భారత్‌పై అమెరికా ఆంక్షలు?!

Sat,September 22, 2018 01:18 AM

US continues to warn India of sanctions over missile defence deal with Russia

-భారత్, రష్యా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందంపై అగ్రరాజ్యం ఆగ్రహం
-రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన చైనా సంస్థపై ఇప్పటికే ఆంక్షలు

వాషింగ్టన్: రష్యాతో ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందంపై ముందుకు వెళ్లాలని భావిస్తున్న భారత్‌పై అమెరికా అంక్షలు విధించే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని వందల కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని అతిముఖ్యమైన లావాదేవిగా పరిగణిస్తున్నామని, ఈ ఒప్పందంపై గనుక ముందుకు వెళ్తే ఆంక్షలు తప్పకపోవచ్చని అమెరికా ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా ఆంక్షల చట్టం (సీఏఏటీఎస్‌ఏ)ను ఉల్లంఘించిన దేశాలు, విదేశీ సంస్థలు, వ్యక్తులపైన అగ్రరాజ్యం తీవ్రమైన ఆంక్షలను విధించే పరిపాలనా ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన సంస్థ ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీడీ), దాని డైరెక్టర్ లీ షాగ్ఫుపైన అమెరికా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. చైనా మిలిటరీకి చెందిన ఈడీడీ రష్యా నుంచి సుఖోయ్ సు-35 యుద్ధవిమానాలతోపాటు ఉపరితలం నుంచి గాల్లోకి దూసుకెళ్లే ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసింది. అది నచ్చని అమెరికా డీఈఈపై, దాని డైరెక్టర్‌పై ఆంక్షలు విధించింది. ఇప్పటికే సీఏఏటీఎస్‌ఏ చట్టం ప్రకారం ఇరాన్, ఉత్తరకొరియా, రష్యాలపై అమెరికా ఆంక్షలను కొనసాగిస్తున్నది. 450 కోట్ల డాలర్ల (రూ.32,528 కోట్లు) విలువైన ఐదు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తున్నది.

అ భారీ విలువైన ఒప్పందంపై అమెరికా సీఏఏటీఎస్‌ఏ చట్టం ప్రభావంపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సీఏఏటీఎస్‌ఏ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2017 డిసెంబర్‌లో చైనా 10 సుఖోయ్ యుద్ధవిమానాలను రష్యా నుంచి కొనుగోలు చేసింది. దీంతోపాటు ఈ ఏడాది జనవరిలో ఎస్-400 క్షిపణులను, దానికి సంబంధించి సామగ్రిని కొనుగోలు చేసింది. అందుకే మేం చర్యలు చేపట్టాం. అయితే ఈ ఆంక్షల తుది లక్ష్యం రష్యానే. రష్యా చేపడుతున్న హానికర చర్యలకు ఫలితంగానే ఈ ఆంక్షల ద్వారా ఆ దేశానికి జరిమానా విధిస్తున్నాం అని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న టర్కీ లాంటి దేశాలపై కూడా ఆంక్షలు విధిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసే ఇతర దేశాల గురించి మేం నిర్ణయం తీసుకోలేదు. ఎస్-400, సుఖోయ్ యుద్ధవిమానాల కొనుగోలు చేపట్టిన లేదా చేపట్టాలని భావిస్తున్న దేశాల పట్ల మేం సహనంతో వ్యవహరించాం. తీవ్రమైన ఆందోళనకు కారణమయ్యే ఎస్-400 వంటి వ్యవస్థల కొనుగోలు అనేది సీఏఏటీఎస్‌ఏ ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉన్నదని అమెరికా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అని సదరు అధికారి వెల్లడించారు.

నిప్పుతో చెలగాట మాడొద్దు: రష్యా


తమపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని రష్యా తప్పుబట్టింది. నిప్పుతో చెలగాట మాడొద్దు అని హెచ్చరించింది. రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సర్గై ర్యాంబ్‌కో మాట్లాడుతూ రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతను పెంచి అంతర్జాతీయ స్థిరత్వాన్ని దెబ్బతీయాలని అగ్రరాజ్యం(అమెరికా) భావిస్తున్నదని తెలిపారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు. నిప్పుతో చెలగాటమాడటమనేది తెలివి తక్కువ పని. అది చాలా ప్రమాదకరం అని సర్గై చెప్పారు.

622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles