పుట్టుక తనదైనా బతుకంతా తెలంగాణకు...

Fri,September 9, 2016 11:03 AM

Kaloji Narayana Rao History

పుట్టుక తనదైనా బతుకంతా తెలంగాణకు ధారపోసిన మహనీయుడాయన. నిజాం దమన నీతికి వ్యతిరేకంగా కలం పోరు సలిపిన యోధుడాయన. ప్రజాసామ్యంలో ప్రజల వైపు నిలిచి, ఆధునిక సమాజంలో సామాన్యుడి హృదయాన్ని తన కవితల ద్వారా కదిలించి, సాహితీలోకంలోనే కొత్త ఒరవడి సృష్టించాడు. ఆధునికీకరణ ముసుగు కప్పుకొని వేష భాషలు మార్చుకొని కొత్తపోకడలు పోతున్న సమాజంపై కలతచెంది పెన్ను ఎక్కుపెట్టాడు. పది మంది గొడవను తన గొడవగా భావించి నా గొడవను రాసి ప్రజా కవిగా ఘన కీర్తిపొందాడు. తెలంగాణ తెలుగే అచ్చమైన తెలుగని చాటిన కాళోజీ నారాయణరావు, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. భాష, యాసల ప్రేమికుడిగా గుర్తింపు పొందిన ఆయన జయంతినే ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.

భాష, యాసల పరిరక్షణకు కృషి
చాయ్ అంటే టీ అంటిరి.. శెర్కర కంటే షుగరంటేనే తియ్యగుంటదంటిరి.. నాస్త వద్దు టిఫినే చేయ్యాల్నంటిరి.. తోల్కపోవుడంటే పశువులనేనా..? పోయిందంటే సా వనా..? నువ్వు మాట్లాడితే తెలుగు.. నేను మాట్లాడితే ఉర్దా..? అంటూ తెలంగాణలో తెలుగు బాగా లేదు అనేటోళ్లకు అంతే వ్యంగ్యంగా జవాబిచ్చిన్రు కాళోజీ. మాతృభాషపై ఎనలేని గౌరవంతో తెలంగాణ తెలుగు యాసను బతికించేందుకు ఎంతగానో కృషి చేశారు. పరభాషపై మో జు పెంచుకొని కన్నతల్లి లాంటి స్వభాషను ఆదరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా..? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలిం చు ఆంధ్రుడా! చావవేటికిరా? అంటూ తన ఆవేదనను కవిత రూపంలో 1942లోనే వ్యక్తపరిచారు. సాహిత్యం లో బహుభాషావేత్తగా పేరు గాంచిన కాళోజీ జయంతిని రాష్ట్రంలో అధికారికంగా జరుపుకుంటు న్నాం. ఇది కాళోజీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత గౌరవం.

కాళోజీ ప్రస్థానం..

రంగారావు, రాంబాయి దంపతులకు 1914 సెప్టెంబర్ 9న కాళోజీ జన్మించారు. తండ్రిది మహారాష్ట్ర కాగా తల్లిది కన్నడ రాష్ట్రం. కాళోజీ పుట్టి పెరిగింది మాత్రం తెలంగాణలోనే. వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్య, వరంగల్, హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆయన విద్యా బోధన అంతా మరాఠీ, ఉర్దూ భాషల్లో సాగింది. ఆయన పూర్వీకులు మహారాష్ట్రులైనా లెక్కలు చూసేందుకు నిజాం సంస్థానానికి వచ్చారు. 1939లో న్యాయశాస్త్రంలో ఉత్తీరులైన కాళోజీ, 1930 నుంచి గ్రం థాలయ ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించారు. 193 5లో మిత్రమండలి సాహిత్య కార్యక్రమాలకు అంకురార్పన చేశారు. వందేమాతరం ఉద్యమంలో పాల్గొని 1939 లో జైలుకెళ్లారు. 1940లో రుక్మిణీబాయిని వివాహం చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942లో అరెస్టయ్యారు. భగత్‌సింగ్‌ను ఉరితీసినప్పుడు ఆయనను స్మరిస్తూ పాటలు రాశారు. 1946-47 కాలం లో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1948లో వరంగల్ కోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు.

తెలంగాణ ఉద్యమంలో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాళోజీ అనేక పోరాటాలు చేశారు. 1969లో జైలుశిక్ష కూడా అనుభవించారు. నిజం చెప్పినందుకు నిజాం ప్రభుత్వం ఆయనకు నగర బహిష్కరణ విధించింది. 1946లో జెండా ఎగురవేసినందుకు అరెస్ట్ చేసింది. 1953లో నా గొడవ వెలువరించారు. 1952,1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1958 నుంచి రెండేళ్ల పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నారు. 1996లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్నో పాటలు రాశారు. ఎత్తుగడ, ఎత్తిపొడుపు, అధిక్షేపం, వ్యంగ్య చమత్కారాలు కాళోజీ కవితల ప్రత్యేకత.

భాష, యాసల ప్రేమికుడు
కాళోజీ బహుభాషావేత్తగా గుర్తింపు పొందారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లో సాహితీవేత్తగా పేరుగాంచారు. ఒక్కొక్కని దస్తూరి ఒక్కొక్క తీరుగ ఉంటది. ఒకడు రాస్తే ఇంకొకడు చదువుతలేడా..? అక్షర సాక్షాత్కారం ఉంటే దస్తూరి అర్థమైనట్లే, శబ్ధ సాక్షాత్కారం ఉంటే అవతలి వాడు ఏం రాసినా అర్థమైతది.. అని తన రచనల్లో భాష, యాసలపై తనకున్న ప్రేమను స్పష్టం చేశాడు. నిజాం వ్యతిరేక పోరాటాల నుంచి తెలంగాణ పోరాటం దాకా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆయ న, తెలంగాణ యాసను అవమానపరచడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఓరుగల్లు కోట స్తంభం, కాకతీయ సాహితీ వటవృక్షంగా పేరొందిన కాళోజీ 2002 నవంబర్ 13న కన్నుమూశారు. ఆయన మరణానంతరం తెలంగాణ సాహితీ అభిమానులు, కవులు కాళోజీ జయంతిని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించి కాళోజీకి సముచిత గౌరవాన్నిచ్చింది. కానీ, తెలంగాణ తెలుగు భాష అధికారికంగా అమలైనప్పుడే కాళోజీకి నిజమైన నివాళి.

నేడు ఉత్సవాలు..
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సాహితీ, సమాలోచనలు, కాళోజీ జీవితం, సాహిత్యం, కవిత్వంపై చర్చలు, ఉపన్యాసాలు, కవి సమ్మేళనాలు, వ్యాసరచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో భాష, నవల, నాటకం, కథ, కవితా రచనలపై రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రజా కవి, సినీ గేయ రచయిత గోరటి వెంకన్నకు పురస్కారం దక్కింది. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాషా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జగన్మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు.

4428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles