ఉత్తరకొరియాపై ఆంక్షల అంకుశం

Wed,September 13, 2017 01:06 AM

U.N. Security Council Approves New North Korea Sanctions

- అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస భద్రతామండలి ఏకగ్రీవ ఆమోదం
- రష్యా, చైనా ఒత్తిడితో తగ్గిన ఆంక్షల ప్రభావం
- ప్రతీకారం తప్పదు : ఉత్తర కొరియా
ఐక్యరాజ్యసమితి/ జెనీవా, సెప్టెంబర్ 12: అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ 15 సభ్య దేశాల ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది. చమురు దిగుమతితోపాటు ఉత్తరకొరియా నుంచి చేనేత వస్ర్తాల ఎగుమతిపై ఆంక్షలు విధించాలని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సోమవారం భద్రతామండలి ఆమోదించింది. ఈ నెల మూడో తేదీన ఉత్తర కొరియా ఆరవదీ, భారీ అణ్వస్త్ర పరీక్ష జరిపిన నేపథ్యంలో ఐరాస భద్రతామండలి ఆంక్షలు విధించింది. వాస్తవంగా చమురు ఉత్పత్తుల దిగుమతిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించాలని అమెరికా ప్రతిపాదించినా.. భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలు రష్యా, చైనా అడ్డుకోవడంతో ఆంక్షల తీవ్రత తగ్గించింది. అణ్వస్ర్తాల తయారీకి ఉత్తరకొరియాకు ముడి చమురు జీవ నాడి అని, 30 శాతం దిగుమతులు మాత్రమే తగ్గించాలన్న తీర్మానంలో ఉన్నా దాని ప్రకారం 55 శాతానికి పైగా గ్యాస్, డీజిల్ దిగుమతిలో కోత విధిస్తామని తెలిపారు.

ఈ ఆంక్షలతో అణ్వస్త్ర, క్షిపణి ప్రయోగాల నిర్వహణకు అవసరమైన ఇంధనం, నిధుల సామర్థ్యం తగ్గిపోతాయి. తాజా ఆంక్షలతో ఉత్తర కొరియా నుంచి ఏటా 130 కోట్ల డాలర్ల ఆదాయం తగ్గుతుంది అని ఆమె తెలిపారు. కాగా, అమెరికా సారథ్యంలో తమపై ఐరాస భద్రతామండలి విధించిన ఆంక్షలు దుష్టనీతికి నిదర్శనమని జెనీవాలో ఉత్తరకొరియా రాయబారి హాన్ టాయి సాంగ్ అన్నారు. తమపై ఆంక్షలు విధించినందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.

470

More News

VIRAL NEWS

Featured Articles