భారత్‌తో కలిసి ముందడుగు


Sun,July 16, 2017 02:43 AM

-రక్షణ పద్దుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం
-సైనిక సహకారంపై ఇరు దేశాల కసరత్తు
-రక్షణ సహాయ నిధిలో పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు

Representatives
వాషింగ్టన్, జూలై 15: రక్షణ రంగంలో ప్రధాన భాగస్వామి భారత్‌తో సైనిక సహకారం పెంపుదల, పాకిస్థాన్‌కు రక్షణ నిధి విడుదలకు కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన వేర్వేరు సవరణలకు అమెరికా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 18)లో సుమారు రూ.41,84,563 (65,100 కోట్ల డాలర్లు) కోట్ల రక్షణ బడ్జెట్ కేటాయింపునకు ప్రవేశపెట్టిన జాతీయ రక్షణ అధికార సంస్థ చట్టం (ఎన్‌డీఏఏ) 2018 బిల్లును ఆమోదించింది. ఎన్‌డీఏఏ బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించాక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మీదట చట్టంగా మారుతుంది.

21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొందాం


india
భారత్‌కు సైనిక సహకారం పెంపొందించాలని కోరుతూ ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమి బెరా ఎన్‌డీఏఏకు ప్రవేశపెట్టిన సవరణ బిల్లును అమెరికా ప్రజాప్రతినిధుల సభ ఆమోదించింది. దీని ప్రకారం విదేశాంగ, రక్షణ మంత్రులు పరస్పర సంప్రదింపుల ద్వారా భారత్ అమెరికా మధ్య సైనిక సహకారంపై వ్యూహాన్ని రూపొందిస్తారు. 21వ శతాబ్దిలో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు రెండు దేశాల మధ్య సైనిక సహకారం పెంపుదలకు వ్యూహం రూపొందించడం చాలా ముఖ్యమని అమిబెరా అన్నారు. రక్షణ రంగ సహకారానికి అవసరమైన వ్యూహ రూపకల్పన దిశగా ముందడుగు వేసేందుకు ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఆమోదం పొందినందుకు అమిబెరా ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్టం ద్వారా రెండు దేశాల మధ్య సైనిక సహకార వ్యూహ రూపకల్పనకు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులకు 180 రోజుల గడువు లభించింది. ఎన్‌డీఏఏ ప్రకారం అమెరికా భారత్ మధ్య ఉమ్మడి సవాళ్ల పరిష్కారం, రక్షణ రంగ టెక్నాలజీ, వాణిజ్య కార్యకలాపాల్లో ఇరు దేశాల భాగస్వామ్య పాత్రపై విదేశాంగశాఖ, పెంటగాన్ సంయుక్తంగా వ్యూహాన్ని రూపొందిస్తాయి.

ఉగ్రవాదులను తుదముట్టిస్తేనే సాయం


flag-of-pakistan
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సంతృప్తికరమైన నివేదిక అందజేసిన తర్వాతే పాక్‌కు రక్షణ నిధి కేటాయించాలని ఎన్‌డీఏఏకు ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించిన మూడు సవరణ బిల్లులను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. డానా రోహ్రాబచ్చర్ రెండు, టెడ్ పాయి ఒక సవరణను ప్రతిపాదించారు. దీని ప్రకారం పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునివ్వడంతోపాటు సరిహద్దుల్లో దాడులను నివారించాల్సి ఉంటుంది. ఉత్తర వజీరిస్థాన్‌ను వినియోగించుకోకుండా ఉగ్రవాదులకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఉత్తర వజీరిస్థాన్‌లో హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిలువరించాల్సి ఉంటుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి ధ్రువీకరిస్తేనే వచ్చే అక్టోబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు పాకిస్థాన్‌కు 400 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతుంది. ఉగ్రవాదాన్ని నిరోధించే విషయమై పాక్ చేస్తున్న నమ్మక ద్రోహానికి చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ ఈ రోజు ఒక ముందడుగు వేసింది అని టెడ్ పాయి తెలిపారు.

1217
Tags

More News

VIRAL NEWS