కీప్ అమెరికా గ్రేట్!

Thu,June 20, 2019 01:57 AM

Trump sets stage for 2020 fight with false claims and recycled attacks

- 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ నినాదం
- ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన శ్వేత సౌధాధిపతి


వాషింగ్టన్, జూన్ 19: మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడమే లక్ష్యంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో జరుగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు సమర శంఖం పూరించారు. కీప్ అమెరికా గ్రేట్ (అమెరికాను సమున్నత స్థాయిలోనే కొనసాగిద్దాం) అన్న నినాదంతో ట్రంప్ ప్రచారం చేపట్టారు. మంగళవారం ఫ్లోరిడాలో తన ప్రచారాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రారంభించారు. వేల మంది మద్దతుదారుల సమక్షంలో సుమారు 80 నిమిషాల పాటు ప్రసంగించారు. తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని, దేశం కోసం రూపొందించిన అభివృద్ధి ఎజెండాను పూర్తిచేయడానికి తనకు మరో నాలుగేండ్ల సమయం ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించడానికి ఈ రోజు నేను మీ ముందుకొచ్చాను. విదేశాల ముందు అమెరికాను ఎప్పుడూ తలదించుకునేలా చేయనని ప్రమాణం చేస్తున్నాను.

మా హయాంలో దేశ ఆర్థిక స్థితిగతులను చూసి ప్రపంచమే అసూయ పడుతున్న ది. మనం ముందుకు వెళ్దాం. పోరాడుదాం. విజేతలవుదాం అని పేర్కొన్నారు. తన గెలుపుతో మూడేండ్ల క్రితం అమెరికా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని, అమెరికా ఫస్ట్ (తొలి ప్రాధాన్యం అమెరికన్లకే) అన్న విధానం అవలంబించామని తెలిపారు. తన హయాం లో దేశం పురోగమించిందని, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్నారు. సోషలిజానికి మద్దతు తెలుపుతున్న ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నేతలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికా ఎన్నటికీ సోషలిస్టు దేశం కాదు. గత రెండున్నరేండ్ల పాలనలో మా ప్రభుత్వం చేసినంత అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదని అన్నారు. తన ఆర్థిక విధానాలు తన గెలుపుకు దోహదపడుతాయని, భవిష్యత్‌లోనూ అక్రమ వలసదారులపై ఉక్కుపాదాన్ని ఇలాగే కొనసాగిస్తామని ట్రంప్ తెలిపారు. 2017లో 45వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2016లో మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అన్న నినాదంతో అప్పట్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. నవంబర్ 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles