కాల బలం


Mon,June 3, 2019 01:24 AM

sun-shine
తెల్లవారు జామిది
మబ్బుల్ని పక్కకు పంపడమే మనపని
తొలి భానోదయం వల్లనే కదా
అస్తిత్వ సంసృతులకు అడ్రస్ దొరికింది
మన త్రిలింగ దేశం కోసమేగా..
సమర కపోతాలు కలలు గన్నది
ఎన్నెన్ని జాతి పావురాల భస్మమైతేనేగాని
తల్లినేలకింద రూపం దొరికింది..!

ఇప్పటికీ మనకు
ముందూ వెనక ఉన్న నీడలు మళ్లీ మళ్లీ చిగురిస్తూనే ఉన్నాయి
నీడలు మృగాల ప్రతిరూపాలే కనుక
అక్షరాలకు ఆయుధాలివ్వక తప్పదు!

మన నేల చుట్టూ సముద్రాలు లేవుగానీ
మనో వుప్పెనలకు కొదువేం లేదు
మన గుండెలు గట్టివి కాబట్టే
అమరుల ఆత్మలు బతుకుతున్నాయి
అందువల్లే కదా..!
మనకాళ్లమీద మనం నిల్చోగలిగాం
మనది సేధ్యానికి సిద్ధమైన నేలకాబట్టే
పదేళ్లబట్టి..
అక్షరాల అంతర్ స్వరాలిప్పుడు
ఎలుగెత్తి బాహ్య స్వరూపాలుగా నిలువెత్తు నిలుస్తున్నాయి!

మన ఇల్లు మనది కావడానికి
ఇంతటి సమర స్వభావాన్ని నిలిపిందెవరు..!
ఆనాటి పోరాట అస్తిత్వం
మన బుతుకులో బతకబట్టే కదా!
ఈ స్వేచ్ఛా విహంగాలను అలుముకోగలుగుతున్నది!

మనం దహనమైన చోటే సంఘర్షించిన చోటే
మన పూర్వీకుల పునాది రాళ్లను గుర్తించగలుగుతున్నాం..!

మన త్రికాల మన ఫలకాల మీద
భవిష్యత్తును నర్మించే శృతి స్వరాలిప్పుడు
పూలపుప్పొడిలా కురువాల్సేఉంది
రెక్కలు తెగిన పక్షుల్ని సైతం
ప్రాణవాయువులూది ఎగరవేయకపోతే ఎలా?

తప్పదు ఈ ప్రపంచ సంతలో
మనమిప్పుడు మెలుకువతోనే ఉందాం
అవతరణకు ఆధ్యులమైన మనం
అంతర్ ఆధిపత్య దుర్బరులను ఎదుర్కోకతప్పదు
అనునిత్యం మొలిచే మొక్కలు
సూర్యునికి సుప్రభాతం పలుకగలవు..
- డాక్టర్ నాళేశ్వరం శంకరం
94404 51960

152
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles