లీవు ఇవ్వనందుకు తోటి జవాన్లపై కాల్పులు

Fri,January 13, 2017 06:27 AM

చిన్నతగాదాకే ఓ సీఐఎస్‌ఎఫ్ జవాన్ రెచ్చిపోయి తన సర్వీసు తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. నలుగురు సాటి జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఆవరణలో ఈ ఘటన జరిగింది. లీవు ఇవ్వనందుకు ఆగ్రహించిన జవాన్ బల్వీర్‌కుమార్ బ్యారక్‌లోకి వెళ్లి తోటి జవాన్లపై కాల్పులు జరిపాడని పోలీసు సూపరింటెండెంట్ సత్యప్రకాశ్ తెలిపారు. బ్యారక్‌లో అతడు తన సర్వీసు తుపాకీతో కాల్పులు జరుపగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారని చెప్పారు.


కాల్పుల్లో గాయపడ్డ మరో ఇద్దరు పొరుగున ఉన్న రోహతాస్ జిల్లాలోని దవాఖానలో మరణించారు. విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న బల్వీర్‌ను తోటి జవాన్లు ఒడిసిపట్టుకున్నారు. రెండు నెలల యోగా కోర్సు నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన బల్వీర్‌కు లీవు గురించిన సమస్యలు ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సీనియర్ పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారని సత్యప్రకాశ్ తెలిపారు. న్యాయవిచారణకు ఆదేశించినట్టు చెప్పారు.

బల్బీర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగడ్‌కు చెందినవాడని, మృతుల పేర్లు అమర్‌నాథ్ మిశ్రా(దర్భాంగా), బచ్చాశర్మ(పాట్నా), అరవింద్‌కుమార్ (ముజఫర్‌నగర్), గౌరీశంకర్‌రాం(గడ్వా, జార్ఖండ్) అని అధికారులు తెలిపారు. బీహార్ రాజధాని పాట్నాకు 120 కిలోమీటర్ల దూరంలోని ఔరంగాబాద్ సమీపంలో ఎన్టీపీసీ, బీహార్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్న నబీనగర్ థర్మల్ విద్యుత్కేంద్రం వద్ద వారంతా డ్యూటీలో ఉన్నారు. చిన్న తగాదా వల్లనే బల్వీర్ కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నదని అధికారులు అంటున్నారు. షిప్టు మార్పు సమయంలో గుమిగూడిన సహచరులపై బల్వీర్ కాల్పులకు తెగబడ్డాడని, అక్కడున్నవారు వెంటనే అతడిని మీదపడి బంధించారని చెప్తున్నారు. ఈలోగా కాల్పుల వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరు వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరిని రోహతాస్ జిల్లాలోని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

1138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles