మేల్కొనకపోతే వినాశనమే!

Wed,September 12, 2018 02:00 AM

World must prevent runaway climate change by 2020

-ప్రమాదకర దశకు వాతావరణ మార్పులు
-కేరళ వరదలు ఓ సంకేతం
-2020 నాటికి అన్ని దేశాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి
-ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటేరస్ హెచ్చరిక

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 11: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ప్రమాదకర దశకు చేరాయని, ఇలాగే కొనసాగితే కొద్దిరోజుల్లోనే పరిస్థితి చేయిదాటిపోతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు. గత నెలలో సంభవించిన కేరళ వరదలు వాతావరణ మార్పులకు ప్రమాదకర సంకేతమని ఆయన తెలిపారు. కేరళ జలవిలయాన్ని గుటేరస్ ప్రస్తావించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. మరో రెండువారాల్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో.. సోమవారం ఐరాస ప్రధాన కార్యాలయంలో వాతావరణ మార్పులు అంశంపై జరిగిన చారిత్రక సదస్సులో గుటేరస్ మాట్లాడారు. వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన మలుపులో ప్రపంచం ఉంది. ఇది ప్రత్యక్ష ముప్పు. మన స్పందనలకన్నా వేగంగా వాతావరణం మార్పులకు గురవుతున్నది అని గుటేరస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల, వేడిగాలుల తీవ్రత, విస్తరిస్తున్న కార్చిచ్చు, తుఫానులు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది. గతనెలలో కేరళలో వచ్చిన వరదల కారణంగా 400మంది మృత్యువాత పడ్డారు. 10లక్షలమంది నిరాశ్రయులయ్యారు అని గుటేరస్ తెలిపారు. 1850 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నాల్గవ సంవత్సరంగా 2018నిలుస్తుందని తెలిపారు. పర్యావరణ ముప్పును తొలిగించడంతోపాటు తిరిగి పూర్వ వాతావరణ స్థితిని నెలకొల్పే దిశగా ప్రపంచ దేశాలు 2020నాటికి చర్యలు వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పారిస్ ఒప్పందానికి కట్టుబడి మూడేండ్లుగా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్న ఫలితంగా భూతాపం 1.5డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిందని గుటేరస్ వెల్లడించారు. వాతావరణ సానుకూలతకు సామాజిక-ఆర్థిక పురోగతికి మధ్య అవినాభావ సంబంధం ఉందని.. సరైన చర్యలు తీసుకుంటే 2030నాటికి రూ.1,891లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రపంచ దేశాలు ఆర్జించవచ్చని ఆయన వివరించారు.

వాతావరణ మార్పులతో ఆకలికేకలు తీవ్రం

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆకలికేకలు పెరిగాయని, మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రధానంగా బలవుతున్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం విడుదల చేసిన ప్రపంచ ఆహారభద్రత-పోషకాహార స్థితి నివేదిక వెల్లడించింది. 2016లో పోషకాహారం లోపించిన ప్రజల సంఖ్య 80.4కోట్లు ఉండగా.. ఉష్ణోగ్రతలు, కరువు, తుఫానుల వంటి వాతావరణ అవరోధాల కారణంగా గత ఏడాది ఈ సంఖ్య 82.1కోట్లకు చేరిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలో ప్రతీ తొమ్మిది మందిలో ఒకరు పోషకాహారలోపం కలవారేనని పేర్కొన్నది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. 2030నాటికి ఆకలి, పోషకాహార లోపం లేనివిధంగా ప్రపంచాన్ని మార్చాల్సి ఉంటుంది అని సూచించింది. సమకాలీన ప్రపంచంలో మరోవైపు ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.

వాతావరణ మార్పులపై వచ్చే ఏడాది ప్రపంచ సదస్సు

వాతావరణ మార్పులపై వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు ఐరాస ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తెచ్చి, సమగ్ర కార్యాచరణ రూపొందించేదిశగా దీన్ని నిర్వహించనున్నారు. సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకుగాను మెక్సికో దౌత్యాధికారి అల్ఫోన్సో డి అల్బాను ప్రత్యేకాధికారిగా నియమించారు.

అవినీతి విలువ.. ప్రపంచ జీడీపీలో 5 శాతం!


-ఏటా అంతర్జాతీయంగా రూ.189 లక్షల కోట్ల అవినీతి
Corruption
ప్రపంచవ్యాప్తంగా అవినీతి సాలీనా 189 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని, ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ఐదోవంతు అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ చెప్పారు. హవాలా, పన్నుల ఎగవేత, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. సోమవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచశాంతి, అంతర్జాతీయ భద్రత దిశగా అవినీతిపై పోరాటం అనే అంశంపై జరిగిన సదస్సులో గుటేరస్ ప్రసంగించారు. పేద, ధనిక.. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలనే తారమత్యం లేకుండా అవినీతి విశ్వవ్యాప్తమైపోయింది.

ఏటా ప్రపంచవ్యాప్తంగా అవినీతిలో నేరుగా చేతులు మారుతున్న సొమ్ము రూ.72.73 లక్షల కోట్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆర్థిక సదస్సు అంచనా వేసింది. అవినీతికారణంగా సమాజంలో పేదరికం, ఆకలి మరింత తీవ్రమవుతున్నది. అస్థిరత, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదానికి అవినీతితో సంబంధముంది. అందుకే సంక్షోభాలు నెలకొన్న దేశాల్లో అవినీతి ఎక్కువగా ఉంటున్నది. అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో తమ నేతలను చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది అని గుటేరస్ తెలిపారు.

2065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles