స్టార్టప్‌లకు ఆర్థికమంత్రి వరం

Tue,March 1, 2016 12:57 AM

Startup Finance Minister boon

-లాభాలపై మూడేండ్ల దాకా పన్ను మినహాయింపు
-ఈ సమావేశాల్లోనే కంపెనీల చట్టం సవరణకు బిల్లు
-తద్వారా ఒక్కరోజులోనే కంపెనీల రిజిస్ట్రేషన్: జైట్లీ వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: స్టార్టప్ ఇండియా కార్యాచరణకు మరింత ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని విధానపరమైన నిర్ణయాలను ప్రకటించింది. తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను ప్రకటించారు. స్టార్టప్‌లతో నూతన ఆవిష్కరణలు వస్తాయని, ఉపాధి లభిస్తుందని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అవి కీలక భాగస్వాములుగా ఉంటాయని పేర్కొన్న మంత్రి, వాటికి లాభాలపై మొదటి మూడేండ్ల పాటు వంద శాతం పన్ను రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2019 మధ్య ప్రారంభమైన స్టార్టప్ సంస్థలకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. స్టార్టప్ సంస్థలు తమ మూలధన లాభాలను ఇతర క్రమబద్ధమైన/గుర్తింపు పొందిన నిధులలో పెట్టుబడి పెడితే వాటిపై పన్ను విధించబోమని పేర్కొన్నారు. కంపెనీల చట్టం-2013ను సవరిస్తూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు.

తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలకు ఎదురయ్యే ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయని అన్నారు. బిల్లు ఆమోదం పొందితే కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక్కరోజులోనే పూర్తవుతుందని చెప్పారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 10 శాతం ఆదాయ పన్ను రేటుతో ప్రత్యేక పేటెంట్ పాలనను జైట్లీ ప్రతిపాదించారు. దేశంలోని 2200 కాలేజీలు, 300 పాఠశాలలు, 500 ప్రభుత్వ ఐటీఐలు, 50 వృత్తి విద్యా శిక్షణ కేంద్రాల్లో వ్యవస్థాపకతను, విద్య, శిక్షణను అందజేస్తామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా దేశంలోని మూల ప్రాంతాలకు చెందిన వారు కార్యక్రమం ద్వారా తమ మెంటర్లు, రుణ మార్కెట్లతో అనుసంధానం కావచ్చని తెలిపారు. అలాగే స్టార్టప్‌ల ద్వారా వచ్చే 12 నెలల్లో భారత్‌లో 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయని, 5000 మందికి ఉపాధి లభిస్తుందని ఓ తాజా నివేదిక పేర్కొంది.

759
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles