మన బంధం బలమైనది

Tue,November 14, 2017 03:11 AM

US, India cooperation can rise beyond bilateral ties PM Modi to Trump

-అమెరికా - భారత్ మధ్య సహకారం ద్వైపాక్షిక సంబంధాలను దాటాలి
-అమెరికా అంచనాలకు అనుగుణంగా భారత్ నిలుస్తుంది
-అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ
-రక్షణ, భద్రత, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చలు
-మోదీ జెంటిల్‌మ్యాన్: ట్రంప్ ప్రశంస

trump
మనీలా, నవంబర్ 13: భారత్, అమెరికాల మధ్య బలమైన బంధం ఉన్నదని, అది ద్వైపాక్షిక సంబంధాలను దాటి ఎదుగాలని ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెప్పారు. రెండు దేశాలు ఆసియా భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని అన్నారు. ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీ, ట్రంప్‌లు సోమవారం విడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ, భద్రతతోపాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై వారు చర్చించారు. మనీలాలోని సోఫిటెల్ హోటల్‌లో బసచేసిన ట్రంప్‌ను వెళ్లి కలుసుకున్న మోదీ దాదాపు 45 నిమిషాలపాటు సమావేశయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక అంశాలపై ఉభయ దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా ఆశలకు అనుగుణంగా భారత్ నిలువగలదని మోదీ ట్రంప్‌కు భరోసానిచ్చారు. భారత్, అమెరికా మధ్య సహకారం ద్వైపాక్షిక సంబంధాలను మించి ఎదిగే అవకాశం ఉందని, ఉభయ దేశాలు ప్రపంచం, ఆసియా భవిష్యత్ కోసం కలిసి పనిచేయవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ ఎక్కడికి వెళ్లినా, ఎప్పుడు అవకాశం లభించినా భారత్‌ను గురించి గొప్పగా చెబుతున్నారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

దక్షిణచైనా సముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా సహకారం పెరుగాలని అగ్రరాజ్యం కోరుకుంటున్నది. భారత్‌పై ట్రంప్ అంచనాలు పెట్టుకున్నారని మోదీ తెలిపారు. భారత్‌పై ప్రపంచం, అమెరికా పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగానే తాము నిలుస్తున్నామని, ఇకముందు కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ తన స్నేహితుడని ట్రంప్ పేర్కొన్నారు. శ్వేతభవనంలో మోదీకి ఆతిథ్యమిచ్చామని, ఆయన తమకు స్నేహితునిగా మారాడని తెలిపారు. మోదీ గొప్ప జెంటిల్‌మ్యాన్ అని వ్యాఖ్యానించారు. అనేక వర్గాల వారిని ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. భారత్ నుంచి అనేక మంచి నివేదికలు అందుతున్నాయని, అందుకు మోదీకి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ట్రంప్‌తో చర్చలు ఫలవంతంగా జరిగాయి అని ప్రధాని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. మోదీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శులు ఎస్ జైశంకర్, ప్రీతి శరణ్ కూడా ట్రంప్‌ను కలిసిన భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు.

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS