అణు ముప్పు తప్పింది!

Thu,June 14, 2018 07:59 AM

Trump says North Korea no longer a nuclear threat

-ఇక హాయిగా నిద్రపొండి
-యుద్ధాలు ఎవరైనా చేస్తారు..
-సాహసికులు మాత్రమే శాంతిని నెలకొల్పగలరు
-చొరవ చూపినందుకు కిమ్‌కు థ్యాంక్స్ : ట్రంప్
-స్నేహపూర్వక స్పందనను బట్టే అణునిరాయుధీకరణ చర్యలు: ఉత్తర కొరియా
trump
వాషింగ్టన్/ప్యాంగ్యాంగ్, జూన్ 13: తమ సింగపూర్ శిఖరాగ్ర చర్చలు సఫలం కావడం వల్ల ప్రపంచానికి అణు ముప్పు తప్పిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ప్రజల ఉజల భవిష్యత్ కోసం శాంతి సాధన దిశగా చొరవ చూపినందుకు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లో మంగళవారం జరిగిన ట్రంప్-కిమ్ చారిత్రక భేటీ సానుకూల ఫలితాలను రాబట్టింది. సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా, బదులుగా ఆ దేశానికి భద్రతతోపాటు పలు ప్రయోజనాలను అందించేందుకు అమెరికా హామీ ఇచ్చింది. చర్చల తర్వాత ట్రంప్ అమెరికాకు, కిమ్ ఉత్తర కొరియాకు తిరుగు ప్రయాణమయ్యారు. తమ భేటీ నిజమైన ఫలితాలను, ఆశించిన మార్పును తీసుకువస్తుందని పేర్కొంటూ ట్రంప్ తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి వరుస ట్వీట్లు చేశారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడే వాషింగ్టన్‌లో దిగాను. ప్రపంచానికి అతిపెద్ద అణు ముప్పు తప్పింది. ఇప్పుడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. కిమ్‌తో సమావేశం ఆసక్తిగా, సానుకూలంగా జరిగింది.

ఉత్తరకొరియాకు మంచి భవిష్యత్తు ఉంది అని మొదట ఆయన ట్వీట్ చేశారు. నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు చాలామంది (అమెరికన్లు) ఉత్తర కొరియాతో యుద్ధం చేయబోతున్నామన్న భావనలో ఉన్నారు. ఆ దేశం మనకు అతిపెద్ద, ప్రమాదకర సమస్య అని మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా చెప్పుకొచ్చారు. కానీ, అది ఇక ఏమాత్రం సమస్య కాదు. మున్ముందు అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, పరిశోధనలు ఉండబోవు. త్వరలోనే ఉత్తర కొరియాలో ఉన్న మన దేశానికి చెందిన ఖైదీలు తిరిగి తమ ఇండ్లకు చేరుతారు. అందరూ ఇక హాయిగా నిద్రపోండి అని ట్రంప్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. యుద్ధాలు ఎవరైనా చేయగలుగుతారు. సాహసికులు మాత్ర మే శాంతిని నెలకొల్పుతారు అని ఆయన తెలిపారు. ఉత్తర కొరియాలో అణుక్షేత్రాల ధ్వంసానికి తీసుకోబోయే చర్యలను కిమ్ త్వరలోనే ప్రకటిస్తారని వెల్లడించారు. సింగపూర్ భేటీ సారాంశాన్ని వివరించేందుకు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో దక్షిణ కొరియా, చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

దగ్గరవుతున్న కొద్దీ చర్యలు : ఉత్తర కొరియా

శత్రుత్వం తగ్గి అమెరికా, తాము ఎంత సన్నిహితం అవుతున్నామనేదాన్ని బట్టే అణునిరాయుధీకరణ దిశగా చర్యలు ఉంటాయని ఉత్తర కొరియా తెలిపింది. ఈ మేరకు అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ ఓ కథనం ప్రసారం చేస్తూ.. శాంతిని, అణునిరాయుధీకరణను సాధించేందుకు అమెరికా, ఉత్తర కొరియా పరస్పర శత్రుపూరిత వైఖరిని విడనాడాల్సిన అవసరముందని అధ్యక్షుడు కిమ్ తెలిపారు. ద్వేషం తగ్గించుకుని ఇరుదేశాలు స్నేహభావంతో కొనసాగడంపైనే అణునిరాయుధీకరణ చర్యలు ఆధారపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు అని తెలిపింది.

south-korea

ప్యాంగ్యాంగ్‌కు రండి..

ట్రంప్‌కు కిమ్ ఆహ్వానం
తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆహ్వానించారు. చర్చల సందర్భంగా కిమ్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ట్రంప్.. ప్యాంగ్యాంగ్‌కు వచ్చేందుకు అంగీకరించారని ఉత్తరకొరియా మీడి యా వెల్లడించింది. ఇరువురి శాంతిచర్చలను నవశకానికి నాందిగా ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ అభివర్ణించింది. అణ్వాయుధ ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణంలో మౌలికమైన మార్పునకు ఈ భేటీ దోహదపడనుందని పేర్కొన్నది. కిమ్ కోరినట్లుగా దక్షిణ కొరియాలో మోహరించిన 30వేల అమెరికన్ భద్రతాసిబ్బందిని వెనక్కి రప్పించేందుకు ట్రంప్ అంగీకరించారని కేసీఎన్‌ఏ తెలిపింది.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles