అమెరికాలో సిలికానాంధ్ర మ‌న‌బ‌డి త‌ర‌గ‌తులు ప్రారంభం

Tue,September 18, 2018 05:28 PM

manabadi classes starts by Siliconandhra in AMerica

హైదరాబాద్ : ప్రపంచంలోని 12 దేశాలు, ముఖ్యంగా అమెరికాలోని 35 రాష్ట్రాలలోని 260కి పైగా కేంద్రాలలో తెలుగు భాషను ప్రవాసాంధ్రుల పిల్లలకు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరానికిగాను తరగతులు సెప్టెంబర్ 8న ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10,000 మందికి పైగా విద్యార్ధులు నమోదు చేసుకోవటం ఒక విశేషం అయితే, తెలుగు భాషాభిమాని, భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి సమక్షంలో మనబడి నూతన విద్యా సంవత్సరం చికాగోలో ప్రారంభం కావడం మరొక గొప్ప విశేషం.

ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర మనబడి మన గుడి అని, ఈ మనబడి ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడం గొప్ప కార్యక్రమమని, అందులోనూ ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

మనబడి డీన్ (అధ్యక్షులు) రాజు చమర్తి మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక (WASC)వాస్క్ ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్ లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లాంటి అనేక విజయాలు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు విద్యావిధానం సిలికానాంధ్ర మనబడి అని, ఇక్కడ తెలుగు నేర్చుకున్న పిల్లలు వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, 11 సంవత్సరాలుగా మనబడి ద్వారా 45000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని అన్నారు.


అమెరికా వ్యాప్తంగా 260 కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు మాట్లాట, బాలానందం, తెలుగుకుపరుగు, పద్యనాటకం, తెలుగు పద్యం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో కార్యక్రమాలతో విద్యార్ధులకు తెలుగు భాషతో పాటు మన కళలు సంప్రదాయాలు కూడా తెలియజేస్తున్నామని మనబడి ప్రాచుర్యం మరియు అభివృద్ధి ఉపాధ్యక్షులు శరత్ వేట తెలిపారు.

సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు వెంటనే manabadi.siliconandhra.org ద్వారా ఈ నెల 21 వ తేదీలోగా నమోదు చేసుకోవాలని లేదా 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీ లో శరత్ వేట, డాలస్ లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, స్నేహ వేదుల, రత్నమాల వంక, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని, శ్రీరాం కోట్ని, చికాగోలో సుజాత అప్పలనేని, వెంకట్ గంగవరపు, వర్జీనియా నుండి శ్రీనివాస్ చివలూరి, మాధురి దాసరి, గౌడ్ రామాపురం, నార్త్ కెరొలిన అమర్ సొలస, అట్లాంటా విజయ్ రావిళ్ళ తదితరుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో మనబడి నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయినాయి.

3465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles