ఇది అంతరిక్షంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌: సైంటిస్టులు

Wed,March 27, 2019 05:36 PM

This is a Surgical Strike in Outer Space say Scientists on Mission Shakti

న్యూఢిల్లీ: ఇండియా నిర్వహించిన యాంటీ శాటిలైట్ (ఏ-శాట్) మిస్సైల్ టెస్ట్‌ను అంతరిక్షంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌గా అభివర్ణించారు శాస్త్రవేత్తలు. భూమికి 277 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ శాటిలైట్‌ను ప్రయోగంలో భాగంగా పేల్చేశారు. ఆ శాటిలైట్‌ పేరు మైక్రోశాట్-ఆర్ఏ. 740 కిలోల బరువున్న ఆ శాటిలైట్‌ను భారత్ ఈడాది జనవరిలో అంతరిక్షంలోకి పంపింది. దీనికి ఆపరేషన్ శక్తి అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో ఉన్న భారత సంపదను రక్షించుకోవడానికి ఈ ప్రయోగం చాలా అవసరమని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. LEO(Low Earth Orbit)..అంటే 2000 కి.మీ ఎత్తులో భూకక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్‌ను పేల్చేయగల సత్తా తమకు ఉందని ఇండియా ఈ మిషన్ ద్వారా నిరూపించింది. ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా భారత్‌కు చెందిన 49 శాటిలైట్లు అంతరిక్షంలో తిరుగుతున్నాయి.

వాటిని కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యం. నిజానికి పదేళ్ల కిందటి నుంచే యాంటి శాటిలైట్ మిస్సైల్ పరీక్షలను నిర్వహించుకునే సామర్థ్యాన్ని భారత్ సంపాదించుకుంటున్నట్లు డీఆర్డీవో సీనియర్ సైంటిస్టు ఒకరు వెల్లడించారు. నిజానికి భూమి నుంచి అంత ఎత్తులో తిరుగుతున్న ఓ శాటిలైట్‌ను కూల్చేయడం అంత సులువు కాదు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బుల్లెట్‌ను మరో బుల్లెట్‌తో కొట్టడంలాంటిదే అని, ఈ టెక్నాలజీతో పనిచేయని శాటిలైట్‌ను కూల్చేయొచ్చని ఆ శాస్త్రవేత్త ఈ మిషన్ గురించి వివరించారు. యాంటీ శాటిలైట్ ఆయుధాలను అత్యంత కీలకమైనవిగా అగ్రదేశాలు భావిస్తాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం శాటిలైట్లపైనే ఆధారపడి నడుస్తున్నది. అందువల్ల ఆ శాటిలైట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది. ఈ యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ టెక్నాలజీని అమెరికా, రష్యా, చైనాలు కూడా ఇదివరకే కలిగి ఉన్నాయి. మనదేశం నాలుగోది.

2480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles