హార్దిక్ పటేల్‌కు హైకోర్టులో చుక్కెదురు

Wed,October 28, 2015 01:20 AM

Prima facie case of sedition against Hardik Patel� needs to be probed, says Gujarat High Court

-దేశద్రోహం కేసును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

అహ్మదాబాద్, అక్టోబర్ 27: పటేల్ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించాలని కొంతకాలంగా ఆందోళన చేపడుతున్న పాటిదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రజలను రెచ్చగొడుతున్నాడంటూ పెట్టిన దేశద్రోహం కేసును వ్యతిరేకిస్తూ హార్దిక్ తండ్రి భారత్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సూరత్‌లో హార్దిక్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పటేల్ యువకులెవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపాలని హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. రాజ్‌కోట్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే క్రికెట్ సందర్భంగా జాతీయ జెండాను అవమానించాడంటూ మరోకేసు నమోదైంది. దీన్నీ సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను మంగళవారం కొట్టివేసింది. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జేపీ పార్దివాలా.. ప్రశాంతంగా ఉన్న సమాజంలో హింసను, అశాంతి సృష్టించాలని వ్యక్తి సలహా ఇచ్చాడు. అతడిపై నమోదైన దేశద్రోహం కేసును కొట్టివేయలేం అని పేర్కొన్నారు.

హార్దిక్‌తో ఫొటోలు దిగిన పోలీసులపై సస్పెన్షన్ వేటు


కస్టడీలో ఉన్న హార్దిక్‌తో ఫొటోలు దిగిన ఇద్దరు పోలీసులపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ నెల 23న హార్దిక్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. హార్దిక్ కస్టడీలో ఉండగా అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్ మహేంద్రసింగ్ ఆయనతో ఫొటో దిగాడు. హెడ్‌కానిస్టేబుల్ అరుణ్‌దాలే ఈ ఫొటో తీశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

647
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS