నగరంలో విస్తరిస్తున్న హిజ్రా మాఫియా

Wed,February 13, 2019 06:19 PM

Hijra Mafia in Hyderabad city

ఎన్నోరకాలుగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరంలో హిజ్రా విషసంస్కృతి క్రమంగా వేళ్లూనుకుని, మహావృక్షంగా ఎదిగింది. నగరంలోని ప్రధాన కేంద్రాలైన కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, మాదాపూర్‌, ఎల్‌బినగర్‌, ఉప్పల్‌లలో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇవేకాక, ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్దా ప్రయాణీకులపై దౌర్జన్యాలు. యాచన స్థాయి నుంచి చందాలు, దందాల స్థాయికి ఈ మాఫియా ఎదిగింది. హైదరాబాద్‌లో దాదాపు 5000 మందికి పైగా హిజ్రాలున్నట్లు ఒక అంచనా.

నిజానికి వీరిలో చాలామంది మగవారే. ఏ పనికీ ఒళ్లువంగక, సులువుగా డబ్బు సంపాదించే మార్గంగా దీన్ని ఎంచుకుని హిజ్రాలుగా చలామణీ అవుతున్నారు. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, వీళ్లు వాలిపోతారు. ఇచ్చిందాంతో తృప్తిపడకుండా, భయంకరమైన డిమాండ్లతో వారిని హడలెత్తించి, అడిగిందంతా తీసుకుని గానీ వదలట్లేదు. హోటళ్లు, బార్లు, పబ్‌లు కూడా వీరి దాష్టీకాలకు తరచూ బలవుతున్నాయి. రాత్రిపూట ఆలస్యం కారణంగా ఇంటికి వెళ్లడానికి బస్టాప్‌లోకి వచ్చేవారు, నిర్మానుష్యప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లేవారు వీరికి బలిపశువులు.

వారిని కొట్టడం, తిట్టడం, సొమ్ము దొంగిలించడం నిత్యకృత్యాలు. చాలాసార్లు తీవ్రంగా గాయపరిచి, చావుబతుకుల్లోకి నెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరిపట్ల ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలు, పోలీసులు కూడా వీరిని ఏమీ అనకపోవడం, కేసులు కూడా కాకపోవడంతో ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరనే ధీమా మరిన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వీరికి ప్రోత్సహిస్తోంది. నగరంలోని ప్రతీ పౌరుడూ ఏదో ఒక సందర్భంలో వీరి బాధితుడే అనడం అతిశయోక్తేమీ కాదు.

చాలా మంది రాజకీయనాయకులు వీరిని తమ శత్రువర్గంపై దాడికి ఉపయోగించుకున్న వైనాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పైగా వీరికి సంఘాలు, వాటికి అధ్యక్ష, కార్యదర్శులు లాంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. చేదోడువాదోడుగా కొంతమంది సాధారణ పౌరులు కూడా ఉండటం విశేషం. పరిస్థితులు చేతులుదాటినప్పుడు వీరు జోక్యం చేసుకుని, బాధితులకు నచ్చజెప్పి, సర్దిపుచ్చడం చేస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీరికి ‘కుటుంబాలు’ కూడా ఉన్నాయి. కోట్లాది రూపాయల దందా నడిపించే మాఫియాగా నేడిది మారిపోయింది.

ఇంకా దారుణమేమిటంటే వీరివల్ల అసహజ కార్యకలాపాలు కూడా పెరిగిపోయి, చాలామంది అటు కుటుంబానికి, ఇటు సమాజానికి దూరమై చితికిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కూడా వీరిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే అపప్రథ ప్రజల్లో ఉంది. నిన్నటి ఉప్పల్‌ సంఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పోలీస్‌స్టేషన్‌కే వచ్చి, సాక్షాత్తూ పోలీసులనే కొట్టగలిగారంటే వారి ధైర్యం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రారంభిస్తే, ఎక్కడెక్కడి సంఘటనలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసులు దృష్టి సారిస్తే, ఒక సమస్య నుంచి నగరానికి శాశ్వత విముక్తి కలిగించినవారవుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

6392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles