హిందూ అక్కాచెల్లెళ్ల కిడ్నాప్

Mon,March 25, 2019 02:34 AM

Two Hindu Girls Kidnapped, Converted to Islam in Pakistan

-పాకిస్థాన్‌లో మత ఛాందస వాదుల ఆగడం
-బలవంతంగా మతమార్పిడి, పెండ్లి
-భగ్గుమన్న హిందూ సంఘాలు.. దేశవ్యాప్త ఆందోళన
-ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-ట్విట్టర్ వేదికగా ఇరుదేశాల మంత్రుల వాగ్యుద్ధం

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, మార్చి 24: పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో హిందువులైన ఇద్దరు టీనేజీ అక్కాచెల్లెళ్లను కొందరు ఛాందసులు కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి చేయించడమే కాకుండా, పెండ్లి కూడా చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తున్నది. ఈ ఉదంతంపై పాక్‌లోని హిందూ మైనార్టీ వర్గాలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో ఈ ఘటనపై పాక్ సర్కారు విచారణకు ఆదేశించింది. హోలీ పర్వదినం సందర్భంగా శనివారం సింధ్‌లోని ఘోట్కీ జిల్లాలో రవీనా (13), రీనా (15) అనే ఇద్దరు అమ్మాయిలను వారి ఇంటిలోకి చొరబడిన మత ఛాందసులు తుపాకులతో బెదిరించి అపహరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తర్వాత కొద్దిసేపటికే అమ్మాయిలిద్దరికీ ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం వివాహం (నిఖా)చేసిన వీడియో దృశ్యాలు బయటికి వచ్చాయి. అనంతరం తాము ఇష్టపూర్వకంగానే ఇస్లాంను స్వీకరిస్తున్నట్లు అమ్మాయిలు చెబుతున్న మరో వీడియో వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల కిందట నిందితులకు తమ తండ్రికి మధ్య వాగ్వాదం జరిగిందని, ఇందుకు ప్రతీకారంగానే తుపాకులతో బెదిరించి రీనా, రవీనాలను కిడ్నాప్ చేశారని వారి సోదరుడు ఫిర్యాదు చేశాడు.

మైనార్టీల హక్కుల్ని సంరక్షిస్తాం


హిందూ బాలికల కిడ్నాప్, బలవంతపు మతమార్పిడి, నిఖా ఉదంతంపై వెంటనే దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. ఈ దారుణంపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సింధ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు సింధ్‌లోని మిర్‌పుర్ఖాస్ ప్రాంతంలో మరో హిందూ మైనర్ బాలిక సానియాను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి చేయించారని స్థానిక మీడియా ఒక కథనాన్ని ప్రసారం చేసింది.

హిందూ సంఘాల ఆందోళన


బాలికల ఉదంతంపై పాక్‌లోని హిందూ సంఘా లు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాం తాల్లో ఆందోళన నిర్వహించాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డి మాండ్ చేశాయి. హిందూ బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకోకుండా కఠినచట్టాలు తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రధాని ఇమ్రాన్ నిలబెట్టుకోవాలని కోరాయి. బలవంతపు మతమార్పిడిని నిరోధిస్తూ తెచ్చిన బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎంపీ, పాక్ హిందూ కౌన్సిల్ చీఫ్ రమేశ్‌కుమార్ వంక్వానీ డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు సింధ్ అసెంబ్లీ 2016లోనే ఆమోదం తెలిపినా మత ఛాందసవాదుల ఒత్తిడితో వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఈ బిల్లును వెంటనే సింధ్ అసెంబ్లీ, పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు.

మిస్టర్ మినిస్టర్! మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు: సుష్మ


హిందూ బాలికల కిడ్నాప్, బలవంతపు మతమార్పిడి, నిఖాపై వస్తున్న వార్తలపై వెంటనే నివేదిక ఇవ్వాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాక్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఈ వివరాల్ని పోస్టు చేశారు. దీనిపై పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌధురీ స్పందిస్తూ.. మేడమ్ ఇది పాక్ అంతర్గత వ్యవహారం. మైనార్టీలను అణిచివేసే మోదీ నేతృత్వంలోని భారత్ కాదు. ఇమ్రాన్ ఆధ్వర్యంలోని సరికొత్త పాక్ ఇది. మా జెండాలోని తెలుపు రంగు సమానత్వానికి నిదర్శనం. మా దృష్టిలో అందరూ ఒక్కటే. భారత ముస్లింల విషయంలోనూ మీరు ఇలాగే స్పందిస్తారని ఆశిస్తున్నా.. అని బ దులిచ్చారు. అనంతరం సుష్మ స్పంది స్తూ.. మిస్టర్ మినిస్టర్ బాలికల ఉదంతంపై నివేదిక ఇవ్వాలని మాత్రమే పాక్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయాన్ని కోరాను. మీరెందుకు భయపడుతూ భుజా లు తడుముకుంటున్నారు. మీ వ్యాఖ్యలు చూస్తుంటే తప్పు చేశారని మీ మనస్సాక్షి చెబుతున్నట్లుగా ఉంది అని వ్యాఖ్యానించారు. పాక్‌లో మైనార్టీల భద్రతపై భారత్ దౌత్యపరమైన చర్యలు ఆరంభించింది. మైనార్టీల సంక్షేమం, రక్షణ, భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఒక నోట్‌లో పాక్‌ను కోరినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

1694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles