చలికాలంలో చక్కటి ఆహారం...

Sat,November 19, 2016 12:54 PM

good food habits for winter season

నవంబర్ మాసంలోనే చలి పులి పంజా విసురుతోంది. రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో జిల్లావాసులు గజగజలాడుతున్నారు. ఉదయం బారెడు పొద్దెక్కినా చలిగాలుల ప్రభావం తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటలు దాటితే మళ్లీ వణుకు మొదలవుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ పరిస్థితుల్లో అనారోగ్యాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. చక్కటి ఆహారంతో సమస్యల్ని దూరం చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మరి ఈ సీజన్‌లో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

వేరుశనగలు..
వేరుశనగల్లో విటమిన్ ఈ,బి పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరుశనుగ గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

పాలకూర..
ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజూ పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. ఎమకుల పటిష్టానికి దోహదం చేస్తుంది.

నువ్వులు..
నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి చక్కటి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీస్, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పోడిబారకుండా తేమగా ఉంటుంది.

జొన్నలు..
వారానికి ఒక్క సారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది.

పోషకాల దానిమ్మ..
సకల పోషకాల నిధి దానిమ్మ రక్త కణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజ లవణాలు, పాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారినపడకుండా కాపాడుతాయి.

మేలుచేసే డ్రైఫ్రూట్స్..
డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో కావలసిన శక్తి వీటి వల్ల లభిస్తుంది. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ నేరుగా లేదా ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు.

చిలగడ దుంపలు..
వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ దుంపలు శరీరానికి కావలసినంత వేడిని అందిస్తాయి. పిల్లలు, వయోధికులకు ఇది ఎంతో అవసరం. వీటిలో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే రుచికరంగా ఉంటాయి. దీంతో చలికాలంలో ఎదురుయ్యే చాలా రకాల సమస్యలను నివారించవచ్చు.

వ్యాయామం తప్పనిసరి...
చలికాలం వ్యాయామానికి అనుకూలంగా ఉంటుంది. చలికి భయపడి బద్దగించకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే నడక, ఏరోబిక్స్, యోగాసనాలు వంటివి చేసే వాళ్లు ఆహారంపై పెద్దగా ఆంక్షలు పాటించాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి శారీరక శ్రమ లేనప్పడు ఆహార నియమాలు తప్పనిసరి.

2905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles