పాక్ దౌత్యవేత్తల కదలికలపై అమెరికా ఆంక్షలు

Fri,April 13, 2018 01:50 AM

US restrictions on the movements of Pakistani diplomats

-వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమలు
ఇస్లామాబాద్, ఏప్రిల్ 12: వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పాకిస్థాన్ దౌత్యవేత్తల కదలికపై అమెరికా ఆంక్షలు విధించింది. వాషింగ్టన్‌తోపాటు ఇతర నగరాల్లోని పాక్ దౌత్యవేత్తలు తమ నియామక ప్రాంతాల నుంచి 40 కి.మీ.కి మించి ప్రయాణించరాదని అమెరికా అధికారిక ప్రకటన జారీచేసింది. ఇదే ప్రకటనను వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి, పాక్ విదేశాంగశాఖకు కూడా అమెరికా పంపిందని డాన్ దినపత్రిక ఒక వార్తాకథనం ప్రచురించింది. అయితే ఈ వార్తను అమెరికా విదేశాంగశాఖ, పాక్ రాయబార కార్యాలయం తోసిపుచ్చాయి. దౌత్యవేత్తల కదలికలపై ఎటువంటి ఆంక్షలు లేవని పేర్కొన్నాయి. కానీ, గతనెల మధ్యలోనే పాక్ దౌత్యవేత్తలపై అమెరికా ఆంక్షలు విధించినట్లు డాన్ దినపత్రిక వార్తాకథనం సారాంశం. దీనిపై ఇరు పక్షాలు పలు దఫాలు చర్చలు జరిపినట్లు సమాచారం. తమ నియామక ప్రాంతం నుంచి 40 కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే పాక్ దౌత్యవేత్తలు ఐదు రోజుల ముందు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని అమెరికా జారీ చేసిన అధికారిక ప్రకటన సారాంశం.

658

More News

VIRAL NEWS