మాల్యా అప్పగింతకు బ్రిటన్ ఆమోదం

Tue,February 5, 2019 02:51 AM

- ఆదేశాలు జారీ చేసిన బ్రిటన్ హోంశాఖ.. స్వాగతించిన భారత్
- బ్రిటన్ హైకోర్టులో అప్పీల్ చేస్తానన్న మాల్యా

లండన్, ఫిబ్రవరి 4: బ్యాంకులకు రూ.వేల కోట్లు టోకరా పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ బ్రిటన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆ దేశ హోం శాఖ మంత్రి సాజిద్ జావీద్ సంతకాలు చేశారు. మాల్యాను భారత్‌కు అప్పగించాలని గతేడాది డిసెంబర్ 10న బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పంద ప్రక్రియలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలను హోం శాఖ మంత్రికి పంపారు. మాల్యా అప్పగింతపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. రెండు నెలల్లోగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయంపై బ్రిటన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ట్విట్టర్‌లో వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు జావీద్ ఆమోదం తెలిపారని హోం శాఖ సోమవారం ధ్రువీకరించింది.

కాగా, సుమారు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2017 ఏప్రిల్‌లో మాల్యాను అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. తనను భారత్‌కు అప్పగిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు వెలువరించిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని మాల్యా ఇప్పటికే వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 10న న్యాయమూర్తి ఆర్బుత్‌నాట్ తీర్పు వెలువరిస్తూ... తన ఆర్థిక లావాదేవీలపై మాల్యా భారత్ కోర్టుల్లో సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. తప్పుడు పత్రాల ద్వారా రుణాలు పొందినట్లు స్పష్టంగా తెలుస్తున్నదని, మనీ ల్యాండ్‌రింగ్‌కు మాల్యా కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. మాల్యాను భారత్‌కు అప్పగించిన తరువాత ఆయనను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బ్యారక్ 12లో వసతులు సరిగా లేవని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మాల్యా తరఫు న్యాయవాది వాదనను ఆమె తోసిపుచ్చారు. అక్కడి వసతులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. హోం శాఖ కార్యదర్శి నిర్ణయం అనంతరం 14 రోజుల్లోగా కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు మాల్యా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ అప్పీల్‌కు అనుమతి లభిస్తే హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. మాల్యాను భారత్‌కు అప్పగిస్తూ బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. న్యాయ ప్రక్రియను త్వరగా ముగించాలని కోరింది.

1065
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles