నా పల్లె యాస ఇట్లుంటది


Mon,July 1, 2019 12:28 AM

PALLE
నా పల్లె యాస
ఎట్లుంటది
జుంటితేనే తాగినట్లు
జమ్మికొమ్మ ఊగినట్లు
జోడెద్దులు దూకినట్లు
జోలపాట విన్నట్లు
ఎంత కమ్మగుంటది
నాపల్లె యాస.
సద్దకంకిపై పాలపిట్ట ఊగినట్లు
కందికొమ్మపై కందిరీగ ఆడినట్లు
రేగిపూతపై జింగన్నలాడినట్లు
నల్లరేగడిలో ఆరుద్ర నడిసినట్లు
ఎంత కమ్మగుంటది
నా పల్లెయాస.
మాదిగ ఊశన్న అలాయ్ కాడ డప్పుకొట్టినట్లు
సాకాలి నర్సింహులు కాగడ వెలిగించినట్లు
ఎరుకలి ఎంకన్న ఈతాకు సీల్చుతూ మాటాడినట్టు
తురక సాయబ్ హలాల్ జేస్తూ యాసనెత్తుకున్నట్లు
ఎంత కమ్మగుంటది
నా పల్లెయాస.
కరిగేట్లా తుమ్మనాగలి తిరిగినట్లు
వరికల్లంలా తంగేడు పొరక ఊడ్సినట్లు
మ్యాదరి సోమన్న శాట తాలొడ్లు సేరిగినట్లు
దూపేసినప్పుడు దోసిలితో నీళ్ళుదాగినట్లు
ఎంత కమ్మగుంటది
నా పల్లెయాస.
ఆశన్ననాయుడు రామభజన పాటెత్తినట్లు
మా నాయన సిత్రాంగి వేశామేసి ఆడినట్లు
గుడిసెరామన్న బ్రహ్మంగారి పద్యం పాడినట్లు
ఇద్దుం లక్ష్మన్న తాత జానపదం అందుకున్నట్లు
వడ్ల శ్రీరాములయ్య నక్కబావ కథ సెప్పినట్లు
మా అంజిగాడు ఆదాంభి పాత్రకు రాగమైనట్లు
ఎంత కమ్మగుంటది
నా పల్లెయాస.
మా పల్లె గుడికట్టకు కూసోని చెప్పే సంగతులు
పగటియాలన ఇద్దరక్కలు మాట్లాడే ముచ్చట్లు
దాపుదర్పం లేకుండా జీరగొంతు పాడేపాటలు
ఎంత కమ్మగుంటది
నా పల్లెయాస.
ఎంత కమ్మగుంటది
నా పల్లెయాస
పూనాస పూసినట్లు
పున్నమి నవ్వినట్లు
కమ్మని సుద్దులిన్నట్లు
తీయ్యటి కల్లు తాగినట్లు
గుండ్రటి మలిద ముద్దలు
కడుపు నిండగా తిన్నట్లు
ఎంత కమ్మగుంటది
నా తెలుగు భాష
నా పల్లె యాస.

- అవనిశ్రీ, 9985419424

154
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles