ప్రేమికుల సీక్రెట్స్.. బ్రేకప్ అయితే బ్లాక్‌మెయిల్‌

Thu,May 4, 2017 11:27 AM

personal videos upload in social media

ప్రేమ పేరుతో..
రంజిత్, పూజిత (పేర్లు మార్చాం) ఇద్దరూ బీటెక్ విద్యార్థులు. ఒకే కాలనీలో ఉంటారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. స్నేహం చిగురించింది. ప్రేమ రెక్కలు తొడిగి పక్షుల్లా కలిసి విహరించారు. ఇంతలో పూజిత పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను రంజిత్ తన ఇంటికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. అంతటితో ఆగక ఆమెను మాటిమాటికి బ్లాక్ మెయిల్ చేసేందుకు రహస్యంగా అక్కడే దాచి ఉంచిన కెమెరాలో ఇదంతా రికార్డు చేశాడు. ఆ తర్వాత వేధింపులెక్కువవడంతో పోలీసులకు పూజిత ఫిర్యాదు చేసి అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది.

ఇది జరిగిన మూడు నెలలకు పూజితకు మరో వ్యక్తితో పెళ్లయ్యింది. కొన్నాళ్లపాటు దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు పూజితను ఆమె భర్త పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఎందుకిలా చేశావని ఆమె తల్లిదండ్రులు నిలదీస్తే అందుకు సమాధానంగా ఒక వీడియో లింక్‌ను వాళ్లకు మెసేజ్ చేశాడు. అది క్లిక్ చేసి చూడగానే పూజిత తల్లిదండ్రుల కాళ్ల కింద భూకంపం వచ్చింది. ఏడాది క్రితం రంజిత్-పూజితల ఏకాంత దృశ్యాల వీడియో అది. ప్రేమ పేరుతో పూజితను లొంగదీసుకున్న రంజిత్..తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఆ వీడియోను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. సదరు వీడియో లింకును తొలగించేశారు. అయితే ఆ వీడియోను కొన్ని వేలమంది తమ కంప్యూటర్లలో, మొబైల్‌లలో అప్పటికే డౌన్‌లోడ్ చేసుకొని పదే పదే కొత్త కొత్త వెబ్‌సైట్‌లలోకి మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఎన్నిసార్లు ఆ వీడియోను తొలగించినా మళ్లీ ఏదో ఒక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవుతూ ఉండడంతో సైబర్ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో పూజితకు ప్రతి పగలూ ప్రతి రాత్రి పీడకలలా మారిపోయింది. భవిష్యత్ పూర్తిగా ఛిద్రమైంది. ఇప్పుడేం చేయాలో ఆమెకు దిక్కు తోచడం లేదు.

స్నేహితుడు.. బ్లాక్ మెయిలింగ్
మరో ఘటనలో.. ధనుష్, అనూష (పేర్లు మార్చాం) ఇద్దరూ ఒకే కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. ఎవరూ లేని సమయంలో ధనుష్ ఇంట్లో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. వెనకాముందు ఆలోచించకుండా ఈ దృశ్యాలను వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. అయితే ఒకరోజు ధనుష్ ఇంటికి అతడి స్నేహితుడు వినయ్ వచ్చాడు. ధనుష్ స్నానం చేస్తున్న సమయంలో అతడి మొబైల్‌లో ఉన్న ఈ వీడియోను వినయ్ తన మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. రెండు నెలల తర్వాత దుబాయ్ వెళ్లిన వినయ్ ఈ వీడియోతో అనూషను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమెతో ఏ పరిచయమూ లేనప్పటికీ.. 75వేలు ఇవ్వాలని బెదిరించాడు. లేదంటే ఆ వీడియోను ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరించాడు. వెంటనే అనూష పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇది దుబాయ్ కాల్ కావడంతో నిందితుడు ఎవరనే విషయం పోలీసులకు అంతుచిక్కలేదు. అయితే వినయ్ ఇచ్చిన బ్యాంకు ఖాతాలో అనూష డబ్బులు వేయడంతో నిందితుడెవరో తెలిసొచ్చింది.

పై రెండు ఘటనలు హైదరాబాద్‌లో చోటు చేసుకున్నాయి. వేగంగా పోకడలు మారుతున్న నేటి సమాజంలో స్నేహం, ప్రేమ పేరుతో బంధాలు కూడా అంతే వేగంగా హద్దులు దాటుతున్నాయి. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలు, విద్వేషాలు రానంతవరకే స్నేహమైనా, ప్రేమైనా ఆరోగ్యంగా ఉంటుంది. విభేదాలు వస్తే.. అవే బంధాలు భవిష్యత్తును నాశనం చేసేస్తాయి. కసితో రగిలే పాత స్నేహితులు, మాజీ ప్రేమికులే ఇలా తాము దాచి ఉంచుకున్న ఆడియో రికార్డింగ్‌లు, వీడియోలను ఇంటర్నెట్‌లో ఉంచుతున్నారు. ఇటువంటి వీడియోలు ఏ వెబ్‌సైట్‌లో ఉంచారో తెలుసుకొని ఆ వెబ్‌సైట్‌నుంచి తొలగించడం ఒక ప్రక్రియ. కానీ అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించే అశ్లీల వెబ్‌సైట్ల వీడియోలను చాలామంది తమ ల్యాప్‌టాప్‌లలో, కంప్యూటర్‌లలో , మొబైల్‌లలో డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకుంటున్నారు. అవే తిరిగి ఇతరత్రా వెబ్‌సైట్‌లలోకి అప్‌లోడ్ అవుతున్నాయి. దీంతో వీటిని పూర్తిగా తొలగించడం కష్టంగా మారుతుంది.


ముందు చూపుతో వ్యవహరించాలి
క్షణిక వ్యామోహంలో తప్పులు జరిగాక చాలామంది పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ఆ సమయంలో మేం వాళ్లను ఓదారుస్తున్నాం. ఇంటర్‌నెట్‌లో నుంచి వీడియోలను తొలగించేందుకు తగిన సహకారం అందిస్తున్నాం. నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం. అయితే ఇదంతా బాధితులకు తాత్కాలిక ఊరట మాత్రమే. ఇంటర్‌నెట్‌లో ఆప్‌లోడ్ అయిన వీడియోలు వివిధ పేర్లతో చక్కర్లు కొడుతుంటాయి. వాటిని తొలగించాలంటే ముందు ఆవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. అంటే బాధితుల దృష్టికి వస్తేనే వాటిని గుర్తించగలరు. అలాంటప్పుడు బాధితులు నిత్యం నరకం అనుభవించే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువత ముందుచూపుతో వ్యవహరించాలి. అంతరింగక విషయాలలో వీడియోలు తీసుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే. స్నేహం, ప్రేమ వ్యక్తిగత వ్యవహారాలు. అయితే ఎటువంటి వ్యక్తులతో మనం రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నామో ఎవరికి వారే విచక్షణతో ఆలోచించగలగాలి. అమ్మాయిలకు పరిచయమైన తొలిరోజుల్లో చాలామంది అబ్బాయిలు వారిని విపరీతంగా ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. రిలేషన్ కొంత దూరం వెళ్లాక అబ్బాయిల్లో అమ్మాయిల పట్ల పొసెసివ్‌నెస్ (ఆ అమ్మాయి ఇక నాదే అనే భావన) పెరిగిపోతుంది. అక్కణ్నుంచి ఆ బంధంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మనసును అదుపులో ఉంచుకోవడం..అన్ని విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం, వారి ప్రేమ కన్నా మరేదీ సాటిరాదనే వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
చాంద్‌పాషా, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్

4587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS