సాహిత్య చరిత్ర నిర్మాణంలో ప్రామాణికత అవసరం


Mon,May 27, 2019 01:09 AM

కవయిత్రి మొల్లకు సంబంధించి కూడా వివరణ, ఆధారాలు స్పష్టంగా లేవు. పూర్వ సాహిత్యకారులు మొల్లను 16వ శతాబ్దికి చెందినదిగా చెప్తున్నారు. కానీ ఈ వ్యాసంలో మొల్ల ఓరుగల్లు నివాసి అని, క్రీ.శ. 1350-1400 మధ్య కాలంనాటి కవయిత్రి అని పేర్కొన్నారు. మధురా విజయం రచించిన గంగాదేవి కూడా ఓరుగల్లు నివాసిని అని పేర్కొన్నారు. కానీ స్పష్టమైన ప్రమాణం చూపించలేదు.

నమస్తే తెలంగాణ దినపత్రిక మే 6, సోమవారం నాడు కలరు ప్రాచీన కవయిత్రులెందరో.. అన్న వ్యాసం చదివిన తరువాత ఈ వ్యాసం రాయాలనిపించింది. కొన్ని సంవత్సరాల చారిత్రక, రాజకీయ, సామాజిక, సాహిత్య పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నాటినుంచి, అంతకు పూర్వం నుంచే ఇక్కడి ప్రాంత చరిత్ర, సాహిత్య మూలాల అన్వేషణకు శ్రీకారం చుట్టబడింది. పలువురు పరిశోధకులు, సాహిత్య, చరిత్రకారులు చరిత్రకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి పరిశోధనలు చేశారు, చేస్తున్నారు. వారి పరిశోధనల్లో ప్రామాణికతకు కూడా వారే నిర్ణాయకులుగా ఉంటున్నారు. పూర్వం సాహిత్యకారులు, చరిత్ర పరిశోధకులు చేసిన శ్రమను, వారి ఫలితాలను గుర్తించవలసిన అవసరం ఉన్నది. వారిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త అంశాలను శోధించి వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.

తెలంగాణ ప్రాంతం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. ఇక్కడి చరిత్రకు, సాహిత్యానికి విలువ లేకుండాపోయింది. ఆ సమయంలో సొంత రాష్ట్రం ఏర్పడటంతో అందరిలో నూతనోత్సాహం కలిగి ఈ ప్రాంతానికి చెందిన ఎన్నో అంశాలను వెలుగుచూపాలనే ఉద్దేశంతో ముందుకుసాగుతున్నారు. ఆ ప్రయాణంలో పూర్వ చరిత్రలో కొన్ని అభూత కల్పనలకు, సాహిత్యంలో అసమంజసతలకు తావిస్తున్నారు. ఆధారాలను, ప్రమాణాలను పక్కనపెడుతున్నారు. సాహిత్యపరంగా తెలంగాణలో చాలామంది కవులు, పండితులు పరిశోధకులు వెలుగు చూడనివారున్నారు. వారి మూలాలను వెతికే ప్రయత్నం లో భాగంగానే కొండపల్లి నీహారిణి గారి వ్యాసం కలరు ప్రాచీన కవయిత్రులెందరో.. అన్నది. ఈ వ్యాసంలో రెండు మూడు అంశాలు అసమంజసం అనిపిస్తున్నాయి.

1. క్రీ.శ.1000 ప్రాంతంలో విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం, ఆ శాసనాన్ని వేయించిన కామసాని మొదటి కవయిత్రి అని పేర్కొన్నారు. దీనికి ఆధారం ముదిగంటి సుజాతారెడ్డి గారి గ్రంథాన్ని పేర్కొన్నా రు. చారిత్రకంగా చూస్తే కామసాని విరియాల వంశానికి కోడలు. కాకతీయ ప్రభువుల సోదరి. ఈమె వేయించినదే గూడూరు శాసనం. ఈ శాసనంలో 3 చంపకమాలలు, 2 ఉత్పలమాలలు ఉన్నట్లు, శాసనం వేయించింది. కాబట్టి ఈ పద్యాలు రాసిన కామసాని తప్పకుండా గొప్ప కవయిత్రి అని నిర్ధారిస్తున్నారు అని రాశారు. మొదట మనం తెల్సుకోవాల్సింది శాసనం వేయించినారు అంటే ఆ శాసనాన్ని రచించారనో లేదా అందులో పద్యాలు రాశారనో అర్థం కాదు. శాసనం వేయించేవారు ఎప్పుడూ శాసన రచయితలు కారు. అది గుర్తుంచుకోవాలి. ఒక రాజు లేదా రాణి ఎవరైనా ఏదైనా అంశానికి సంబంధించి నలుగురికి తెలియచెప్పాలంటే పూర్వకాలంలో శాసనాలు వేయించేవారు.

ఈ శాసన ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. మొదట సంకల్పం చేసుకున్న దాత. అతడు ఇవ్వదలచుకున్న దానం, చెప్పదల్చుకున్న అంశాన్ని రాజ్యంలో అధికారులకు చెప్తాడు. ఆ అధికారి ఆస్థానంలో ఉన్న పండితుడికి చెప్తే అతడు శాసనాన్ని లిఖితరూపంలో రాసి ఇస్తాడు. అతడే శాసన రచయిత. ఆ తర్వాత అధికారి శాసనాన్ని లిఖించేవారికి ఆ శాసనం ఇస్తే అతడు శిలమీద రాస్తాడు. అతడు శాసన లేఖకుడు, శాసనాన్ని చెక్కేవాడు. అతడు శాసన శిల్పి. ఇవన్నీ రాజుగారి పర్యవేక్షణలో జరుగుతాయి. ఒక శాసనాన్ని లేదా అందులో పద్యాలు లేదా శ్లోకాలు ఉన్నాయంటే అవి శాసన రచయితవే కాని శాసనా న్ని వేయించినవారివి కాదు. ఈ లెక్కన శాసనంలోని పద్యాలు రాసినది కామసాని కాదు. కేవలం శాసనం వేయించినది మాత్రమే అవుతుంది.

2. పాండవ మధ్యమ భీముడోయనన్.. అని విరియాల కామసాని తన భర్త విరియాల భీమ భూపాలుని పరాక్రమాన్ని ఉత్ప్రేక్షాలంకారంలో వర్ణించింది. విరియాల కామసాని తన భర్త మరణానంతరం రాచకార్యానికి పూనుకొని, శత్రునాశనం చేసి, కాకతీయ బేతయను కాకతి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ సందర్భంలో వేయబడిన ఈ శాసనాన్ని వేయించిన విరియాల కామసాని తెలంగాణలో మొదటి కవయిత్రి. ఈ శాసనంలో విరియాల వంశ ప్రతిష్ట, వారి వంశానుక్రమం పేర్కొనబడినాయి. విరియా ల వంశానికి మూల పురుషుడు దుర్జయ కుల సంజాతుడైన పోరంటి వెన్న సేనాని. అతని తర్వాత ఎట్ట భూపతి, భీముడు, ఎట్టి నరేంద్రుడు, సూర సేనాని, బేతడు వరుసగా ఉన్నారు. వ్యాసంలో వీరు పేర్కొన్న రెండు పద్యాల్లో వంశానుక్రమం తెలుస్తుంది. అనుపమ దుర్జయాన్వయ.. పద్యంలో వెన్నడు, అతని కుమారుడు ఎఱభూపతి. భావిత కీర్తి నాతనికి.. అనే పద్యంలో భీముడు, అతని కుమారుడు ఎట్టి నరేంద్రుడు పేర్కొనబడినారు.

కాకతి గుండరాజు కుమారుడు గరుడ బేతరాజు. ఇతడే బేతరాజు. గుండన మరణానంతరం రాజ్యహీనుడైన బేతరాజు పరిస్థితిని గమనించి మేనత్త అయిన విరియాల కామసాని తన భర్త ఎఱ నరేంద్రుడితో కలిసి చాళుక్య తైలపుని కలిసింది. భర్తతో కలిసి చక్రవర్తికి నచ్చచెప్పి తన మేనల్లుడికి అనుమకొండ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇప్పించింది. బేతరాజు చాళుక్య చక్రవర్తికి విధేయ సామంతుడుగా ఉన్నాడు. పుట్టింటివారు నిరాశ్రయులైనప్పుడు కామసాని దయాగుణంతో, ధైర్యం గా కాకతీ రాజ్యాన్ని తిరిగి నిలబెట్టి భవిష్యత్తులో పెద్ద సామ్రాజ్యంగా రూపుదిద్దుకునేందుకు మార్గదర్శనం చేసింది. పేర్కొన్న శాసనాధారాన్ని బట్టి కామసాని భర్త విరియాల ఎజ్జ నరేంద్రుడు కాని భీమ భూపాలుడు కాడు. అంతేకాదు భర్త మరణానంతరం కాదు, భర్తతో కలిసి ఆమె ఈ విజయం సాధించింది. శత్రు వినాశనం కాదు సమయస్ఫూర్తితో ప్రవర్తించింది. శాసన కాలం కూడా క్రీ.శ. 1000 కాదు. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఏపి వరంగల్ జిల్లా శాసనం అనే పుస్తకం (డాక్టర్. పి.వి.పరబ్రహ్మశాస్త్రిగారు ఎడిటర్)లో కామసాని గూడూరు శాసనం కాలం చాళుక్య విక్రమ శకం 49= క్రీ.శ. 1124గా పేర్కొన్నారు.

3.కుప్పాంబిక గురించి: కవిత్వ నైపుణ్యాన్ని చూస్తే కావ్య రచయిత్రి అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంలో గొప్ప కవయిత్రి కుప్పాంబిక అనవ చ్చు. కుప్పాంబికకు సంబంధించి కూడా ఈ అంశా న్ని ప్రస్తావించాల్సి వస్తుంది. ఈమె మల్యాల వం శానికి చెందిన గుండ దండాధీశుని భార్య. గోన వంశానికి చెందిన బుద్ధారెడ్డి కుమార్తె, గోన గన్నారెడ్డి సోదరి. విరియాల, మల్యాల, గోన, నతవాడి, రేచర్ల వంశీయులు కాకతీయులకు సామంతులు. వీరు పరస్పరం స్నేహపూర్వకంగా ఉండి సంబంధ బాంధవ్యాలు జరుపుకునేవారు. అట్లా జరిగిందే గోన మల్యాల వంశీయుల మధ్య వివాహ సం బంధం. కుప్పాంబిక తన భర్త మరణానంతరం బూదపురంలో ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడి గుండేశ్వర దేవుడికి అనేక దానాలు చేసి శాసనం వేయించింది. ఇందులో కుప్పాంబిక సకల గుణగణాలంకృత, పతివ్రత, వ్రతమును ఆచరించిన వని త, అనేక వ్రతాలను నిర్వహించిన పుణ్యాత్మురాలుగా పేర్కొనబడింది కానీ, ఈమె కవయిత్రి అని, రచయిత్రి అని ఎక్కడా లేదు. ఇంకా ఈ శాసనాన్ని రచించినది పదక్రమయుత యజుర్వేద పారగ, శబ్ద విద్యా విశారద కవీశ్వరుడైన ఈశ్వర భట్టోపాధ్యాయుడు. ఇంకా ఈ వ్యాసంలో కుప్పాంబిక తర్వాతి కా లంవాడైన అయ్యలరాజును పేర్కొన్నారు. కుప్పాంబిక రచించిందని ఒక పద్యాన్ని పేర్కొన్న ట్లు రాశారు.

ఈ అయ్యలరాజు రచించిన గ్రంథమేదో పేర్కొనలేదు. అది ముద్రణ పొందిందా లేదా? తెలియదు. ఇతని కాలం కూడా పేర్కొనలేదు. ని జానికి అయ్యలరాజు రచించిన గ్రంథం సకల కథా సార సంగ్రహం. ఇది అముద్రితం. మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. కుప్పాంబిక గుండదండాధీశుని భార్య. ఈ మె శాసనం వేయించిన కాలం క్రీ.శ. 1276. ఒకవేళ ఈమె కవయిత్రి అయి ఉంటే దానికి సంబంధించిన సమాచారం శాసనంలో పేర్కొనబడేది. వ్యాసంలో కవయిత్రి మొల్లకు సంబంధించి కూడా వివరణ, ఆధారాలు స్పష్టంగా లేవు. పూర్వ సాహిత్యకారులు మొల్లను 16వ శతాబ్దికి చెందినదిగా చెప్తున్నారు. కానీ ఈ వ్యాసంలో మొల్ల ఓరుగల్లు నివాసి అని, క్రీ.శ. 1350-1400 మధ్య కాలంనాటి కవయిత్రి అని పేర్కొన్నారు. మధురా విజయం రచించిన గంగాదేవి కూడా ఓరుగల్లు నివాసిని అని పేర్కొన్నారు. కానీ స్పష్టమైన ప్రమా ణం చూపించలేదు.

ఊహాగానంతో ఈ ఇద్దరిని ఓరుగల్లు వాసులను చేసి తెలంగాణ అభిమానాన్ని చాటుకున్నారు కానీ సాహిత్యలోకంలో ఆధార ప్రమాణాలను తగ్గించినవారైనారు. తెలంగాణ చరిత్ర, సాహిత్యచరిత్ర నిర్మాణ క్రమం ఏర్పర్చుకుంటున్న క్రమంలో మన చరిత్ర ను తవ్వి చూసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. సరైన మార్గంలో లభించిన ఆధారాలను అధ్యయ నం చేసి అవగాహన చేసుకొని ఒకటికి రెండుసా ర్లు నిర్ధారించుకొని సాహిత్యలోకానికి అందించే ప్రయత్నం చేద్దాం. మచ్చలేని చరిత్రను నిర్మిద్దాం.
- డాక్టర్ భిన్నూరి మనోహరి
93479 71177

199
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles