మీ టూ.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..

Thu,October 11, 2018 04:23 PM

About me too agitation

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఉద్యమం మీ టూ. తమపై జరిగిన లైంగిక దాడులు, వేధింపులను బాధితులు బహిర్గ్గతం చేయడం దీని నేపథ్యం. ముఖ్యంగా పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై మీటు పుట్టుకొచ్చింది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎందరో పెద్ద మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. తాము చేసిన నిర్వాకానికి కొందరు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతున్నారు. మరికొందరు తాము ఎలాంటి తప్పులకు పాల్పడలేదని దబాయిస్తున్నారు. ఇందులో సినీ దిగ్గజాలు, లాయర్లు, జర్నలిస్టులు మొదలుకొని ప్రముఖ క్రికెటర్ల పేర్లు బహిర్గతమవుతుండటం విస్మయానికి గురిచేస్తున్నది. ప్రస్తుతం మనదేశంలో కూడా మీటు మొదలైంది.


అమెరికా చెందిన పౌరహక్కుల కార్యకర్త తారనా బుర్కే 2006లో మీ టూ ఉద్యమాన్ని ప్రారంభించారు. లైంగిక దాడి, వేధింపులపై చైతన్యం కలిగించే ఉద్దేశంతో బుర్కే మీ టూ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ పదమే ఇప్పుడు ఓ పెద్ద ఉద్యమంగా మారింది.


2017లో అమెరికా నటి అలిస్సా మిలానో ట్విట్టర్‌లో మీ టూ హ్యాష్‌ట్యాగ్ చేయడంతో దీనికి విస్తృత ప్రాచూర్యం లభించింది. సమస్య తీవ్రతను ప్రజలు గుర్తించేలా లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఆ విషయాన్ని, అందుకు కారణమైన వారి గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించాలని మిలానో ప్రోత్సహించారు. ఇది ఎంతో మందిని ప్రేరణగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖులు ఎంతో మంది తమపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేశారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటులు జ్వెనెత్ పాల్టో, యాష్లే జడ్, జెన్నిఫర్ లారెన్స్, ఉమా థుర్మాన్ ఉన్నారు.



హాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాత హార్వీ వెయిన్సెటెయిన్ తమను లైంగిక వేధించాడని డజన్ల కొద్దీ మహిళలు ప్రకటించారు. తన సినీ నిర్మాణ కంపెనీలను అడ్డు పెట్టుకుని గత మూడు దశాబ్దాలుగా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. హాలీవుడ్‌లో వెయిన్స్‌టెయిన్ బాధితులు 80 మందికి పైన ఉన్నట్లు బహిర్గతమైంది. తన సినీ నిర్మాణ సంస్థలో ఏ అవకాశం కావాలన్నా సెక్స్‌కు ముడిపెట్టేవాడని తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వెయిన్స్‌టెయిన్ కంపెనీ నుంచి అతణ్ని తొలిగించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇతర సంస్థల నుంచి వెయిన్స్‌టెయిన్‌ను బహిష్కరించారు. ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మీటు ఉద్యమం ఊపందుకుంది. మన దేశంలో కూడా మీటూ మొదలైంది.

పనిప్రదేశంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, దాడులను ఎందరో మహిళలు ధైర్యంగా బహిర్గతం చేశారు. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా చిత్రీకరణ సందర్భంలో తన పట్ల ప్రముఖ నటుడు నానాపటేకర్ అసభ్యంగా ప్రవర్తించాడని నటి తనుశ్రీ దత్తా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇది తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియా వేదికగా నానాపటేకర్‌పై నెటిజన్లు తిట్ల వర్షం కురిపించారు. ఎంతో మంది తనుశ్రీదత్తాకు మద్దతుగా నిలిచారు. గత కొన్ని రోజులుగా సినీ ప్రముఖులు, హాస్యనటులు, నటులు, పాత్రికేయులు, రచయితలపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కూడా ఉన్నారు.

విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పాత్రికేయ వృత్తిలో ఉన్నప్పుడు మహిళలను సమావేశాల కోసం హోటల్ గదులకు రమ్మన్నట్లు ఆయనపై ప్రధాన ఆరోపణ. ఎంజే అక్బర్ గతంలో ద టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్, ఇతర పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ప్రముఖ శ్రీలంక క్రీడాకారుడు అర్జున రణతుంగ తనను లైంగిక వేధించాడని భారత్‌కు చెందిన జర్నలిస్టు ప్రకటించింది.

1375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS