పాలమూరు డీసీసీకి తాళం

Tue,November 13, 2018 01:34 PM

Mahaboobnagar DCC Office locked

-కాంగ్రెస్ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కార్యకర్తల నిరసన
-ఒబేదుల్లా కొత్వాల్ హామీతో విరమణ
-నేడు కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశం

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్: మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన కార్యకర్తలు.. డీసీసీ కార్యాలయానికి తాళం వేసి, గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత మధుసూదన్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, సాయిబాబ, సిరజ్‌ఖాద్రీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని కూటమి పేరుతో టీడీపీకి కేటాయించడమేంటని ప్రశ్నించారు. పార్టీ నేతలు అధిష్ఠానంతో మాట్లాడి కాంగ్రెస్ అభ్యర్థికే టికెట్ కేటాయిస్తామని హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని స్పష్టంచేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. చేసేదేమీ లేక కొందరు నేతలు డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌కు సమాచారం ఇచ్చారు. డీసీసీ కార్యాలయానికి చేరుకున్న కొత్వాల్, ఎన్పీ వెంకటేశ్, సత్తార్ చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీకి మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో క్యాడర్, కమిటీలు అసలే లేవని అధిష్ఠానానికి ఎప్పుడో తెలుసన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికే టికెట్ కేటాయిస్తారని చెప్పారు. టికెట్ కేటాయించని పక్షంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని కార్యకర్తలకు నచ్చజెప్పారు. మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్ నియోజకవర్గ స్థాయి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి కార్యకర్తలందరూ హాజరు కావాలని కోరారు. ఆందోళనలో నేతలు కట్ట రవికిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, ఉమ్మర్ రాములు యాదవ్, షబ్బీర్‌అలీ, ఖలీల్ అన్వర్, హజ్‌మత్‌అలీ, ఆంజనేయులు, సుభాష్ కత్రి, మజీద్, కోట్ల చంద్రయ్య పాల్గొన్నారు.

1462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles