ఒడువని దుఃఖం


Mon,July 1, 2019 12:27 AM

oduvani-dukkam
కేర్ మంటూ నేలపై పడ్డాక
మసక చూపులోనూ
దుఃఖం స్పష్టంగా కన్పిస్తోంది
మళ్ళీ చావడం కోసం పుట్టినట్లు ...!
కళ్ళల్లో స్వప్నాల కంకులను కాయిస్తే
కష్టాలు పిట్టల్లా వచ్చి ఒలుచుకుపోతుంటే
ఆనందాల ఆనవాళ్లు
భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి
చిన్నతనం మోసుకొచ్చిన
ఆనంద ఛాయల తీపి గాయాలు తప్ప
ఏం మిగిలున్నాయని,
దుఃఖం పంచిన ఆనందం
ఆశయం పెంచిన దుఃఖం
జీవితం దుఃఖాల కూడిక
సంతోషాల తీసివేత
బాధలు భాగాహారమే
అయినా అవన్నీ
దారమేలేని దండలో ఒరుచుకొని మురిసిపోతున్నాయి
ఆనందంతో మూసిన
నా కనురెప్పల చప్పుడుకే టపీమంటాయి
ఎన్ని దుఃఖాలను మోసిన కళ్ళు నావి..
వయసు నడుస్తుంటే
ఆశయం ఆగిపోద్దా..
నడివయసు ఆశయాలు
పడమటింటి అర్రలో
శిలక్కొయ్యకు తగిలించి
చీకట్లో దేవులాడుతున్నావని
ఎద్దేవా చేస్తున్న ఎందరినో కాంచిన కళ్ళు నావి
అలాంటి దృశ్యాలన్నీ
అదృశ్యాలవ్వాలని స్వప్నాలాపన చేస్తున్న
దుఃఖస్వరం నాది
నా కళ్ళు నవ్వేది
నేను దుఃఖంలో ఉన్నప్పుడే
నన్ను చుట్టేసిన దుఃఖం
నేను వెంట తెచ్చుకున్నది కాదు
నా దుఃఖం
అగణిత మరణాలను ఆహ్వానించింది
ఆతిథ్యం స్వీకరించిన మరణాలు
ఆశీర్వదించి మంత్రించి వెళ్లాయి
వికటాట్టహాసం చేస్తూ
నాపై నర్తిస్తున్న దుఃఖ క్రీడకి
డకౌట్ అయ్యే రోజులు దగ్గర పడాలని...
దుఃఖమే మనిషిని చంపేస్తుందంటే ఎలా...
సుఖం సైతం సైతాన్‌లా నృత్యం చేస్తుంది
సుఖానికి మరోవైపే దుఃఖం
ఒడువని దుఃఖానికి మనిషే ముఖచిత్రం
మనసు అనాహతంగా దుఃఖిస్తేనే
మనిషి ఎగిరే విజయపతాకాన్ని ముద్దాడగలడు

- నామాల రవీంద్రసూరి, 9848321079

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles