నీటి మనసు


Mon,June 10, 2019 01:22 AM

నిజానికి చలనశీలమైన కవి ఎప్పుడూ మంచు ముద్దకాడు, కాలేడు. అతనిది నీటి మన సు. నీటికున్నంత స్వచ్ఛత, ఏ మలినాన్నయినా కడిగివేసే సామర్థ్యం, ఏ కాలాన్నయినా కవిత్వం ద్వారా శుద్ధిచేసే తెగువ అతని సొంతం. దీనికి తార్కాణంగా వచ్చిందే డాక్టర్ నందిని సిధారెడ్డి ఇటీవల వెలువరించిన నీటి మనసు కవితా సంపుటి. ఇందులోని కవితలన్నీ తెలంగాణ రాష్ర్ట సాధనానంతర కాలంలో రాసినవే. సిధారెడ్డి గతంలో వెలువరించిన ఏడుపాయల్లాంటి కవితా సంపుటాలకు భిన్నంగా ఈ కవితా సంపుటిలో పల్లె, పట్టణం, విదేశం ఈ మూడు కోణాల్లోనే ఎక్కువ కవితలు సాగాయి. ఇతరాలు కూడా లేకపోలేదు. కాని వాటి సంఖ్య రాశిలో తక్కువ.
Neeti-Manasu
చరిత్రాత్మకమైన తెలంగాణ ఉద్యమం తర్వాత కవు లు ఏం రాయాలో, ఏ సమస్యలు ఇంకా పీడిస్తున్నాయో ఈ సంపుటి చదివితే అర్థం అవుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగి స్వరాష్ర్ట కల సాకారమైన తర్వాత నిజంగానే కవులకు ఎలా స్పందించాలో కొన్నిరోజులు అర్థం కాలేదు. చలనశీ ల కవి ఎల్లప్పుడూ ప్రజల పక్షం వహిస్తాడు. పాలకుల దుర్నీతిని నిలదీస్తాడు.
నువ్వేమిటి?
డబ్బులు పోసి మూటలు పోగేసి
గెలిచిన పార్లమెంటు సీటువి
పాటలు కట్టి జీవితం పణం పెట్టి
హృదయాలు గెల్చిన శిఖరసభ నేను
కలం మూయించగలవా?
ఎందరు నియంతలను చూసిందీ కలం
ఎందరి నియంతల తలలు వంచిందీ కలం.. అంటూ కవి తనదైన బాధ్యతను గుర్తెరిగిన తీరును చెప్పుకున్నాడు.
ఏ కాలంలోనైనా రాళ్లు విసిరేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. అందుకే ఏ గతి రచియించితేని సమకాలం వారు మెచ్చరే కదా! అన్నాడు చేమకూర వేంకటకవి. కన్ను తడవకుండా, గాయం కాకుండా జీవితాన్ని దాటలేం. నటిస్తూ నడిచే కవి కి, వంద నాలుకలతో రకరకాల పల్లవులెత్తుకునే కవికి ఇవే వీ దరిచేరవు. కాని నిజమైన కవి అలా నటించలేడు.చూపు, తొవ్వ రెండూ సమతూకంగా సాగుతాయి. నిజాయితీగా నడిచే కవి తడిలేని అక్షరాన్ని ఆలింగనం చేసుకోలేడు. దాదా పు నాలుగున్నర దశాబ్దాల ప్రయాణంలో ఈ కవిది ఎప్పు డూ పోరాటాల పయనమే. ధిక్కార స్వరమే.

సిధారెడ్డి కవిత్వంలో చెప్పుకోదగ్గది అతని కవితా ఎత్తుగడలు, శిల్పం. ఎంచుకున్న వస్తువును ఒక కొంగ్రొత్త ఎత్తుగడతో గమ్మత్తయిన దారిలో నడిపించి కవిత సాంతం మనస్సుకు హత్తుకునేలా చేయడం ఈయన ప్రత్యేకత.


ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక సాంస్కృతిక పరిమళ వీచిక. ఇక్కడి చెట్లకు పూలు కాదు ఆయుధాలు, నినాదాలు పూసి విద్యార్థులకు పిడికిళ్లను బహుమతిగా ఇస్తాయి. అం దుకే ఈ నేల మీద అనేక ఉద్యమాలు పూస్తాయి. ఓయూ ఎంతోమందికి జీవించడం నేర్పింది. ప్రేమించడం నేర్పిం ది. పోరాడటం నేర్పింది. కలలు కనడం నేర్పింది. వాటిని సాకారం చేసుకోవడమూ నేర్పింది. అందుకే ఓయూ అంటే అందులో చదివిన విద్యార్థులకు అమ్మ మీది మమకారం. నాన్న మీది అధికారం.
ఒక రోజు.. దేశం విడిచిపోతాను
మరొక రోజు.. లోకం విడిచిపోతాను
అయితేమి?అక్షరాల సాక్షిగా..
జీవించే పుస్తకం నేను.. వర్ధిల్లే వాక్యం నేను..
సిధారెడ్డి దృక్పథాన్ని, స్థానాన్ని స్పష్టంగా చెప్పే కవితా పంక్తులివి. తన చిరునామా ఈ లోకంలో ఎట్లా శాశ్వత చిరునామాగా మారుతుందో ప్రకటించే వాక్యాలివి. ఈ కవితా సంపుటి నిండా వస్తు వైవిధ్యం అపారంగా కనిపిస్తుంది. కవితలన్నీ పఠితను ఏదో లోకంలోకి తీసుకెళ్లి ఒక కుదుపు కుదుపి మనల్ని మనం ఎడిట్ చేసుకునేలా చేస్తాయి. ఎట్లా గూ జీవించదలుచుకున్నావు గదా!దమనులూ సిరలూ ధుమధుమలాడే జాతి పౌరుషమై విస్తరించు అంటాడు. ఏడ్చేవాళ్లను ఏడువనీ నవ్వేవాళ్లను నవ్వనీ.. నీ పని నీది, నీ పయనం నీది, నేలను మరువకు,తడితడి గుణం విడువకు, అనుభవం వడగట్టి ధ్యాసంతా కేంద్రీకరించి, అక్షరాలు వెదజల్లడం మరువకు లాం టి వాక్యాలు మార్చింగ్ వాక్యాల్లా మనిషిని ముం దుకు నడిపిస్తాయి. అదే సమయం లో నేటి తరం ఎంతగా చేవగారి పోతున్నారో చెప్పి మన్నుతిన్న పాముల వైఖరిని ఈసడించుకుంటారు. ఆకాశా న్ని వంచి హరివిల్లు చేయగలవాళ్లు, వాట్సాప్‌లో వట్టిపోతున్నారు.. అంటూ ఇప్పటి యువత ఏ మత్తు లో పడి విలువైన కాలాన్ని జారవిడుచుకుంటున్నారో చెప్పి హెచ్చరిస్తారు.

సిధారెడ్డి కవిత్వంలో చెప్పుకోదగ్గది అతని కవితా ఎత్తుగడలు, శిల్పం. ఎంచుకున్న వస్తువును ఒక కొంగ్రొత్త ఎత్తుగడతో గమ్మత్తయిన దారిలో నడిపించి కవిత సాంతం మనస్సుకు హత్తుకునేలా చేయడం ఈయన ప్రత్యేకత. సిధారెడ్డి ఏది చెప్పినా కవి పీడితుని వైపు, బాధితుని వైపు, సగటు మనిషి వైపు నిలబడటం కనిపిస్తుంది. ఇందులోని నలభై కవితలు నలభై కొత్త కోణాల్ని ఆవిష్కరించి తెలంగాణ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని, ప్రపంచాన్ని మన కళ్లముందుంచి కాసింత తడిని మన గుండెకు అందించి వెళ్తాయి. అందుకే కవే అన్నట్టు కవి పుట్టువడి నది పుట్టువడి ఒకటే. నీటి మనసు లోలోతుల్లోకి తవ్వుకుంటూ వెళ్లినా కొద్దీ ఊరుతత్త్వం, నీటి తత్త్వం, మనిషి తత్త్వం బోధపడుతాయి. నెత్తుటి కత్తిని కడిగిన నది నీటిలాగా నిదానంగానే అయినా ఒక రక్తపు జీర మన మనసు మూలల్లోకి చేరుకుంటుంది.

- డాక్టర్ వెల్దండి శ్రీధర్ 9866977741

195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles