ఉపాధి బాటలోకి మహిళా క్యాబ్ డ్రైవర్లు..

Sun,November 13, 2016 11:21 AM

Cab drivers employment for women Communication Skills Technical Skills Training FICCI Ladies Organisation

తెలంగాణ ప్రభుత్వం, మారుతి-సుజుకి డ్రైవింగ్ స్కూల్ శిక్షణతోపాటు క్యాబ్ డ్రైవర్‌కు ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది మహిళలకు శనివారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మెర్యూర్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రశాంతి వారిని అభినందించారు. జీవితంలో మహిళలు నిలదొక్కుకునేందుకు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందని.. ఆ కృషిలో తొలి అడుగు వేసినవాళ్లంతా రేపటి ఉద్యోగాల్లోనూ ఇలాగే పట్టుదలను ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఇంటి బాటపట్టకుండా ఉండేందుకు ఫిక్కీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఉపాధికి సరైన శిక్షణను అదనంగా కొనసాగించింది. కార్ డ్రైవింగ్ అంటే కేవలం స్టీరింగ్ తిప్పడమే కాదు. ప్రయాణంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన మెకానిక్ స్కిల్స్‌లో వీరికి శిక్షణ ఇచ్చారు. టైర్లు మార్చడం, ఇంజిన్ సమస్యలు గుర్తించడంలో శిక్షణ పొందిన మహిళలు క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి కావాల్సిన విధంగా జీపీఎస్ వినియోగంలో శిక్షణ ఇచ్చారు.

వివిధ భాషల ప్రయాణికులతో సంభాషించేందుకు వీలుగా ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రాథమిక అవగాహన కల్పించారు. 50 రోజుల రోడ్ శిక్షణతో క్యాబ్ డ్రైవింగ్‌కు అన్ని అర్హతలు సాధించిన మహిళలందరూ శనివారం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ మహిళా సంక్షేమ శాఖ అధికారులు మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది. 15 రోజుల రోడ్ డ్రైవింగ్ శిక్షణ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. మేం వాళ్లను సంప్రదించి మరికొంత కాలం డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు మారుతి సుజుకి సంస్థను సంప్రదించాం. వాళ్ల సహకారంతో కార్ డ్రైవింగ్ శిక్షణ ఇప్పించాం. శిక్షణ ఇచ్చిన తర్వాత మన పని పర్తయిందిలే అని వదిలేస్తే వాళ్లు మళ్లీ ఇంటికే పరిమితమవుతారు. అందుకే వాళ్లకు ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రవాణ శాఖ కమిషనర్‌ను కోరాం. ఆయన మార్చి నాటికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ లోగా క్యాబ్ డ్రైవర్‌గా ఉపాధి చూపేందుకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది. కార్ కొనుగోలకు రాయితీ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదిస్తాం. కనీస డిపాజిట్ కట్టలేని వాళ్లకు మేం ఆర్థిక సహకారం అందిస్తాం. అని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు పద్మ రాజగోపాల్ అన్నారు. శిక్షణతో వారిని వదిలేయకుండా వాళ్లు తమకాళ్లపై తాము నిలబడే వరకు సహకరిస్తామని ఆమె అన్నారు.

స్టడీ ప్లస్ స్కిల్ ..
అందరికీ ఉద్యోగాలు లేకపోవడానికి, చదువుకున్న స్త్రీలు పనికి దూరం కావడానికి కారణం వారికి స్కిల్స్ లేకపోవడమే అన్నారు... ఆల్ ఇండియా కీ డెవలప్‌మెంట్స్ చైర్మన్ జ్యోత్స అంగార. మహిళలకు సరైన స్కిల్స్ నేర్పే సంస్థలు లేవని, ఈ లోటును పూరిస్తూ ఫిక్కీ చేపట్టిన కార్యక్రమం భర్తీ చేస్తోందని జ్యోత్స అన్నారు. ఆమె అన్నట్లుగానే స్కిల్స్ పెంచుకుంటే పెద్ద జీతం అందుకోవచ్చని అంగన్‌వాడీలో బీమా మిత్రగా పనిచేస్తున్న అనీల ధీమగా చెబుతోంది. ఆరేళ్ల క్రితం భర్త చనిపోతే కుటుంబ భారమంతా తనపైనే వేసుకున్నదామె. ఇద్దరు పిల్లల పెంపకం నుంచి అత్త గారి యోగక్షేమాల వరకు అన్నీ చూసుకుంటున్న ఆమె క్యాబ్ డ్రైవర్ ఉద్యోగంపై ఆసక్తి చూపితే ఎవరూ కాదనలేదు. కుటుంబ బాధ్యతలు మోస్తున్న అనీల ఇప్పుడు బతుకు బండిని నడపడానికి స్టీరింగ్ చేతబట్టింది. సైకిల్ కూడా తొక్కడం రాని ఆమె డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకుని త్వరలో క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం చేపట్టబోతోంది.

చెట్టంత కూతురు!
ఆడపిల్ల ఒంటరి ప్రయాణానికే అంగీకరించని సమాజంలో అమ్మాయిలు క్యాబ్ డ్రైవర్‌గా ముందుకురావడమే కాదు సంప్రదాయాన్ని కాదని తల్లిదండ్రులు ఆ ఆడబిడ్డల్ని ప్రోత్సహించడం ఓ ముందడుగనే చెప్పాలి. ముగ్గురు ఆడబిడ్డలను పోషించుకునేందుకు ఓ బీదనాన్నకు ఈ శిక్షణతో చేదోడ య్యింది ఎల్బీ నగర్‌కు చెందిన సాయి అనుకృతి. వాళ్ల నాన్న దినసరి కూలీ. ఇల్లు గడవడం కష్టంగా ఉండి గంభీరావుపేట (కరీంనగర్ జిల్లా) నుంచి వలస వచ్చాడాయన. తండ్రి కష్టాన్ని చూసి రెండో కూతురు అనుకృతి క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సిద్ధమైంది. కొడుకే కాదు ఆడబిడ్డ కూడా నాన్నకు ఆసరాగా ఉంటుందని నిరూపించుకున్న అనుకృతి చెట్టంత బిడ్డలా గర్వంగా ఫీలవుతోంది. పేదరికం వల్ల పాలిటెక్నిక్‌తోటే చదువాపిందామె. తల్లిదండ్రుల బాధ్యత భుజానికి ఎత్తుకున్న అనుకృతి నా చదువు ఆగినా, నా చెల్లెలి చదువు ఆగిపోనివ్వను. తనను బాగా చదివిస్తాను.. అంటోంది.

రెండు చక్రాలూ కదిలితేనే..
పేదరికం నుంచి, నిరుద్యోగం నుంచి బయటపడి సాధికారతవైపు అడుగులేయాలని భావిస్తున్న మహిళా శక్తి ఏదో ఒక అవకాశం కోరుకుంటోంది. డ్రైవర్ వృత్తి కోసం శిక్షణ తీసుకున్న పద్మశ్రీ అమ్మ సపోర్ట్‌తో స్టీరింగ్ పట్టి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల నాలో ఆత్మైస్థెర్యం పెరిగిందని, భర్త సంపాదనకు తన సంపాదన తోడైతే పిల్లల్ని బాగా చదివించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ శిక్షణకు సిద్ధపడ్డానంటోంది షేక్‌పేటకు చెందిన ఉమాదేవి. భర్త ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ సంపాదిస్తుంటే, పిల్లల కోసం కష్టపడాలని ఈ వృత్తి చేపట్టాలని నిర్ణయించుకున్నానంటోందామె. పేదరికం, నిరుద్యోగం నుంచి బయటపడేందుకు ఫిక్కీ తోడ్పాటుతో సాధికారత వైపు అడుగులేస్తున్న స్త్రీ శక్తి రేపు నగర రోడ్లపై ఏదో ఒక రోజు మనల్ని గమ్య స్థానానికి చేరుస్తుంది.

1433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS