అమెరికా సూపర్ సమిట్

Tue,June 19, 2018 02:41 AM

World largest ARM super computer is headed to a nuclear security lab

-అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణ
-సెకన్‌కు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలు చేయగలిగే సామర్థ్యం

సెకనుకు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలు చేయగలిగే సామర్థ్యంతో ఏకకాలంలో 10 లక్షల జీబీ (10 పెటాబైట్స్)కన్నా ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలిగే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్కరించింది. దీనికి సమిట్ అని పేరుపెట్టింది.

వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్కరించింది. ఓక్‌రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ (ఓఆర్‌ఎన్‌ఎల్) ఈ సూపర్ కంప్యూటర్‌ను రూపొందించింది. దీనికి ఐబీఎం సంస్థ సహకారం అందించింది. దీనికి సమిట్ అని పేరుపెట్టింది. దీని వేగం సెకన్‌కు 200 పెటాఫ్లాప్స్. అంటే సెకన్‌కు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలను చేయగలదు. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. దీనినిబట్టి సమిట్ సామర్థ్యాన్ని ఊహించుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లను అమర్చడం వల్ల సమిట్ ఏకకాలంలో 10లక్షల జీబీ (10 పెటాబైట్స్)కన్నా ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. దీని అంతర్గత మెమెరీయే 25కోట్ల జీబీలు ఉండటం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి, ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయడానికి సమిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అమెరికా ఇంధనశాఖ మంత్రి రిక్ పెర్రీ పేర్కొన్నారు.

ఓఆర్‌ఎన్‌ఎల్, ఐబీఎం కలిసి 2012లో టైటాన్ సూపర్ కంప్యూటర్‌ను తయారుచేశాయి. దీని సామర్థ్యం 27 పెటాఫ్లాప్స్. ఇది ఇప్పటివరకు అమెరికాలోనే వేగవంతమైన సూపర్‌కంప్యూటర్. తాజాగా ఆవిష్కరించిన సమిట్ టైటాన్ కన్నా ఎనిమిది రెట్లు శక్తివంతమైనది. దీని నిర్మాణంలో ఐబీఎం సంస్థకు చెందిన 4,608 అత్యాధునిక సర్వర్లను వినియోగించారు. ఒక్కో సర్వర్‌లో రెండు 22 కోర్ ఐబీఎం పవర్-9 ప్రాసెసర్లను, ఆరు ఎన్‌వీఐడీఐఏ టెల్సా వీ-100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ యాక్సిలరేషన్స్‌ను ఉపయోగించారు. వీటన్నింటినీ డ్యుయల్-రైల్ మెల్లనోక్స్ ఈడీఆర్ 100 జీబీ/సెకన్ ఇన్ఫినిబాండ్‌తో అనుసంధానించారు.

శాస్త్ర పరిశోధనల్లోనూ దిట్ట

సమిట్ ద్వారా శాస్త్ర పరిశోధనల్లో సూపర్ కంప్యూటర్ల భాగస్వామ్యం పెరుగనున్నది. కొన్ని పరిశోధన అంశాలకు సంబంధించి సమిట్ సెకన్‌కు 300 కోట్ల కోట్ల(మూడు బిలియన్ బిలియన్లు) విశ్లేషణలు చేయగలదు. శాస్త్రీయ విశ్లేషణల్లో ఇదో రికార్డు. గతంలో టైటాన్ సెకన్‌కు కేవలం 64 బైట్ల సైన్స్ అంశాలను మాత్రమే విశ్లేషించగలిగేది. సమిట్ సామర్థ్యాన్ని ఓఆర్‌ఎన్‌ఎల్ శాస్త్రవేత్తలు డాన్ జాకబ్‌సన్, వెయిన్ జౌబెర్ట్ పరీక్షించారు. బయోఎనర్జీ, మానవ ఆరోగ్యానికి సంబంధించిన 1.8 బిలియన్ బిలియన్ల జన్యు సంబంధ సమాచారాన్ని సమిట్‌కు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. సమిట్ శాస్త్ర పరిశోధనలకు సహాయపడటమే కాకుండా, తనలోని కృత్రిమ మేధస్సును(ఏఐ) నూతన ఆవిష్కరణల్లో భాగస్వామిని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీంతో మానవ ఆరోగ్యం, హైఎనర్జీ ఫిజిక్స్, మెటీరియల్స్ డిస్కవరీ తదితర రంగాల్లో ఆవిష్కరణల వేగం పెరుగుతుందన్నారు. సూపర్ కంప్యూటర్ల విశ్లేషణ సామర్థ్యాన్ని సమిట్ మరో దశకు తీసుకెళ్లింది. విశ్లేషణ శక్తి, సమాచార నిల్వ, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుంది. తద్వారా పరిశోధకులు మరింత కచ్చితమైన ఫలితాలను మరింత వేగంగా పొందగలుగుతారు అని ఓఆర్‌ఎన్‌ఎల్ అసోసియేట్ డైరెక్టర్ జెఫ్ నికోల్స్ తెలిపారు. సమిట్‌లోని కృత్రిమ మేధస్సుతో తక్కువ కాలంలో, వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చని చెప్పారు.

743
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles