తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఆధారాల పునరధ్యయనం


Mon,June 3, 2019 01:25 AM

తిక్కన, ఎర్రనలు పుర వర్ణనతో కావ్యాలనారంభించారు. మొల్ల అదే పనిచేసింది. అది కేవలం ప్రబంధాలల్లో ఉన్నదే కాదు. అంతేగాక మొల్ల చిల్లర రాజలోకము మెచ్చ అని చిల్లర శబ్దం వాడింది. ఇది దేశ్య పదం. తెలంగాణలో వాడుకలో ఉంది. తెలంగాణ తెలుగు నుంచి ఉర్దూలోకి పోయింది. ఈ తెలంగాణ లక్షణ పదాన్ని వాడిన మొల్ల తెలంగాణ కవయిత్రి
కాకుండా ఎట్లా ఉంటుంది.


తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదం ఉద్యమంలో భాగంగా కవు లు రచయితలు చరిత్రకారులు ఎన్నో మరుగునపడిన విషయాలను తవ్వితీశా రు. ఆంధ్రుల చరిత్రకు తెలంగాణ పురిటిగడ్డ అని ఎన్నడో ప్రసిద్ధ పరిశోధకుడు కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్నారు. ఆ విధంగా శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల అని అక్కడ దొరికిన నాణేల ఆధారంగా ప్రతిపాదిస్తున్నాం. దాన్ని మహారాష్ట్రలో మరెవరో అంగీకరించటం లేదని మనం వెనుకడుగు వేయటం లేదు. అదేవిధంగా క్రీ.శ. 1000లో విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం. విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం పద్యాలను రచించిందన్న విషయాన్ని డాక్టర్ భిన్నూరి మనోహరి గారు ఖండిస్తున్నారు. పండరంగు వేయించిన శాసనాలను పండరంగుడే రచించాడని నిడదవోలు వెంకటరామగారు అన్నప్పుడు ఎవరేమి ఎదిరించలేదు. కానీ ఒక స్త్రీ కామసాని గూడూరు శాసనంలోని పద్యాలు రాసిందంటే కాదని అంటున్నారు. అంటే ఒక స్త్రీ అందమైన పద్యాలు రాయలేదనా వాళ్ల అభిప్రాయం! ఇంకొకటి- కామసాని భర్త మనోహరి గారు అన్నట్లు భీమ భూపాలుడు కాదు, అతని కొడుకు ఎర్రభూపతి! ఈ ఎర్రభూపతి ముదిగొండ చాళుక్య రాజయిన బొట్ట బేతని పక్షం వహించి వాని వైరిని చంపి కొరవి దేశ సింహాసనంపై ప్రతిష్ఠించపజేశాడని విరియాల కామసాని గూడూరు శాసనంలోనే ఉన్నది.

అంటే బి.ఎస్.ఎల్. హనుమంతరావు తమ ఆంధ్రుల చరిత్రలో అంటారు- త్రివ్వక శాసనం ప్రకారం ఎర్రభూపతి కాకత్య గుండ్యినను వధించి బొట్ట బేతనను కొరవి సింహాసనం మీద ప్రతిష్ఠింపజేశాడు. కామసాని కాకతీయ ప్రభువుల సోదరి అంటుంది మనోహరి గారు. దానికి ఆధారమేమిటి? కాకతీయుల సోదరి అయితే ఆమె భర్త కాకత్య గుండనను చంపి కొరవి వాళ్లకు సహాయం ఎట్లా చేస్తాడు. గుండన కొడుకు బేతన చిన్నవాడని, కామసాని తన భర్త మరణానంతరం చేరదీసి రాజ్యం కోల్పోయి నిస్సహాయుడై ఉన్నాడని గరుడ బేతనన్ భూపతిని కాకతి వల్లభు చిన్నవాని తాన్ పరగన్ చేతబట్టి.. కాకతి సింహాసనం మీద నిల్పింది-అని గూడూరు శాసనంలో ఉంది. ఈ శాసనం లో చాలా చరిత్ర ఇమిడి ఉంది. అంతేకాదు కామసాని మంచి రాజకీయ నిపుణురాలు. కాబట్టియే రాష్ట్రకూట తైలపుని ఆశ్రయించి ఆమె ముదిగొండ చాళుక్యుల అంతిమ దశలో తన చాణక్య నీతిని ప్రదర్శించి గరుడ బేతనను కాకతి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఇంత రాజకీయ చాతుర్యం గల కామసానిలో సాహిత్య చాతుర్యం లేదని ఎట్లా చెప్పగలం. అందులో ఆ శాసనాన్ని రచించిన వాళ్ల పేరు లేదు. ఇంత అందమైన పద్యాలు అప్పటికి తెలుగులో అరుదైన పద్యాలు చెప్పిన కవి తన పేరును చెప్పుకోకుండా ఎట్లా ఉంటాడు. కాదు గనుకనే ఆ పద్యాలు రచయిత్రి విరియాల కామసాని అన్న అభిప్రాయం నిడదవోలు వారిని అనుసరిస్తూ నేను ప్రతిపాదించాను.

ఇంకో విషయం- ఈ గరుడ బేతన కాకతీయ సింహాసనం ఎక్కింది, పై కల్లోల రాజకీయాలు నడిచింది క్రీ.శ.1000లో. క్రీ.శ 900 ప్రాంతంలో గుండన రాష్ట్ర కూటుల సేనాపతిగా పరాక్రమం చూపాడు. కనుకనే అతన్ని, అతని కుమారుని ఎర్రనను రాష్ట్రకూట కృష్ణుడు కర్రవాడికి అధిపతులుగా చేశాడు. ఆ కుర్రవాడియే తర్వాత కాకతి రాజ్యంగా వర్ధిల్లింది. ఎర్రన కొడుకు బేత య. ఈ బేతనను ముదిగొండ చాళుక్యులు తరిమివేశారు. బేతన కొడుకు గుండన. గుండన కొడుకు పిన్న వయస్కుడు. బేతనను రాజ్యం కోల్పోయినవాని మీద కరుణించి కామసాని సింహాసనం మీద కూర్చుండబెట్టింది. ఇదంతా నాలుగు తరాల కథ కాబట్టి వేగంగా జరిగిన చరిత్ర కాబట్టి వంద సంవత్సరాల కంటే ఎక్కువ పట్టి ఉండదు. అప్పుడు విరియాల కామసాని గూడూరు శాసనం క్రీ.శ. 1000 నాటి సంఘటనను చెప్తున్నది. శాసన కాలం క్రీ.శ. 1052 అనటమే సమంజసం. కాని ఎప్పుడో జరిగిన సంఘటనను క్రీ.శ. 1124గా పేర్కొనటం సమర్థవంతంగా లేదు. క్రీ.శ. 1124లో రెండో ప్రోలరాజు కాకతిని పరిపాలిస్తున్నారు. బేతన పరిపాలనా కాలం క్రీ.శ. 992-1000. మరి శాసనం క్రీ.శ.1124 ఎట్లా వేస్తారు. ఇక కుప్పాంబిక రంగనాథ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి కూతురు. అందులో ఏమీ సందేహం లేదు. తండ్రి కవితా ప్రతిభ కూతురులో కన్పించటం ఏమీ నిరాధారం కాదు. ఆమె పద్యం ఒకటి అయ్యలరాజు కూర్చిన పద్య సంకలనంలో దొరుకుతున్నది. దాని ఆధారంగా ఆమె కవయిత్రి అని చెప్పటంలో పెద్ద తప్పులేదు.

మొల్ల రెండో ప్రతాపరుద్రుని కాలంలో అతని ఆస్థానంలో ఉన్నదని, ఆమె శూద్రురాలు కాబట్టి ఆమె రామాయణ కావ్యాన్ని ఆ రాజుకు అంకితంగా ఇయ్యటానికి వీల్లేదని ఆస్థాన పండితులు అడ్డు పలికారని ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రములో ఉంది. మొల్ల పోతన లాగానే రామభక్తురాలై పోతన లాగానే రాజుల నిరసిస్తూ పోతన పద్యాలను పోలిన పద్యాలను రాసింది. ఇది 16వ శతాబ్దంలో ఉన్న నెల్లూరులో ఉన్న కవయిత్రి రాసిందంటే ఎంత నిజమో ఆలోచించాలి. తిక్కన, ఎర్రనలు పుర వర్ణనతో కావ్యాలనారంభించా రు. మొల్ల అదే పనిచేసింది. అది కేవలం ప్రబంధాలల్లో ఉన్నదే కాదు. అంతేగాక మొల్ల చిల్లర రాజలోకము మెచ్చ అని చిల్లర శబ్దం వాడింది. ఇది దేశ్య పదం. తెలంగాణలో వాడుకలో ఉంది. తెలంగాణ తెలుగు నుంచి ఉర్దూలోకి పోయింది. ఈ తెలంగాణ లక్షణ పదాన్ని వాడిన మొల్ల తెలంగాణ కవయిత్రి కాకుండా ఎట్లా ఉంటుంది. ఇప్పటికి ఒంటిమిట్ట పేరుతో పోతన మావాడు అంటున్నారు. అవునని ఇచ్చేస్తామా? ఓరుగల్లులో రెండో ప్రతాపరుద్రుని కాలంలో సంస్కృతంలో 74 కావ్యాలు రచించిన గొప్ప సంస్కృత పండితుడు అగస్త్యుడు ఉన్నాడు. అతని మేనల్లుడు విశ్వనాథు డు, అగస్త్యుని దగ్గర విశ్వనాథుని దగ్గర సంస్కృతం పాం డిత్యం సంపాదించింది గంగాదేవి. అంటే ఆమె మొదట ఓరుగల్లు నివాసియే.

బుక్కరాయల కొడుకు వీర కంపరాయలు గంగాదేవిని వివాహం చేసుకున్నారు. కాబట్టి తర్వాత విజయనగర స్థాపన తర్వాత ఆమె విజయనగరానికి వెళ్లిపోయింది. సంస్కృతంలో మొట్టమొదట మహాకావ్యం రచించిన కవయిత్రి గంగాదేవి. మన చరిత్రను మనం నిర్మించుకుంటున్న సమయంలో అడుగులు తడబడకూడదు. నిజమే కాని ఇన్నాళ్లు పాతుకుపోయిన వాదనలను ఎదిరించి మన వాళ్లను మనలో కలుపుకోవటంలో తప్పేమి లేదు. ఇం కా పిడివాదాలు నడువవు. చరిత్రను సరిగ్గా అవగాహన చేసుకొని అభిప్రాయాలను నిర్మించుకునే దశలో మనం ఉన్నాం. కాబట్టి మనోహరి గారు చెప్పినట్టుగా ఆధారాలను, ప్రమాణాలను పక్కన పెడ్తలేము కాని ఆధారాల ను పునరధ్యయనం చేస్తున్నాం! కొత్త ప్రమాణాలను చూపుతున్నాం.
- ముదిగంటి సుజాతారెడ్డి

185
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles