ఎమర్జెన్సీ ప్రకటిస్తా!

Sun,January 6, 2019 02:50 AM

-నెలలు కాదు ఏండ్లయినా సరే ప్రభుత్వాన్ని బంద్ చేస్తా
-సరిహద్దు గోడకు నిధుల కోసం డెమోక్రాట్లకు ట్రంప్ బెదిరింపులు
-ఆర్థిక ప్రతిష్టంభనపై చర్చలు విఫలం

వాషింగ్టన్, జనవరి 5: మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు నిధులివ్వకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ చట్టసభ సభ్యులను బెదిరించారు. ఈ నిధుల వివాదం మూలంగానే అమెరికాలో ప్రభుత్వ పాలన రెండు వారాలుగా స్తంభించిపోయింది. తన మాట నెగ్గించుకొనేందుకు అవసరమైతే నెలలు కాదు ఏండ్లయినా సరే ప్రభుత్వాన్ని మూసివేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. గోడ నిర్మాణానికి ట్రంప్ 560 కోట్ల డాలర్లు కోరుతుండగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు ససేమిరా అంటున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభనను తొలిగించేందుకు ట్రంప్ శుక్రవారం సాయంత్రం డెమోక్రాట్ సభ్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో చట్టసభ అనుమతి లేకుండా మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తానని సభ్యులను హెచ్చరించినట్టు ట్రంప్ విలేకరులకు తెలిపారు.

అంతకుముందు సెనేట్‌లో మైనారిటీల నాయకుడు చక్ షూమర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని పనిచేయించాల్సిందిగా కోరామన్నారు. ఇంకా అనేక విషయాలు చర్చించామని, వాటిలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయని, చర్చలు కొనసాగుతాయని చెప్పారు. అయితే ప్రభుత్వం పనిచేయనంత వరకు చర్చలు పురోగతి సాధించడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ, డెమోక్రాట్ల ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకున్నామని, అయితే ప్రభుత్వం పనిచేయకుండా ఏదీ పరిష్కారం కాదని అన్నారు. అమెరికన్ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని మూసివేసైనా తాను పనిచేయగలనన్నారు.

2803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles