి నాలుగు అధ్యాయాలు మొదటి వర్గము. ఇందులో భరతుని నాట్యశాస్ర్తాన్ని అనుసరించి మార్గ నృత్తము వివరింపబడింది. తరువాతి నాలుగు అధ్యాయాలు రెండవ వర్గము. ఇందులో దేశీ సంప్రదాయాన్ని వర్ణించాడు జాయన.
portraying
కాకతీయ ప్రభువులలో మొదటి ప్రతాపరుద్రు డు విద్యాభూషణ బిరుదాంకితుడు. గణపతిదేవ చక్రవర్తి సుమారు 60 సంవత్సరాల కు పైగా రాజ్యాన్ని పాలించి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతని కాలంలో కళలు విశిష్ట స్థానాన్ని సంతరించుకున్నాయి. ఇక రెండవ ప్రతాపరుద్రుడు స్వతహాగా కవి, పండితుడు, గాయక శిరోమణి, కళావేత్త. ఇతని కాలంలో లలితకళలకు ముఖ్యంగా శిల్పకళలకు, నృత్యానికి ఎంతో ప్రాశ స్త్యం లభించింది. ఆ కాలంనాటి కళారూపాలకు నిదర్శనం జాయసేనాపతి విరచిత నృత్త రత్నావళి గ్రంథం.
జాయన అయ్యకుల వంశస్థుడు. పిన్నచోడ నాయకుని కుమారుడు. వీరిది వెలనాడులోని కొయ్యూరు గ్రామం. ఇతని వంశస్థులందరూ చోళరాజుల సేవకులు. జాయన తాతగారైన నారాయణ నాయకుడు వెలనాటి రెండవచోళుని కాలంలో గొప్ప నగరాన్ని నిర్మించి అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీ.శ.1203లో కాకతీయ గణపతిదేవ చక్రవర్తి వెలనాడుపై దండెత్తి జాయన తండ్రి అయిన పిన్నచోడ నాయకున్ని ఓడించి వెలనాడును వశపరుచుకొని, జాయన అక్కలైన నార మ, పేరమ లను వివాహం చేసుకున్నాడు.
అలాగే వయసులో చిన్నవాడైన జాయన సౌమ్యాకారము, సవినయ శౌర్య గాంభీర్యాలను గమనించిన గణపతిదేవుడు ఆయనను కాకతీయ గజ సైన్యాధిపతిగా నియమించి 1213లో తామ్రపురిని బహూకరించి పరిపాలనాధికారాన్ని కూడా ఇచ్చాడు. అంతేకాకుండా జాయన ప్రజ్ఞాపాటవాలను గుర్తించి కళాభ్యాసం కోసం గుండనామాత్యులను నియమించాడు. ఆ విధంగా కళలో ప్రాజ్ఞుడైన జాయన గణపతిదేవుని ఆజ్ఞతో 125 3-54లో, అంటే సుమారు 60ఏండ్ల వయసులో నృత్తరత్నావళిని రచించాడు.
నృత్తరత్నావళి 8 అధ్యాయాలతో కూడిన గ్రంథం. దీనిని రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటి నాలుగు అధ్యాయాలు మొదటి వర్గము. ఇందులో భరతుని నాట్యశాస్ర్తాన్ని అనుసరించి మార్గ నృత్తము వివరింపబడింది. తరువాతి నాలుగు అధ్యాయాలు రెండవ వర్గము. ఇందులో దేశీ సంప్రదాయాన్ని వర్ణించాడు జాయన.

జాయన వర్ణించిన దేశీ భేదాలను రెండు వర్గాలుగా విభజించవచ్చు. దేశీ స్థానక, ఉత్ల్పుతి, కరణ, భ్రమర, పాద, పాట, చారి, లాస్యాంగ, గతి భేదాలు మొదటి వర్గం. ఇవన్నీ మార్గ భేదాలను అనుసరిస్తూ అదనంగా చెప్పబడినవి. ఇక పేరణి, రాసకము, చర్చరి, బహురూపము, భాండిక, కొల్లాట నర్తనము మొదలైనవి ప్రత్యేక నృత్య పద్ధతులను రెండవ వర్గం కింద చేర్చవచ్చు.
దీనిని బట్టి జాయన వర్ణించిన దేశీ నృత్తములన్నీ ఆ కాలం లో ప్రచారంలో ఉన్నవే అని స్పష్టమవుతున్నది.
ఈ దేశీ నృత్తముల ప్రసక్తి ఒక్క నృత్తరత్నావళిలో తప్ప మరే గ్రంథంలోనూ కనబడదు. కాకతీయుల కాలంలో ప్రచారంలో ఉన్న దేశీ నృత్తాలను గురించిన ఏకైక ఆధారము జాయన రచన నృత్తరత్నావళి మాత్రమే. నృత్తరత్నావళిలో దేశీ నృత్తాలు ఈ విధంగా వర్ణింపబడ్డాయి.

పేరిణిని ప్రదర్శించే పురుషుడు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని నృత్తరత్నావళిలో వివరించాడు జాయన. అదేవిధంగా పేరి ణి వేషం ఎలా ఉండాలో కూడా వర్ణించాడు జాయన. తన లాగానే వేషము ధరించిన సహాయకులు నలుగురుకానీ, ఆరుగురుకానీ, ఎనిమిదిమందికానీ ఒక్కొక్కరు లేదా జంటలుగా రంగస్థలంపై ప్రవేశించగా, సమపాదంతో కానీ, భుజంగ త్రాసిత పాదంతో కానీ నిలబడి, తెర ఎత్తిన తరువాత పేరిణి ప్రవేశించాలి.
నృత్తము: లాస్య, తాండవ భేదాలతో చెప్పబడినది.
కైవారము: చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చక్రవర్తుల, రాజుల శౌర్య గుణాలను పొగిడి వాటిచేత సభాపతిని స్తుతించడం.
ఘర్ఘము: తాళముతో కూడి లేదా తాళము లేకుండా చేసే వివి ధ రకాల పాద విన్యాసం. ఏడు రకాల ఘర్గరి నృత్తరత్నావళితో వివరింపబడింది.
వికటము: తాళము లేని వికృత నృత్తము ఇది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రయుక్తమవుతుంది.
గీతము: వివిధ రాగాలలో ప్రబంధాలను పాడటం.

రాసకము: ఇది కాకతీయుల కాలంలో ప్రాచుర్యాన్ని పొంది న స్త్రీల బృంద నృత్యము. పదహారు మంది స్త్రీలు వాద్యాలను అనుసరిస్తూ, వివిధ పాద విన్యాసాలతో రంగస్థలానికి రెండు వైపుల నుంచి ప్రవేశించి బృందాలుగా ఏర్పడి హారము లాగా, వల లాగా వివిధ ఆకారాలను ఏర్పరచి, విడదీయబడుతూ నృత్యం చేయడం రాసక విశేషం.
నాట్య రాసకము: ఇది కూడా స్త్రీల నృత్యమే. నాయికలు వసంత రుతువుల్లో దేశీ ఉయ్యాల పాటలు పాడుతూ రాజుగారి చరిత్రను పదార్థాభినయంతో ప్రదర్శిస్తారు.
దండ రాసకము: ఇది నాట్యరాసకము వంటిదే. అయితే ఇం దులో నర్తకులు చేతిలో కోలలను ధరిస్తారు. ఎనిమిది మంది నుంచి అరువై నాలుగు మంది వరకు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తా రు. వీరు సరి జట్లుగా ఏర్పడి, చేతిలో మూరపొడవు కలిగి పలు రకాల చిత్రాలను చిత్రించిన కోలలను ధరిస్తారు.

శివప్రియము: ఇది శైవోత్సవ సమయాల్లో చేయబడే నృత్యం. ఇందులో స్త్రీలు లేదా పురుషులు కంచుతో కానీ, రాగి తో కానీ చేసిన పాములను ఎడమచేతిలో, అట్టికొడుపులను కుడిచేతిలో పట్టుకుని లయానుసారంగా కిరికిట అనే శబ్దం స్ఫురించేవిధంగా వాయిస్తూ రుద్రాక్షలను, విభూతిని ధరించి శివుని స్తుతిస్తూ బంతులు దీరి శివుని పాటలు పాడు తూ కొన్నిసార్లు గుండ్రంగా తిరుగుతూ, కొన్నిసార్లు ఎదురెదురుగా తిరిగి వివిధ విన్యాసాలతో నర్తిస్తారు.
చింతు నృత్తము: ఇది స్త్రీలు ప్రదర్శించే నర్తనం. స్త్రీలు చిం తు అనే పేరు కలిగిన ద్విపదలను పాడుతూ, ఆ పాటల అర్థా న్ని అభినయిస్తూ నర్తించడంవల్ల చింతు నృత్తము అని పేరు వచ్చింది. పాటలు, వాద్యాలను అనుసరిస్తూ లయానుగుణం గా చప్పట్లు కొడుతూ నర్తించడం దీని ప్రత్యేకత. ఈ నృత్తాన్ని జాతర్లలో ఎక్కువగా ప్రదర్శిస్తారు.

కందుక నృత్తము: ఇది విశేషమైన బంతి ఆట. లోపల కదులుతూ ధ్వని చేసే ఇనుపగుండ్లతో బంగారం, వెండి, కంచు లేదా మట్టితో చేయబడిన బంతులను తీసుకుని తమ బంతిని ఎదుటివారికి అందిస్తూ, వారి బంతులను తాము పట్టుకుంటూ స్త్రీలు నృత్యం చేస్తారు. బంతులను పట్టుకునే క్రమంలో స్త్రీలు పక్షులలాగా ఎగురుతూ, వేడుకతో గట్టిగా కూతలు వేస్తూ బంతి కోసం చంచల నేత్రాలతో ఆకాశంలో చేపలు, తామరపూలు నిండిన కొలనులాగా ఈ ప్రదర్శన ఉంటుంది.
భాండిక నృత్తము: హాస్యగాళ్ళు ప్రదర్శించే నృత్తము భాం డిక. పక్షుల, జంతువుల అనుకరణ, వికృష్టమైన మాటలు, చేష్టలతో హాస్యాన్ని కలిగించే ప్రదర్శన.
ఘటిసణీ నృత్తము: మృదువైన వేషము, స్ఫుటమైన నాద ము గల శరీరము కలిగిన మాల జాతి స్త్రీ లేదా పురుషుడు ప్రదర్శించే నర్తనము, నర్తకులు హుడుక్కా అనే వాద్యాన్ని వాయి స్తూ దీనిని ప్రదర్శిస్తారు.
బహురూపము: ఒకే నర్తకుడు ఆశువుగా బహురూపాలను ధరించడమే బహురూప నృత్తము. లోకుల ఆయా రూపము, వేషము, చేష్ట, భాషలతో ప్రదర్శింపబడుతుంది.
సాత్త్వికాభినయము వదిలి లోకధర్మాన్ని ఆశ్రయించిన ఆంగిక, వాచక, ఆహార్యాభినయాలతో, హావ భావాలతో రెండు కాళ్ళు, నాలుగు కాళ్ళు, కాళ్ళు లేని సజీవ వస్తువుల అభినయంతో, అన్ని వాద్యాలతో కూడి పాటలతో, నృత్తముతో రాజు వంశము లేదా లోక ప్రసిద్ధమైన చరిత్రను బహురూపి ప్రదర్శిస్తారు.

గొండ్లి : ఇది వేటగత్తె నృత్యము లాంటిది. ఆటవిక సంప్రదాయానుసారం అలంకరించుకుని ధిల్లాంగనలు చేసే ప్రదర్శన ఇది.
కొల్లాట నర్తనము: కొల్లాటవారు అంటే దొమ్మరులు అని అర్థం. వారు ప్రదర్శించే నర్తనమే కొల్లాట నర్తనము (దొమ్మరాట).
మద్దెల, కంచు తాళాలు, జేగంట, భేరులు, తప్పెటలను వాద్యకారులు వాయిస్తుండగా, నర్తకులు తోలు తాడు మీద నడుస్తూ, వెదురుగడ మీద అనేక విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఎత్తుగా ఎగురుతూ, కత్తులు మొదలైన శస్ర్తాలను తిప్పుతూ కొల్లాట నర్తనాన్ని ప్రదర్శిస్తారు.
నృత్తరత్నావళిలో జాయసేనాపతి వివరించిన ఈ నర్తనాల న్నీ కాకతీయుల కాలం కన్నా ప్రాచీనమైనవని ఊహించవచ్చు. కాకతీయుల కాలంలో ఇవి మరింత వైభవాన్ని పొంది ఉం టాయి. దేశీ నృత్యాలన్నీ తరతరాలుగా ప్రాంతీయ సంస్కృతీ వైభవానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
- డాక్టర్ హెచ్.అనిత, 80197 35237

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles