ఓ ఫొటోతో స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించవచ్చు

Mon,December 18, 2017 02:33 AM

Your smartphone can help fight cybercrime

సైబర్ నేరాలను అరికట్టే దిశగా నూతన టెక్నాలజీ
smartphone
న్యూయార్క్, డిసెంబర్ 17: ఒకే దృశ్యాన్ని రెండు వేర్వేరు ఫోన్లు ఒకేలా ఫొటో తీయలేవని అంటున్నారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు. వాస్తవానికి ఒకేలా అనిపించే ఫొటోల్లోనూ సూక్ష్మమైన తేడాలు వందలాదిగా ఉంటాయని వారంటున్నారు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని.. వేలిముద్రలు, పాస్‌వర్డ్‌లకు బదులుగా సైబర్‌నేరాలను అరికట్టే నూతన టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ పరిశోధకులు నిమగ్నమయ్యారు. ఒకే కంపెనీకి చెందిన ఒకే మోడల్ ఫోన్లు ఓ దృశ్యాన్ని ఒకేలా చిత్రీకరించవు. ఉత్పత్తి రకం ఒకటే అయినప్పటికీ ఆ ఫోన్లతో తీసిన ఫొటోల్లో వేలాది తేడాలుంటాయి. అంటే, ఏ ఫోన్‌కు ఆ ఫోటో ప్రత్యేకం. వేరే ఫోన్‌లాగా ఫోటో తీయడం ఇంకో ఫోన్‌కు ఎప్పటికీ సాధ్యంకాదు అని బఫెలో యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి కుయి రెన్ చెప్పారు. అయితే ఇవి దృశ్య లోపాలే. పైకి ఒకేలా కనిపించే ఇలాంటి ఫోటోలను మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తే అనేక లోపాలు కనిపిస్తాయి.

అలా ఏ రెండు ఫొటోల్లోనూ ఒకే తరహా లోపాలుండవు. దీనినే ఫొటో-రెస్పాన్స్ నాన్-యూనిఫామిటీ (పీఆర్‌ఎన్‌యూ)గా పిలుస్తున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్‌లో ఉన్న విశ్లేషణాత్మక పద్ధతిలో పీఆర్‌ఎన్‌యూ కూడా ఒకటి. పిన్ నెంబర్, పాస్‌వర్డ్‌ల తరహాలో ఈ పద్ధతిని ఐడెంటిఫికేషన్ కోసం వాడుకుంటే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆన్‌లైన్ నగదు చెల్లింపుల సమయంలో, ఏటీఎంల వద్ద తమ ఫోను ద్వారా తీసుకున్న ఫొటోలను పోల్చిచూసుకునే టెక్నాలజీ చాలా సులువుగా, పటిష్ఠమైన భద్రతను కలిగి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ స్మార్ట్‌ఫోన్లు దొంగిలించినా, సునాయాసంగా పట్టుకోవచ్చని చెబుతున్నారు. 50 డిజిటల్ ఫొటోలను విశ్లేషించడం కన్నా, ఒక ఫొటో డేటాను సదరు స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS