చారిత్రక ఆధారాలున్నాయా?


Mon,July 8, 2019 12:45 AM

జగన్‌రెడ్డి దగ్గర ఉన్న మౌఖిక ఆధారాలేమిటో తెలియదు గానీ, ఇది సంభవనీయమేనా అని ఆలోచిస్తే మాత్రం కొన్ని సమస్యలున్నాయి. దిగంబర కవులను మొదటిసారి 1970 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో చూశానని శ్రీశ్రీ అనంతంలోనే రాశాడు. అంతకు ముందు వారితో ఉత్తర ప్రత్యుత్తరాలున్నాయి. మహాస్వప్నతో అంతకు ముందే పరిచయం ఉందా తెలియదు. ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఫ్రాన్స్‌లో 1968 చివరిలో వెలువడింది. దానికి శ్రీశ్రీ తెలుగు అనువాదం 1969-70ల్లో విజయవాడ నుంచి వెలువడుతుండిన తెలుగు వెలుగు వారపత్రికలో సీరియల్‌గా (బహుశా శ్రీశ్రీ ఏ వారానికి ఆ వారం పంపుతుండగా) అచ్చయింది.

పరిశోధకమిత్రులు సామిడి జగన్‌రెడ్డి గారు రాసిన మహా కవి మెచ్చిన మహాస్వప్న వ్యాసం (నమస్తే తెలంగాణ, జూలై 1, 2019) బాగుంది. అయితే, శీర్షికలో, వ్యాసం స్వరంలో, ప్రస్తావనకు వచ్చిన ఒకటి రెండు సందర్భాలలో వ్యక్తమైన చరిత్ర గురించి వివరణ అవసరమనిపించింది. మహాస్వప్న అంతకుముందరి అగ్నిశిఖలు-మంచు జడు లు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గానూ, రాత్రి కవులలో ఒకరు గానూ, దిగంబర కవులలో ఒకరుగానూ అత్యంత ప్రతిభావంతమైన, ప్రభావశీలమైన కవి అనడం నిస్సందేహం. ఆరు దశాబ్దాల తర్వాత కూడా కవిగా ఆయన ప్రాధాన్యత తగ్గలేదు. ఆయనను మహాకవి మెచ్చుకున్నందువల్ల అదనంగా వచ్చేదీ లేదు, మెచ్చుకోకపోతే నష్టమూ లేదు.అయితే మహాకవి మెచ్చిన అన్నప్పుడు అందుకు స్పష్టమైన ఆధారాలు (లిఖితమైనవైనా, మౌఖికమైనవైనా) ఉండాలి. చరిత్రకు వాస్తవ ఆధారాలు, అవి ఎక్కడో ఒకచోట నమోదై ఉండడం, కనీసం సంభవనీయమని అనిపించడం అవసరం. దిగంబరకవుల గురించి వాళ్లకే రాసిన ఉత్తరాల్లో, రచన ల్లో, ఇంటర్వ్యూల్లో, బహిరంగ ఉపన్యాసాల్లో శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యలూ, దిగంబర కవిత్వానికి శ్రీశ్రీ చేసిన అనువాదా లూ అన్నీ సింగంపల్లి అశోక్ కుమార్ ఒక్కచోటికి చేర్చి శ్రీశ్రీ సాహిత్య నిధి విజయవాడ ప్రచురణగా 2015లో వెలువరించారు. దాని ప్రకారం, శ్రీశ్రీ ప్రస్తావనల్లో దిగంబర కవు ల్లో అందరి కన్న తక్కువసార్లు కనబడేది మహాస్వప్న గురిం చి మాత్రమే. చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ల ప్రస్తావనలు పేజీల కొద్దీ ఉండగా, చివరికి భైరవ య్య గురించి కూడ పది వాక్యాల దాకా ఉండగా, మహాస్వ ప్న మీద శ్రీశ్రీ వ్యాఖ్యలు యాభై పేజీల పుస్తకంలో మూడు వాక్యాలకు మించి లేవు.

మళ్లీ చెపుతున్నాను.. అదేమీ మహాస్వప్న కవితాశక్తిని తగ్గించడానికి కాదు. మహాకవి మెచ్చిన అనడానికి ఆధారాలు సరిపోయినన్ని లేవని చూపడానికి మాత్రమే. ఒకనాటి యువతరానికి శ్రీశ్రీ అభిమాన కవి. కానీ శ్రీశ్రీ కే అభిమానకవి మహాస్వప్న. ఈ సంగతిని శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంలో రాశాడు అని జగన్‌రెడ్డి రాస్తున్నారు. కాని శ్రీశ్రీ అనంతంలో గాని, మరెక్కడా గాని అలా రాయలేదు. అనంతంలో విరసంలో వీరశైవులుఅని మూడు భాగా లు రాసిన శ్రీశ్రీ రెండో భాగంలో.. విరసం అంటే దిగంబర కవులే అన్న పొరపాటు అభిప్రాయాన్ని సవరించక తప్పదు. దిగంబర కవులంతా కలిసి ఆరుగురు. వారిలో మహాస్వప్న విరసం ఆవిర్భావానికి ముందే దిగంబరోద్యమం నుంచి తప్పుకున్నాడు. విరసం సభ్యుడు కాకపోయినా మహాస్వప్న ను నేను వీరశైవుడిగా గుర్తిస్తాను. అతనిలో అరాజకత్వం నాకు నచ్చిందని మాత్రమే మహాస్వప్న గురించి అన్నారు. శ్రీశ్రీ మహాస్వప్న మీద ప్రేమతో రెండు కవితలను ఆం గ్లంలోకి తర్జుమా చేశాడు అని జగన్‌రెడ్డి రాశారు. దిగంబర కవిత్వాన్ని ఇంగ్లిష్ చేయడం గురించి శ్రీశ్రీ చాలాచోట్ల చెప్పాడు. ఒక్కొక్క దిగంబర కవి గీతాలు నాలుగేసి ఇంగ్లిష్ లోకి అనువదించి ప్రచురించాలని అనుకున్నానని కూడా అన్నాడు. కాని మొత్తం మీద ఆయన అనువదించినవి ఆరు కవితలు మాత్రమే. అందులో మహాస్వప్న కవిత ఒక్కటి మాత్రమే. జ్వాలాముఖి కవిత ఒక్కటి కూడ చేయలేదు. చెరబండరాజువి రెండు చేశాడు. ఆ రకంగా కూడా ఆయన మహాస్వప్నను ఇతరుల కన్నా ఎక్కువ మెచ్చాడనడానికి ఆధారం లేదు. జగన్‌రెడ్డి రాసినట్టు.. శ్రీశ్రీ మహాస్వప్న వచన కవితను చదివి వచన కవిత అంటే ఇట్లా ఉండాలని కితాబిచ్చాడు అనడానికి కనీసం లిఖిత ఆధారం లేదు.

మౌఖిక ఆధారం ఏమన్నా ఉందేమో తెలియదు. అలాగే అందరూ శ్రీశ్రీని చూడటానికి మద్రాసు వెళ్తే, ఆయన మాత్రం మహాస్వప్న చిరునామా వెతుక్కుంటూ ఈ భాగ్యనగరిలో అడుగుపెట్టా డు. మహాస్వప్న ఒక చిరునామా లేని వ్యక్తి అన్న విషయం తెలుసుకొని, చివరికి దిగంబర కవులలో ఒకరిని ఆరా తీసి, మహాస్వప్నను బేగంబజార్ లాడ్జీలో పట్టుకున్నాడు... (ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం గురించి ఏంజెలో కాట్రొచ్చీ, టామ్ నెయిర్న్‌లు రాసినది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్‌లో ఏం జెలో కాట్రొచ్చీ భాగానికి శ్రీశ్రీ తెలుగు అనువాదం రెక్కవిప్పిన రెవల్యూషన్) ఖైరతాబాద్ కల్లు కాంపౌండులో రికామీగా కూర్చుని శ్రీశ్రీ చెబుతుంటే మహాస్వప్న తెలుగులో రాశాడు అనేది సాహిత్యచరిత్రకూ, సాహిత్యకారుల జీవితచరిత్రలకూ సంబంధించిన అరుదైన విషయం. ఇంతవర కూ ఎక్కడా లిఖిత ఆధారాలు లేని ఈ అంశాన్ని మొదటిసా రి తెలుగు పాఠకుల దృష్టికి తెచ్చినందుకు జగన్‌రెడ్డికి కృతజ్ఞతలు. జగన్‌రెడ్డి దగ్గర ఉన్న మౌఖిక ఆధారాలేమిటో తెలియదు గానీ, ఇది సంభవనీయమేనా అని ఆలోచిస్తే మాత్రం కొన్ని సమస్యలున్నాయి. దిగంబర కవులను మొదటిసారి 1970 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో చూశానని శ్రీశ్రీ అనంతంలోనే రాశాడు. అంతకు ముందు వారితో ఉత్తర ప్రత్యుత్తరాలున్నా యి. మహాస్వప్నతో అంతకు ముందే పరిచయం ఉందా తెలియదు. ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఫ్రాన్స్‌లో 1968 చివరిలో వెలువడింది. దానికి శ్రీశ్రీ తెలుగు అనువాదం 1969 -70ల్లో విజయవాడ నుంచి వెలువడుతుండిన తెలుగు వెలుగు వారపత్రికలో సీరియల్‌గా (బహుశా శ్రీశ్రీ ఏ వారానికి ఆ వారం పంపుతుండగా) అచ్చయింది. 1970 జూలై నాటి నుంచే మహాస్వప్నకూ మిగిలిన దిగంబర కవులకూ (వారితో పాటే శ్రీశ్రీకీ) సంబంధాలు తెగిపోయాయి.

ఒకవేళ శ్రీశ్రీ అనంతంలో రాసిన దిగంబర కవుల పరిచయం నిజం కాదనుకున్నప్పటికీ, మహాస్వప్న అప్పటికే పరిచయం అనుకున్నప్పటికీ, దాదాపు 80 పేజీల పుస్తకం కల్లు కాంపౌండులో ఒక సిట్టింగ్‌లో చెపుతుంటే రాయడం సాధ్యమేనా అనే ప్రశ్న మిగులుతుంది. తెలుగు వెలుగు సీరియల్ తర్వా త రెక్కవిప్పిన రెవల్యూషన్ పుస్తకంగా విద్యుల్లత విజయకుమార్ పూనికతో 1971 సెప్టెంబర్‌లో ఉద్యమ సాహితి, కరీంనగర్ ప్రచురణగా మొదటి ముద్రణ, శ్రీశ్రీ సమగ్ర సాహిత్యంలో భాగంగా విరసం ప్రచురణగా 1996 జనవరిలో రెండో ముద్రణ, శ్రీశ్రీ సాహిత్య నిధి, విజయవాడ ప్రచురణగా 2019 ఏప్రిల్‌లో మూడో ముద్రణ వెలువడ్డా యి. ఈ చరిత్రాత్మకమైన పుస్తకానికి మహాస్వప్నతో, ఖైరతాబాద్ కల్లు కాంపౌండుతో సంబం ధం ఉన్నదనే అసాధారణమైన చారిత్రక వాస్తవం ఏ ఒక్క సందర్భంలోనూ బైటికి రాకపోవడం ఆశ్చర్యమే.
- ఎన్.వేణుగోపాల్, 98485 77028

131
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles