వారి రాకపై నిషేధానికి ఓకే!


Wed,December 6, 2017 03:32 AM

ఆరు ముస్లిం దేశాల పౌరులపై ట్రంప్ విధించిన నిషేధానికి అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం
donald-trump
వాషింగ్టన్, డిసెంబర్ 5: ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజల రాకను నిషేధించడంపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్థించింది. నిషేధంపై ట్రంప్ జారీ చేసిన ఆదేశాల పూర్తిస్థాయి అమలుకు సోమవారం ప్రాథమికంగా అనుమతించింది. ఈ కేసులో అప్పీళ్లు ఉన్నప్పటికీ ఇందుకు తక్షణ చర్యలు తీసుకోవచ్చునని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు తాను అధ్యక్షుడైన కొన్ని రోజులకే చాద్, ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ దేశాల ప్రజలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా ట్రంప్ నిషేధం విధించారు. కొన్ని రాష్ర్టాలు, మానవహక్కుల సంఘాలతోపాటు పలువురు ఈ చర్యను వ్యతిరేకిస్తూ దిగువ కోర్టుల్లో కేసులు వేశారు. విచారణ తరువాత కొన్ని కోర్టులు ఈ నిషేధాన్ని కొన్ని సవరణలతో పాక్షికంగా అమలు చేయడానికి అనుమతించాయి. అమెరికాలో శాశ్వత పౌరసత్వం కలిగిన బంధువులున్న ముస్లిం దేశాల ప్రజలను రానీయవచ్చునని తీర్పునిచ్చాయి. దాంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు.. జస్టిస్ రూథ్ బాడర్ గిన్స్‌బర్గ్, జస్టిస్ సోనియా సొటో మేయర్ మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా మొత్తానికి ఆరు ముస్లిం దేశాల ప్రజలపై నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే ఇది తుది తీర్పు కాదు. నిషేధంపై ట్రంప్ తాజాగా సెప్టెంబర్‌లో జారీ చేసిన ఆదేశాలను హైకోర్టులు ఇంకా ఆమోదించాల్సి ఉంది. నిషేధం చట్టబద్ధత విషయాన్ని కూడా తేల్చాల్సి ఉంది. కాబట్టి నిషేధం అమలుపై న్యాయపరమైన సవాళ్లు ఏవైనా ఎదురైతే కోర్టుల ద్వారా పరిష్కరించుకునే వీలు కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. వచ్చే జూన్‌నాటికి సుప్రీంకోర్టు ట్రంప్ విధానంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

1025

More News

VIRAL NEWS