అమెరికా ప్రభుత్వం భారత విద్యార్థులను తప్పుదోవ పట్టించింది

Thu,February 7, 2019 03:02 AM

-భారతసంతతి న్యాయవాది విమర్శ
వాషింగ్టన్, ఫిబ్రవరి 6: అమెరికా ప్రభుత్వం ఓ నకిలీ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించి, భారతీయ విద్యార్థులను తప్పుదోవ పట్టించిందని భారత సంతతికి చెందిన ఒక న్యాయవాది ఆరోపించారు. ప్రభుత్వ నిర్వా కం వల్లనే కొన్ని వేల మైళ్ల దూరంలో వేరొక దేశంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారని ఆమె పేర్కొన్నారు. తాము ఏర్పాటుచేసిన ఓ బోగస్ యూనివర్సిటీలో చేరిన భారతీయ విద్యార్థులు తమ ఉచ్చులో చిక్కుకున్నారని అమెరికా హోంల్యాండ్ విభాగం పేర్కొన్న నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతి న్యాయవాది అను పేషవరియా స్పందిస్తూ, అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్ వందల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసిందని అన్నారు. మా విద్యార్థులు తప్పు చేయలేదని చెప్పడం లేదు. యూనివర్సిటీలో చేరే ముందు వారు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి.

వారు తెలిసి నేరం చేస్తే శిక్షించాలి. కానీ వారిని ఉచ్చులోకి లాగి లేదా నేరం చేసేలా ప్రోత్సహించినప్పుడు వారికి మనం అండగా నిలవాలి అని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్‌టన్ అనే నకిలీ యూనివర్సిటీకి చెందిన 600 మంది విద్యార్థుల్లో అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు 130 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 129 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో కొందరు విడుదల కాగా, మరికొందరి కదలికలపై ఆంక్షలు విధించారు. మరికొందరు దేశం విడిచి వెళ్లిపోయారు.

857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles