పంట నిల్వకు రైతు బంధు పథకం..

Thu,November 10, 2016 03:07 PM

Telangana State to Introduce Rythu Bandhu Scheme

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి బంధువుల్లా సహాయపడనున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఎంతోకొంతకు అమ్ముకొని నష్టపోవాల్సిన అవసరం లేకుండా అనుకున్న ధర వచ్చే వరకు సరుకు నిల్వ ఉంచుకునేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఆరునెలల పాటు ఎలాంటి వడ్డీ వసూలు చేయకుండా సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించింది. దీనిపై అవసరమైతే రుణం తీసుకునే వెసులుబాటునిచ్చింది. సరుకు నిల్వ ఉంచుకున్న రైతు అనుకోని ప్రమాదాల బారిన పడితే వారికి రైతు బీమా పథకం అండగా నిలువనుంది. ఈ పథకం ద్వారా రైతుకు జరిగిన ప్రమాదాన్ని బట్టి బీమా చెల్లించనుంది. ఈ పథకాలపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన ఉంటే వారు పండించిన పంటలను భవిష్యత్తులో తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయే ప్రమాదం నుంచి దూరం కావచ్చు. రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను మార్కెట్ యార్డులకు తీసుకొస్తారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సరైన గిట్టుబాటు ధరలు లేక ఎంతో కొంతకు అమ్ముకొని ఇంటి దారి పడతారు. కానీ వారు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయన్న విషయం తెలియక అరకొర ధరలకు వారి పంట ఉత్పత్తులను అమ్ముకొని నష్టాల పాలవుతున్నారు. వీరి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతన్నలు ప్రమాదాల బారిన పడ్డప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున వారికి నష్టపరిహారం చెల్లించేందుకు గాను రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటిపై సరైన అవగాహన ఉంటే రైతన్నలు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది.

రైతు బీమా పథకం
రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డుల్లో అమ్మేందుకు వచ్చిన రైతులు లేదా వ్యవసాయ పనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందిన వారికి బీమా సొమ్ము చెల్లించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లినప్పుడు విద్యుత్ ప్రమాదం, పాముకాటు, ఇతర కారణాలతో మరణిస్తే వారికి ఈ రైతు బీమా పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది.

మార్కెట్ కమిటీల ద్వారా బీమా
రైతు బీమా పథకం ద్వారా ఏఏ మార్కెట్ యార్డుల్లో రైతులు పండించిన పంటలు అమ్మకాలు సాగిస్తారో ఆ మార్కెట్ కమిటీల ద్వారా రైతు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గాని లేదా పాక్షిక అంగవైకల్యానికి గురైనా బీమా ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ పథకం ద్వారా కేవలం రైతులే కాకుండా మార్కెట్‌లో పని చేస్తున్న హమాలీలు, దడ్వాయిలు, ఇతర కార్మికులు లబ్ధిపొందవచ్చు.

రూ.లక్ష పరిహారం..
రైతులు, దడ్వాయిలు, హమాలీలు ఇతర కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఈ పథకం ద్వారా పరిహారం అందజేస్తారు. శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.75వేలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.25వేలు చెల్లిస్తారు. రైతులు ఈ బీమా పథకాల గురించి తెలుసుకొని సకాలంలో స్పందిస్తే వారు పండించిన పంటలకు రైతు బంధు పథకం ద్వారా, రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. రైతులు పండించిన పంటలు మార్కెట్‌కు తరలివస్తున్న వేళ ఈ బీమా పథకాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో మేలు.

రైతు బందు పథకం
పండించిన పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు గోదాంలలో నిల్వ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకు గాను రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం గురించి రైతులు తెలుసుకుంటే వారు పండించిన పంటలకు మద్దతు ధరను పొందే అవకాశం ఏర్పడుతుంది. చాలా మంది రైతులకు ఈ రైతు బంధు పథకంపై అవగాహన లేక ఈ పథకాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. ఈ పథకం ద్వారా రైతులు వారు పండించిన పంటలను నిల్వ ఉంచుకొని మార్కెట్లో అధిక ధర ఉన్నప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది.

ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ..
రైతు బంధు పథకం ద్వారా నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఉంటుంది. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత మాత్రం అనగా 181 రోజు నుంచి 270 రోజుల వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో లబ్ధి పొందవచ్చు.

రూ.2లక్షలు రుణం పొందవచ్చు
రైతులు వివిధ గోదాముల్లో నిల్వ ఉంచిన పంటలపై రుణం పొందే అవకాశం ఉంది. నిల్వ ఉన్న సరుకు మొత్తం విలువలో 75శాతం లేదా గరిష్టంగా రూ.2లక్షల వరకు రుణాన్ని తీసుకునే సదుపాయాన్ని ఈ రైతు బంధు పథకం ద్వారా లభిస్తుంది. రైతులు నిల్వ ఉంచిన పంటలకు పూర్తి భద్రత ఉండడంతో పాటు రైతులు నిల్వ ఉంచిన ఉత్పత్తులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. రైతులు ఈ పంటలను 180రోజులు (6నెలల పాటు) గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు వీలుంది. అప్పటికీ పంటకు ఆశించిన సరైన ధర రాకపోతే రైతుల అభ్యర్థన మేరకు 270రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పిస్తారు.

అందుబాటులో గోదాములు
రైతులు పండించిన కందులు, మినుము లు, సోయాబీన్, పెసర, వేరు శనగ, నువ్వులు, మొక్కజొన్న, వరి తదితర పంటలను నిలువ ఉంచుకునేందుకు జిల్లాలో గోదాంలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ కమిటీ గోదాం లు, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో రైతులు నిలువ ఉంచుకునేందుకు అవకాశం ఉంది. రైతులు గోదాముల్లో నిల్వ ఉంచిన సరుకులకు ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందే వీలుంది. వానాకాలంలో గాని, యాసంగిలో గాని రైతులు పంటలు చేతికి అందాక నేరుగా వ్యవసాయ మార్కెట్లకు తీసుకొచ్చి మద్దతు ధర ఉన్నా లేకున్నా అమ్మకాలు సాగిస్తుంటారు. అయితే అన్నదాతలకు వారు పండించిన పంటలను నిలువ ఉంచుకునేందుకు గాను ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

4724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles