ఓ మై గాడ్‌..నాకు ఎంపీ టికెటా?..నమ్మలేకపోతున్నా!

Tue,March 26, 2019 05:14 PM

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ నేతలు, స్థానికంగా బలమైన నేతలను కాదని బెంగళూరు సౌత్‌ లోక్‌సభ టికెట్‌ను 28ఏళ్ల యువకుడికి కేటాయించి ఆశ్చర్యపరిచింది. మొదట ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి అనంత కుమార్‌ సతీమణి తేజస్విణీని బరిలో దించాలని బీజేపీ అధిష్టానం భావించింది. ఐతే ఆఖరి నిమిషంలో ఆమెను కాదని కర్ణాటక హై కోర్టు లాయర్‌ తేజస్వీ సూర్య వైపే మొగ్గు చూపింది. దేశంలోనే బెంగళూరు దక్షిణ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ప్రతిష్ఠాత్మక స్థానానికి తనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై తేజస్వీ షాక్‌కు గురయ్యారు.


కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బీకే హరిప్రసాద్‌ ప్రత్యర్థిగా తేజస్వీ సూర్య తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. భవిష్యత్‌ నేతలకు అవకాశాలు ఇవ్వాలని, వారికి పార్టీలో సముచితస్థానం కల్పించాలని అభ్యర్థుల ఎంపికలో నిర్ణయించినట్లు ఒక బీజేపీ నేత తెలిపారు. తనకు బీజేపీ ఎంపీ టికెట్‌ ఇచ్చిందన్న వార్తను ఇంకా నమ్మలేకపోతున్నానని సూర్య ట్విటర్‌ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి అనంత్‌ కుమార్‌ వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. 1996 నుంచి 2018 నవంబర్‌లో ఆయన మరణించే వరకు ఈ నియోజకవర్గం నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2014లో కాంగ్రెస్‌ నేత నందన్‌ నీలేకనిపై సుమారు 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో అనంత్‌ కుమార్‌ గెలుపొందారు.
9902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles