ట్రంప్‌కు అగ్నిపరీక్ష

Tue,November 6, 2018 02:03 AM

US midterm elections poised for verdict on Trump America

-నేడే అమెరికా మధ్యంతర ఎన్నికలు
-21 నెలల ట్రంప్ పాలనకు రెఫరెండం
-రిపబ్లికన్ పార్టీ సర్కార్ భవితకు అత్యంత కీలకం
-గెలిస్తే దూకుడు.. ఓడితే ముకుతాడు
-డెమోక్రాట్లే ముందంజలో ఉన్నారంటున్న ప్రీపోల్ సర్వేలు

వాషింగ్టన్, నవంబర్ 5: రెండేండ్లక్రితం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా తొలిసారి అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. నేడు (మంగళవారం) అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనేట్‌లోని 35స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు 36రాష్ర్టాలకు గవర్నర్లనూ ఎన్నుకుంటారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు ఓటింగ్ మొదలవు తుంది. ప్రధాన ప్రత్యర్థులు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరికివారు తామే మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ 21నెలల పాలనకు రెఫరెండంగా నిలిచే ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ గెలిస్తే వివాదాస్పద నిర్ణయాలు, ఆధిపత్య చర్యలు తీవ్రమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డెమోక్రాట్లు గెలిస్తే ట్రంప్ దూకుడుకు ముకుతాడు పడుతుందంటున్నారు. ప్రస్తుత మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి.

అమెరికా ప్రతినిధుల సభకు ప్రతి రెండేండ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు(అదనంగా ఖాళీ అయిన స్థానాలు), ప్రతినిధుల సభలోని మొత్తం 435స్థానాలకు ప్రతి రెండేండ్లకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. సెనేట్‌కు ఎన్నికైన సభ్యులు ఆరేండ్లపాటు పదవిలో ఉంటారు. ప్రతి రెండేండ్లకోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. అధ్యక్షుడి నాలుగేండ్ల పదవీకాలంలో సగంరోజులకే మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ 247 స్థానాల్లో విజయం సాధిస్తే.. డెమోక్రాట్లు 188 సీట్లలో గెలిచారు.

ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీకి 241మంది, డెమోక్రాట్లకు 194మంది సభ్యులున్నారు. వందసీట్ల సెనేట్‌లో 51మంది రిపబ్లికన్లు, 49మంది డెమోక్రాట్లు సభ్యులుగా ఉన్నారు. ఉభయసభల్లోనూ రిపబ్లికన్లదే మెజారిటీ. అమెరికాలోని 50 రాష్ర్టాలకు 33 రాష్ర్టాల్లో రిపబ్లికన్లే గవర్నరుగా ఉన్నారు. దేశ చర్రితలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ప్రస్తుత మధ్యంతర ఎన్నికలు నిలుస్తున్నాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో 4.2 బిలియన్ డాలర్లు (రూ.30వేల కోట్లు) ఖర్చుకాగా, ఈసారి 5.2 బిలియన్ డాలర్లకు (రూ. 38వేల కోట్లకు) పెరిగిందని అంచనా వేస్తున్నారు.

ట్రంప్ భవితను తేల్చే ఎన్నికలు

మధ్యంతర ఎన్నికలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం తేలే అవకాశముంది. ఇక యూఎస్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 241మంది రిపబ్లికన్లు, 194 మంది డెమోక్రాట్లున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజారిటీ రావచ్చునని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు 50రాష్ర్టాల్లో ఖాళీఅయిన 36 గవర్నర్ స్థానాలు, మేయర్లు, స్థానిక ప్రభుత్వాధికారుల స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు నెగ్గితే, ట్రంప్ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునే వీలుంటుంది. ట్రంప్ పాలనలో తీసుకున్న వలసకుటుంబాల విభజన వంటి పలు నిర్ణయాలపైనా విచారణ జరిపే అధికారం వారికి లభిస్తుంది. అవసరమైతే ట్రంప్‌పై అభిశంసన తీర్మానమూ ప్రవేశపెట్టొచ్చు. వివిధ నియామకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వీటో చేయడానికి డెమోక్రాట్లకు సాధారణ మెజారిటీ చాలు. కానీ, రెండు సభల్లోనూ మళ్లీ రిపబ్లికన్లే మెజారిటీ సాధిస్తే, తన విధానాల అమలులో ట్రంప్‌కు ఎదురు ఉండకపోవచ్చు. హెచ్1బీ సహా పలు కీలక నిర్ణయాలను ఆయన మరింత దూకుడుగా అమలు చేసే అవకాశముంది.

వివాదాస్పద నిర్ణయాలే ప్రచారాంశాలు

అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ట్రంప్ 21నెలల పాలనే తమ ప్రధాన అస్త్రంగా హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లోలాగే ఈసారీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలను ఎండగడుతున్నాయి. ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలో ప్రవేశ నిరాకరణ, చైనాతో వాణిజ్య యుద్ధం, అమెరికన్లకు ఉద్యోగ ప్రయోజనాల పేరిట వలసజీవులపై నిబంధనల కఠినతరం తదితర నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ట్రంప్ ప్రకటించిన పన్నుల కోతను డెమోక్రాట్లు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తుంటే.. రిపబ్లికన్లు వీసాలు, అక్రమ వలసలపై దృష్టిపెట్టడంతోపాటు ఆర్థిక పునరుజ్జీవానికి ప్రాధాన్యమిస్తామని ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండేండ్ల కిందట గెలిపించిన మన అమెరికా- మన విధానం ప్రచారాంశాలనే ఈసారి ట్రంప్ నమ్ముకున్నారు. వలస విధానంపై ఇటీవల ఆయన వ్యాఖ్యలన్నీ దానినే ప్రతిబింబిస్తున్నాయి. అమెరికన్లను ఆకర్షించేందుకు కఠిన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. దక్షిణ సరిహద్దుల్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న మెక్సికో, గ్వాటెమాల, హోండూరస్ దేశస్థులను నిలువరించేందుకు ఏకంగా 12వేలమంది సైన్యాన్ని పంపారు. జన్మతః పౌరసత్వం ఇకపై ఉండదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రీపోల్ సర్వేల్లో అధ్యక్షుడి పార్టీకి ఎదురుగాలి

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసిన సుమారు 51శాతం ప్రజలు ఈసారి ఆయనకు వ్యతిరేకంగా ఓటేయనున్నారని కొన్ని ప్రీపోల్ సర్వేలు చెబుతుంటే.. ట్రంప్ గ్రాఫ్ 40శాతానికి పడిపోయిందని మరికొన్ని అంచనా వేస్తున్నాయి. రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లే ప్రచారంలో ముందున్నారని, 23 రాష్ర్టాల్లో నువ్వా నేనా అన్నరీతిలో పోటీ నెలకొందని వార్తలు వెలువడుతున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ ఉభయసభల్లోనూ రిపబ్లికన్ల మెజారిటీ కొనసాగే పరిస్థితి లేదు. ముఖ్యంగా అతికీలకమైన ప్రతినిధుల సభ డెమోక్రాట్ల వశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో దాదాపుగా ప్రతిపక్ష పార్టీయే గెలువడం అమెరికాలో ఆనవాయితీగా మారింది. 1934 నుంచి ఇంతవరకు 21సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగితే కేవలం మూడుసార్లు మాత్రమే అధికార పార్టీ గెలువడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ఈసారి కూడా డెమోక్రాట్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని చెబుతున్నారు.

పింక్ వేవ్

ఈసారి మధ్యంతర ఎన్నికలు.. ఎక్కువమంది మహిళాఅభ్యర్థులు పోటీపడుతున్న ఎన్నికలుగా రికార్డు సృష్టించనున్నాయి. 2012లో హౌస్, సెనేట్‌లకు మొత్తం 298మంది మహిళా అభ్యర్థులు పోటీ పడగా, 2016లో ఆ సంఖ్య 312కు పెరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో 529మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రైమరీల తర్వాత 271మంది మిగిలారు. వారిలో 24 మంది సెనేట్‌కు, 247మంది ప్రతినిధుల సభకు పోటీ పడుతున్నారు. పోటీ చేస్తున్న మహిళల్లో ఎక్కువగా..194మంది ప్రతినిధుల సభకు 16మంది సెనేట్‌కు డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ల తరఫున 53మంది మహిళలు ప్రతినిధుల సభకు, 8మంది సెనేట్‌కు పోటీ చేస్తున్నారు. మహిళలపై వివక్ష, అసమానతలు, లైంగిక వేధింపులు, సమాన వేతనాలు తదితర సమస్యలపై ఏడాదిగా అమెరికాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ట్రంప్ విధానాలపై వ్యతిరేకత, మీటూ ఉద్యమం తర్వాత దేశంలోని పరిస్థితులే భారీ సంఖ్యలో మహిళలు పోటీ చేయడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాన్ని పింక్ వేవ్‌గా అమెరికన్ మీడియా అభివర్ణిస్తున్నది.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles