కవిత్వాహంకారం లేని ఎఱ్ఱన


Mon,June 24, 2019 01:18 AM

కాకతీయ సామ్రాజ్యం 1323లో ప్రతాపరుద్రుని మరణంతో అస్తమించింది. ఆ తర్వాత మళ్లీ హిందు సామ్రాజ్య స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. ప్రతాపరుద్రుని అనంతరం ఓరుగల్లు ప్రాంతంలో చెప్పరానంత విధ్వంసం మారణహోమాలు ఢిల్లీ పాలకులు వారి సేనలు కొనసాగించాయి. ఓరుగల్లు నగరాన్ని ఆరు నెలలపాటు ధ్వంసంచేసి దేవతా మందిరాలను కూల్చి ప్రజలను మతాంతరీకరణంచేసి ఎంతో భయోత్పాతాలను సృష్టించారు. నగరం పేరే మార్చి సుల్తాన్‌పూర్ అని పెట్టారు. ఈ భయం వల్ల చాలామంది విద్వాంసులు, కళాకారులు, శిల్పులు, శాస్త్రవేత్తలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. బలవంతంగా మతాన్ని మార్చుకున్నవారు తమ పూర్వ మతస్థులను పీడించసాగారు.

ఈ అల్లకల్లోలంలో ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ముసూనూరి ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు అనే ఇద్దరు వీరులు తమ సహచర వీరుల సహాయంతో సింహాసనాన్ని ఆక్రమించి కాకతీయుల వారసత్వాన్ని కొంతకాలం వరకు నిలబెట్టారు. ఈ సందర్భంలో రాచకొండలో పద్మనాయకులు రాజ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు కొండవీటిలో రెడ్డిరాజులు మరొక రాజ్యా న్ని స్థాపించారు. ఈ రెండు రాజ్యాలలోనూ పాలకులు సం స్కృతాంధ్ర భాషల్లో విద్వాంసులు. కవి పండిత పోషకులు. రాచకొండలో విశ్వేశ్వర పండితుడు, వామన బట్టభానుడు ఉండేవారు. స్వయంగా ఈ వంశంలోని రాజు సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవ సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రం థాన్ని రచించారు. వేదాంత దేశికుల కుమారు లు కుమార వరదాచార్యులు రాచకొండకు విచ్చే సి వైష్ణవ సంప్రదాయాన్ని వ్యాప్తిలోనికి తెచ్చా రు. ఈ సందర్భంలో కుళ్లత్తాళ్వార్లు రచించిన పంచస్తవి ప్రభావం తెలుగు కవుల మీద పడిం ది. రాజాశ్రయాన్ని తిరస్కరించాలనే భావం కూడా పర మతస్థుల ఆక్రమణల వల్ల కల్లోలితమైన తెలంగాణలో ప్రబలింది. ఏ దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్లు ఈ ప్రాంతంలోని రాజులకు కాక ఇష్టదైవతములకే తమ గ్రంథాల ను అంకితం చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలియవస్తుంది. కొండవీటి రెడ్డిరాజులు కవిత్రయంలోవి ఎఱ్ఱప్రగడ, శ్రీనాథుడు మొదలైన కవులను పోషించారు. ఈ కాలంలోని కాటయవేముడు కాళిదాసు నాటకాలకు వ్యాఖ్యానం రచించాడు.

ఎఱ్ఱాప్రగడ రచనలను జాగ్రత్తగా, లోతుగా పరిశీలిస్తే ఇతను కేవలం, కవి, తాత్వికుడు మాత్రమే కాక అంతర్యాగ పరాయణుడైన యోగి వలె కానవస్తాడు. ఇతని రచనలలో ఒక సాత్వికత ఆత్మగోపన లక్షణం కానవస్తాయి. కవిత్వాహంకారం ఇతనిలో కనిపించదు.


ఓరుగల్లు నుంచి వలస వెళ్లిన సాయణ మాధవులనే సోదరులు ఢిల్లీ నుంచి మతం మార్చుకొ ని తిరిగి వచ్చిన హరిహర బుక్కరాయలు అనే సోదరులను హిందువులుగా మార్చి వారిచేత విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మింపజేశారు. నా డు నిర్మించిన శ్రీవిద్యానగరం, శ్రీచక్రపీఠ శక్తితో నిర్మింపబడినదని చరిత్రకారులు కొందరు పేర్కొన్నారు. సాయణ మాధవులలోని సాయణుడు నేతగా, సామ్రాజ్య పోషణలో సుమారు యాభై మంది పండితులలో మాధవులు వేద భాష్యాన్ని నిర్మింపజేశాడు. ఈ భాష్యం నేటికీ అత్యంత ప్రామాణికమైనది. విద్యారణ్యులకు సహపాఠి ఐన వేదాంత దేశికులు నిస్సుంగులై జీవించారు. ఆయన శతాధిక గ్రంథకర్త రామానుజుల శ్రీభాష్యం, శుద్ధ ప్రకాశిక అనే గొప్ప వ్యాఖ్యానం ఆ రోజుల్లో వెలువడింది. శ్రీరంగ క్షేత్రం మీద తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు ఆ గ్రంథాన్ని ఇసుకలో దాచిపెట్టి దానిమీద తాము విగతజీవులైనట్లు పడి ఉండి ఆ గ్రంథాన్ని రక్షించినట్లు ఒక గాథ. మాధవులు విద్యారణ్యులనే ఆశ్రమ నామం తో శృంగేరి జగద్గురుపీఠాన్ని అధిష్ఠించారు. వారి సర్వ దర్శన సంగ్రహం వంటి గ్రంథాలు ప్రసిద్ధమైనవి. అప్పుడే బుక్క రాయలపోషణలో నాచన సోమన అనే గొప్ప తెలుగు కవి ఉండేవారు గత శతాబ్దం తొలిదశ కాలంలో తెలుగు విమర్శకులు ఎర్రన, నాచన సోమనల మధ్య తారతమ్యాన్ని ఎక్కువ, తక్కువల గురించి చర్చించేవారు. చిన్నయసూరి, బహుజనపల్లి సీతారామచార్యులు, వీరేశలింగం ప్రభృతులు నాచనసోమన పక్షాన్ని వహించారు.

భారతక్రమంలో మధ్యముడు, కాలక్రమం లో చివరివాడు ఐన ఎఱ్ఱాప్రగడ.. నన్నయ్య రచింపగా మిగిలిపోయిన అరణ్యపర్వాన్ని ఆయ న పేరుమీద పూర్తిచేశాడు. అదికాక భారతానికి కీలకపర్వమైన హరివంశాన్ని తెలుగుజేశాడు. ఉప పురాణమైన నరసింహ పురాణాన్ని శ్రీలక్ష్మి నృసింహ అవతారంగా కావ్య రూపాన్నిచ్చి నిర్మించాడు. ఈయనకు శంభుదాసుడని పేరు ప్రబంధ పరమేశ్వరుడని బిరుదు. అసంపూర్ణమై న తెలుగు భారతాన్ని పూర్తిచేసి నిబంధించటంచేత ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు అని బిరు దు వచ్చింది. ఈ మూడు గ్రంథాలే కాక రామాయణాన్ని కూడా రచించారు. ఇప్పుడు ఈ గ్రం థం లభ్యం కావటం లేదు. లాక్షణికులు తమ గ్రంథాలలో అక్కడక్కడ ఉదహరించిన పద్యాల ను బట్టి ఈ గ్రంథ ఉనికి తెలియవస్తుంది. నృసింహపురాణం, హరివంశం ఈ రెండు విష్ణు అవతారాలైన విష్ణువు, నరసింహస్వామి మహిమలు వెల్లడించేవే. ఇతడు శంభుదాసుడని పేరుకలిగి ఉన్న వైష్ణవ భక్తి ప్రతిపాదికలైన గ్రంథాల ను రచించి హరిహరుల మధ్య ఐక్యభావాన్ని తెలిపాడు. హరివంశములో వ్రేపల్లెలోవి పల్లీయ లక్షణాలు ప్రకృతి సహజమైన సౌందర్యము కనిపిస్తాయి. అమాయకులైన గోప, గోపికల చిత్తవృత్తులు దర్శనమిస్తాయి. నృసింహపురాణం ఒకవిధంగా అహోబిల క్షేత్ర మహిమలు చెప్పడానికి వచ్చింది. తెలుగు లో వెలువడ్డ తొలి క్షేత్ర మహత్మ్యం. నృసింహస్వామి తాను విష్ణుమయత్వాన్ని సర్వతోవ్యాపకత్వాన్ని నిరూపించేందుకు సభ స్తంభాన్నుంచి ఆవిర్భవించాడు.. ఈ స్తంభం యోగ పద్ధతిలో సుఘమ్న నాడి. స్వామి ఉపాసకులకు హృదయాకాశంలో దర్శనమిస్తాడు.

ఇదే చిదాకాశం. ఆనాహత చక్రానికి అధిపతి సూర్యుడు. సూర్యాధిపత్యం కలది సింహరాశి. ఈ హృదయోపాస న ఉపనిషత్తులలో అనేక సందర్భాలలో చెప్పబడినది. కఠోపనిషత్‌లో ఈ సాధన మృత్యు విజ య కేతువుగా పెద్దలు చెప్పినారు. భగవాన్ రమ ణ మహర్షి సాధకులకు హృదయోపాసనయే ప్రధాన మార్గంగా, తరుణోపాయంగా సూచనచేశారు. అనేక స్థలాల్లో, క్షేత్రాల్లో సుదర్శనమూ ర్తి, నరసింహమూర్తి ముందు, వెనుకగా ఉం టాయి. సుదర్శన మూర్తి ఆత్మ దర్శనానికి శాస్త్రం సూచించే మార్గం. నరసింహమూర్తిలో కొన్ని శివుని లక్షణాలు కనిపిస్తాయి. జఠలు మూడవ కన్ను, తెల్లని రంగు, పినాక ధనుస్సును ధరించుట ఈ అంశం. ఇది హరిహర భేదాన్ని తెలిపే అంశం. ఎఱ్ఱాప్రగడ రచనలను జాగ్రత్తగా, లోతుగా పరిశీలిస్తే ఇతను కేవలం, కవి, తాత్వికుడు మాత్రమే కాక అంతర్యాగ పరాయణుడైన యోగి వలె కానవస్తాడు. ఇతని రచనలలో ఒక సాత్వికత ఆత్మగోపన లక్షణం కానవస్తాయి. కవిత్వాహంకారం ఇతనిలో కనిపించదు. తురుష్కు ల దండయాత్రలు ప్రబలంగా ఉన్న సమయం లో, మతాంతరీకరణలు జరుగుతున్న కాలం లో.. శైవ వైష్ణవ మత భేదాలు తీవ్రస్థాయిలో పొడచూపిన సందర్భంలో హరిహరనాథ తత్వాన్ని తన కావ్యాల ద్వారా ప్రబోధించిన వాడు ఎఱ్ఱా ప్రగడ. కవిత్రయ త్రిమూర్తులలో ప్రబంధ పరమేశ్వరుడు..
- కోవెల సుప్రసన్నాచార్య

156
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles