ప్రకృతికి ఫిదా.. కూతురి పేరు 'కేరళ'Wed,April 5, 2017 05:13 PM

ప్రకృతికి ఫిదా.. కూతురి పేరు 'కేరళ'

రమణీయమైన ప్రకృతిని.. అందమైన జలపాతాలను చూసి పర్యాటకులు పులకించి పోవాల్సిందే! సముద్ర తీరప్రాంతాల్లోని బీచ్‌లను, కొండలను చూసి.. చల్లని గాలులకు మైమరిచిపోవాల్సిందే!! కేరళలోని ప్రకృతి అందాలకు పులకించిపోయి.. చల్లని గాలులకు మైమరిచిన.. అమెరికాకు చెందిన ఓ ప్రేమజంట తమకు పుట్టిన బిడ్డకు కేరళ అని నామకరణం చేశారు. ఆ జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే తమ కూతురుకు కేరళ అని పేరు పెట్టారు.


అమెరికాకు చెందిన చార్లెస్ క్రామర్, బ్రెన్నా మూరే ప్రేమికులు. ప్రేమించుకుంటున్న క్రమంలో 2006లో కేరళ పర్యటనకు వచ్చారు. కేరళలోని కొండలు, బీచ్‌లు, ప్రకృతి అందాలను చూసి పరవశించి పోయారు. అక్కడి నేచర్ వారిని ఆకట్టుకుంది. నాడే వారిద్దరూ డిసైడ్ చేసుకున్నారు.. తమకు పుట్టబోయే బిడ్డకు కేరళ అని పేరు పెట్టాలని. ఆ తర్వాత కొంత సమయానికి వారు పెళ్లి చేసుకున్నారు. 2009లో పుట్టిన తొలి సంతనానికి కేరళ అని నామకరణం చేశారు. కేరళకు తమ్ముడు జూలియన్(5) ఉన్నాడు.


అయితే క్రామర్ దంపతులు ఏడు ఖండాల్లోని 18 దేశాల్లో వరల్డ్ స్కూలింగ్ టూర్ చేయాలని నిర్ణయించుకున్నారు. టూర్‌లో భాగంగా కేరళలోని కొట్టాయం చెర్పూంకల్‌కు వచ్చారు. కేరళకు వచ్చిన ఎనిమిదేళ్ల కేరళ తన పేరును ప్రతి ఒక్కరూ పిలుచుకోవడంపై మురిసిపోయింది. తనకు కేరళ అని పేరు ఎందుకు పెట్టారో.. కేరళ రాష్ర్టాన్ని చూసిన తర్వాత తెలిసి వచ్చిందని ఆ అమ్మాయి చెప్పింది. ఇక్కడి విద్యావ్యవస్థను తెలుసుకునేందుకు వచ్చిన క్రామర్ దంపతులు.. కేరళను ఓ పాఠశాలలో నెల రోజుల పాటు చేర్చించారు. పాఠశాలకు వెళ్లిన నెల రోజుల్లోనే మళయాలం నేర్చుకోవడం.. మాట్లాడటం.. రాయటం నేర్చుకుంది కేరళ.

3917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS