గ్రీన్‌కార్డులపై పరిమితి తొలిగింపు!

Fri,July 12, 2019 02:41 AM

US House passes bill removing cap on issuing green cards

- బిల్లును ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ
- తదుపరి దశలో సెనేట్, అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టంగా అమలు
- భారత్ తదితర దేశాల నిపుణులకు లబ్ధి


వాషింగ్టన్, జూలై 11: గ్రీన్ కార్డుల కోసం భారత్ వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో వేచి చూస్తున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా ప్రతినిధుల సభ తీసుకుంది. గ్రీన్‌కార్డులను ఒక దేశానికి ఏడు శాతం మాత్రమే మంజూరు చేయాలనే నిబంధనను ఎత్తివేసే, కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులపై విధించిన పరిమితిని పెంచే బిల్లుకు ప్రతినిధుల సభ గురువారం భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో పనిచేస్తూ అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావించే వేల మంది ప్రతిభావంతులకు ఊరట లభించింది. ఈ బిల్లును ప్రతినిధుల సభ 365:65 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. అయితే ఈ బిల్లును ఇంకా సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అంతిమంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిపై తన ఆమోద ముద్ర వేస్తేనే అది చట్టంగా మారుతుంది. ఈ బిల్లు చట్టంగా మారితే, ఒక్కో దేశానికి జారీ చేసే కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య ప్రస్తుతమున్న ఏడు శాతం నుంచి 15 శాతం వరకు పెరుగవచ్చని భావిస్తున్నారు. అలాగే ఉపాధి ఆధారిత వీసాలపై విధించిన నిషేధం కూడా తొలిగిపోనుంది. గ్రీన్ కార్డును పొందిన అమెరికాయేతర పౌరుడు ఆ దేశంలో పనిచేస్తూ శాశ్వతంగా నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ బిల్లు వల్ల భారత్ వంటి దేశాలకు చెందిన నిపుణులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఒక్కో దేశం నుంచి వచ్చే దరఖాస్తుల్లో ఏడు శాతం మందికి మాత్రమే గ్రీన్‌కార్డులు జారీ చేయాలన్న ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం కారణంగా హెచ్1బీ వీసాపై అమెరికా వెళుతున్న భారత ఐటీ నిపుణులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన తాజాబిల్లు 2020-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి ఆధారిత వీసాల జారీకి పరివర్తన నిబంధనలను కూడా విధించనుంది. ఈబీ-2 (ఆధునిక డిగ్రీలు లేదా అసాధారణ సామర్థ్యం గలవారు), ఈబీ-3 (నిపుణులు, ఇతర ఉద్యోగులు), ఈబీ-5 (పెట్టుబడిదారులు) విభాగాల వారికి వీసాల జారీలో కొంత శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించనున్నారు. అయితే అత్యధికంగా వీసాలు పొందిన రెండు దేశాలకు చెందిన వారికి మాత్రం ఈ రిజర్వేషన్ వర్తించదు. ఇక రిజర్వు చేయని వీసాలలో 85 శాతం వీసాలను ఏదైనా ఒకే దేశానికి చెందిన వారికి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా ఈ బిల్లుపై ట్రంప్ తన ఆమోద ముద్ర వేయడానికి ముందు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అధికంగా ఉన్న సెనేట్‌ను దాటాల్సి ఉంటుంది. బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించడం పట్ల అమెరికా వ్యాప్తంగా ఉన్న భారత నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. సెనేట్ కూడా ఈ బిల్లుకు సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలుపాలని అవి విజ్ఞప్తి చేశాయి. అమెరికాలో విద్వేష హత్యకు గురైన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిబొట్ల భార్య సునయన దుమాల.. బిల్లు ఆమోదం పొందడంపై స్పందిస్తూ, ఈ సమయం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం. మొత్తానికి మా శ్రమ ఫలించింది అన్నారు.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles