అమెరికా కాల్పుల మృతుల్లో తెలుగు యువకుడు

Sat,September 8, 2018 02:13 AM

Young Man Prudhvi Raj Killed  in Shooting  at U. S.

-గుంటూరు జిల్లావాసి పృథ్వీరాజ్‌గా గుర్తింపు
న్యూయార్క్: అమెరికాలోని ఓహి యో రాష్ట్రం సిన్సినాటి సిటీలో గురువారం జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందినట్టు గుర్తించారు. సిన్సినాటి సిటీలోని ఫిఫ్త్ థర్డ్ బ్యాంక్ కార్యాలయంలోకి ఓ సాయుధుడైన దుండగుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అదే బ్యాంకు ఉద్యోగి ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన పృథ్వీరాజ్ కందెపి (25) ఉన్నట్టు గుర్తించారు. ఘటనపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పృథ్వీరాజ్ కుటుంబానికి చేరవేస్తున్నామని న్యూయార్క్‌లో భారత కాన్సులేట్ జనరల్ సందీప్ చక్రవర్తి తెలిపారు.

మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగు అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. మిగతా ఇద్దరు మృతులను లూయీస్ ఫిలిప్ కాల్డెర్న్ (48), రిచర్డ్ న్యూకమర్(64)గా పోలీసులు గుర్తించారు. ఆరేండ్ల కిందట అమెరికాకు వచ్చిన పృథ్వీరాజ్ చదువు పూర్తిచేసుకొని ఫిఫ్త్ థర్డ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు చేరుకొని దుండగుడిని కాల్చి చంపారు. అతడి వద్ద నుంచి ఒక పిస్తోలు, 200 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుండగుడిని ఒమర్ ఎన్రిక్ సాంటా పెరెజ్(29)గా గుర్తించారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS