అమ్మకు వందనం..!

Sun,May 13, 2018 05:51 PM

mothers day special interviews by daughter and sons on mothers

అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు కదలవు. అమ్మగురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవు. అమ్మ గురించి పాడాలంటే.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ ... కదిలే దేవత అమ్మ .. కంటికి వెలుగమ్మాఎవరు రాయగలరూ...అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరూ... అమ్మ అనురాగం కన్నా తియ్యని రాగం.. ఇవేనా? ఇంతకంటే ఎంత గొప్పగా పాడినా అమ్మ గురించి తక్కువే పాడినట్లు. అంత గొప్నది అమ్మ. మన కళ్లల్లో వెలుగై.. పసితనంలో కంటికి రెప్పై.. బాల్యంలో చదువై.. యవ్వనంలో మార్గదర్శియై.. ఉద్యోగ- వివాహాల్లో అభివృద్దియై ఉంటుంది అమ్మ. ఒక సమాజం ఆరోగ్యవంతంగా...క్రమశిక్షణాయుతంగా.. బాధ్యతాయుతంగా..నైతిక విలువలను పాటిస్తూ.. పెద్దలను గౌరవిస్తూ.. తోటివారిని ప్రేమిస్తూ.. ఎలాంటి కల్మషాల్లేని వాతావరణంతో వర్ధిల్లుతుందంటే.. అమ్మ పాత్రే కీలకం. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏటా మే రెండో ఆదివారం మదర్స్ డే ఒక సందర్భం మాత్రమే. అయినా.. అమ్మకు ఒకరోజు ఏంటి..? ప్రతి రోజూ అమ్మదే. దైవాన్ని మించిన అమ్మను ప్రేమించే వారున్నట్లుగానే కన్నతల్లి భారమని వదిలించుకునేవారూ ఉన్నారీ లోకంలో! మాతృత్వపు మమకారాన్ని కనికరం లేకుండా కాటికి పంపుతున్నవారూ ఉన్నారు. అమ్మ అనుభవిస్తున్న భిన్న పార్శ్వాలను ఒకసారి పరిశీలిద్దాం!

కని.. పెంచి... పెద్ద చేసి.. విద్యాబుద్ధులు నేర్పించి.. లాలించి.. పాలించి.. క్రమశిక్షణ తప్పితే దండించి.. మనం ఎదిగితే సంతోషించి.. సమాజంలో మనకో స్థానం కల్పించేది అమ్మ.. మనిషి జీవితానికి అమ్మనే ఆదిగురువు. అసలు ఈ సృష్టికి మూలమే అమ్మ. అమ్మ పాత్రలో జీవించిన నటీమణులు ఉన్నారు. అమ్మను ప్రేమగా చూసుకునే సెలబ్రిటీలూ ఉన్నారు. అదే సమయంలో అ అమ్మను అనాథగా మార్చుతున్న కొడుకులు ఉన్నారు. మనిషి మాయమై, మానవత్వం మంటగలిసి అమ్మను వదిలించుకుంటున్న కసాయిలూ ఉన్నారు. చందమామ రావే అంటూ రాని చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టి, మాటలు నేర్పి, తప్పటడుగులు వేయకుండా నడిపిస్తూ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అమ్మలను నిజంగా ప్రేమించే వారెంతమంది? అసలు మాతృమూర్తులకు ఎంతమేర సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం దక్కుతున్నాయన్నది ఆలోచించాల్సిన అంశం.

నా కష్టాన్ని చూడలేదు!ప్రతి పేరెంటుకు తమ పిల్లలంటే ఇష్టముంటుంది. అయితే, నా విషయంలో మా పేరెంట్స్‌కు కొంచెం ఎక్కువ అని నేననుకుంటాను. ముఖ్యంగా మా అమ్మ ఉషా నేను కష్టపడితే చూడలేదు. ఎక్కువ కష్టపడుతున్నానని బాధ పడుతుంటారు. నాకు ఫలాన స్టోరీ అయితే బావుంటుంది అని అమ్మతో ఎప్పుడూ కథల గురించి డిస్కస్ చేస్తుంటాను. ఛలో కూడా అలా చేసిందే. అయితే ఆ సినిమా నేను చేస్తే బాగుంటుంది అయితే ఎవరు ముందుకు రావడం లేదని నేను బాధపడితే నువు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని తనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారు. నేను వద్దు అన్నా కూడా తను ఆ చిత్రాన్ని నిర్మించారు. నా విషయంలో అమ్మ, నాన్న, అన్న అందరి సహకారం ఉంది. నేను ఏదైనా సాధిస్తే గిఫ్ట్ ఇవ్వడం అమ్మకు అలవాటు. అలాగే ఛలో విజయవంతం అయిన తర్వాత నాకు కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే నాకు గిఫ్ఠ్‌లు సాధారణమే కనుక నేను మరో కారు అడిగా. ఆ సినిమా విజయవంతం అయ్యాక అమ్మ సినిమాకు పనిచేసిన వారందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారు. నాకు చివరికి ఇచ్చారు. అదే విషయం అడిగితే అందరూ సంతోషంగా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది అని అన్నారు. నా మనసును అర్థం చేసుకోవడంతో పాటు నా కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే అమ్మను నాకిచ్చాడా దేవుడు.
-నాగశౌర్య, సినిమా హీరో

అమ్మే నా స్నేహితురాలు!మా నాన్న ఆర్మీలో పనిచేసేవారు. అందువల్ల ఎప్పుడూ ట్రాన్స్‌ఫర్‌లు ఉండేవి. అమ్మ రాగిణి గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ మమ్మల్ని చూసుకోవడానికి, ఆయన వెంట ఉండడానికి ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఉండిపోయారు. చిన్నతనం నుండి కూడా అన్నీ తానై మమ్మల్ని పెంచిపెద్ద చేశారు. నాన్న మా నుండి దూరం అయ్యాక ఆమె తండ్రిగా, తల్లిగా, స్నేహితురాలిగా అన్ని రోల్స్ ఆమెనే అయ్యింది. నేను చేసే ప్రతి పనికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రేడియోలో చేసినా, ఈవెంట్స్ చేసినా, ఇంటికి స్నేహితులు వచ్చినా, స్నేహితులతో బయటకు వెళ్లినా మా వ్యక్తిత్వం తెలుసు కనుక ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. తను వంట చేయడమే కాదు నాకు ఎలా చేయాలో కూడ నేర్పింది. అమ్మ వాయిస్ నా వాయిస్ ఒకేలా ఉంటాయి. దీంతో ఒక్కోసారి నేను పనిలో ఉంటే తను కాల్ రిసీవ్ చేసుకుంటే నేనే అనుకుని నా స్నేహితులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో, ప్రేమతో ఉంటే మాత్రం స్నేహితురాలిగా ఉంటారు.
ఆర్.జె. కావ్య (ఆర్.రోహిణి), రేడియోజాకీ, ఈవెంట్ యాంకర్

అమ్మ ధైర్యమే నా ఎదుగుదలమా అమ్మ రవిజ్యోతి హౌజ్‌వైఫ్ అయితే తను మంచి అర్టిస్ట్. ఆయిల్ పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు వేస్తారు. నాన్న జాబ్ చేస్తుండడం వల్ల ఇంటి వ్యవహరాలన్నీ అమ్మే చూసుకునేవారు. అందువల్ల తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండుగలు, కళలు అన్నీ అమ్మ నుండే నేర్చుకున్నాను. ఆమె ఆర్ట్ చూసే నేను ఆర్కిటెక్చర్ చదివాను. అమ్మ వల్లనే కళల ఫీల్డ్ మీదా ఆసక్తి కలిగింది. ఇక అమ్మ మంచి కుక్. వెజ్, నాన్ వెజ్ వంటలు ఎంతమందికైనా ఇట్టే వండేస్తారు. అందువల్లే ఆమెనుండి నేను వంటలు కూడా నేర్చుకున్నాను. ఆమెకు ఓపిక ఎక్కువ. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా మనం ధైర్యం కోల్పోవద్దు. ధైర్యలక్ష్మి మనతో ఉంటే అందరు లక్ష్మీలు మన వెంటే ఉంటారు అని చెప్పేవారు. ఈ క్రెడిట్ అంతా నూటికి నూరుశాతం అమ్మకే చెందుతుంది.
-కత్తి కార్తీక, యాంకర్, ఆర్కిటెక్చర్

1819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles