నాగలింగ


Mon,May 27, 2019 01:09 AM

nagalinga
ఏటేటా ఏపుగా పెరిగిన మొక్క
క్రమంగా మహావృక్షమయింది
కొమ్మల రెమ్మల విశాలమైన చేతులు చాచి
వీచేగాలుల్నీ, కురిసే వానల్నీ
కాల్చే సూర్యుడ్నీ లెక్క చెయ్యకుండా
తేజస్సునీ బలాన్నీ కూడగట్టుకుంటూ
నాగలింగ మహావృక్షం
ఆకాశంలోకి విస్తరిస్తూ
మేఘాల సమూహాన్ని తన తల మీద మోస్తున్నది
శివలింగాన్ని కాపలా కాసే నాగులా
ప్రతిపుష్పాన్నీ మలిచి
దైవిక పరిమళాన్ని అద్ది
స్థావర జంగమాల కలయిక అయి
ధరణికీ తనకూ ఉన్న ఋణానుబంధానికి ప్రతీకగా నిలిచింది
ఏటేటా వైశాఖ మాసంలో
రాలిన ఆకుల సుతిమెత్తని దుప్పటితో
భూమిని కప్పేసిన
నాగలింగ వృక్షం
యోగనిద్రలో గడిపే
దిగంబర సన్యాసిలా ఉంది
ఆరు ఋతువుల చక్రాన్ని స్వాగతిస్తుంది
వానచినుకులను ప్రేమగా పలకరిస్తుంది
ఒకదాని తర్వాత ఒకటి
అందమైన హస్తముద్రలతో నృత్యంచేస్తూ
వృక్షం ప్రతికొమ్మమీదా రెమ్మమీదా
మొలకలు ఉత్సాహంగా ఉద్భవించి
వరుణదేవుడ్ని కరుణించమని ప్రార్థిస్తున్నాయి
ఏటేటా ప్రతి ఋతువులో
వివిధ రూపాల్ని ధరిస్తూ
వివిధ రంగుల్ని సంతరించుకుంటూ
నేలమీద ఒక మామూలు మనిషిలా
ఒక భోగిలా ఒక యోగిలా
ఒక స్త్రీలా ఒక పురుషుడిలా
నాగుపడగ మీద మెరిసే నక్షత్రంలా ప్రకాశిస్తూ
తన తనువులోని ప్రతి అణువునూ మీటుతూ
పాటలు పాడే పక్షులతో స్వరం కలుపుతూ
నాగలింగ ఆనందంగా పాటలు పాడుకుంటుంది
భూగర్భంలో జన్మించి
సృష్టి స్థితి లయలకు సాక్ష్యంగా నిలిచిన
నాగలింగ వృక్షం
శిశిరంలో వీచిన శీతగాలుల తాకిడికి
మొదలంటా కూలిపోయింది
భూమ్మీద తన భుజాలు చాచి
ఎలాంటి సద్దు చేయకుండా
ఎవరికీ హాని కలిగించకుండా
నిద్రలోకి జారుకుంది
భూమి లోపల
మూలాధార చక్రంలోని బ్రహ్మాండంలో
చెట్టు ప్రాణాలు నిక్షిప్తం అయి ఉన్నాయి
ఛిద్రమైన దాని దేహం మీద చినుకుల తడి
పునర్జీవనానికి అమృతధార
విరిగిపడిన వృక్షం జంగమమయింది
నాగలింగ మళ్లి చిగురించింది
తనలోపల
విశ్వ రహస్యాన్ని దాచుకున్న
నవజాత శిశువైన నాగలింగ
భూమాత తనను మళ్ళీ ప్రసవించిన
క్షణాల్ని గుర్తు చేసుకుంటూ
ఆకాశాన్ని అందుకోవాలని కలలుకంటూ
గతంలో తను పాడిన పాటల్ని నెమరేసుకుంటూ
వేలాది పక్షుల్ని విశాల బాహువులు చాచిన
నాగలింగ మహావృక్షం
రా రమ్మని ఆహ్వానిస్తున్నది
-కన్నడ మూలం : జి.ఎస్.ఉబర్‌డక్
తెలుగు : ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ

176
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles