నేడు ట్రంప్, కిమ్ శిఖరాగ్ర భేటీ

Tue,June 12, 2018 04:12 AM

Trump Kim summit US and North Korean leaders to hold historic talks

-అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సిద్ధపడుతుందా?
-విచిత్ర మనస్తత్వాల ఇద్దరు నేతల చర్చలపై సర్వత్రా అసక్తి
-‘కిమ్’ కర్తవ్యం?
-అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సిద్ధపడుతుందా?
-అంగీకరిస్తే అన్నివిధాలా ఆదుకుంటామంటున్న అమెరికా
-నేడే ట్రంప్-కిమ్ శిఖరాగ్ర చర్చలు
-ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు.. ఎజెండా ఖరారు..
-ఉభయ కొరియాల మధ్య శాంతి ఒప్పందం పైనా చర్చించే అవకాశం
-విచిత్ర మనస్తత్వాల ఇద్దరు నేతల చర్చలపై సర్వత్రా అసక్తి
trump-kim
సింగపూర్, జూన్ 11: అమెరికా, ఉత్తరకొరియా మధ్య సింగపూర్ వేదికగా సెంటోసా దీవిలోని కాపెల్లా హోటల్‌లో మంగళవారం జరిగే చర్చల్లో ప్రధాన అంశం అణునిరాయుధీకరణే అనేది సుస్పష్టం. కొన్నేండ్లుగా అణుపరీక్షలతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఉత్తరకొరియాను అడ్డుకునేందుకు అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. నువ్వానేనా అన్న తరహాలో సాగిన హెచ్చరికలు, గంభీరమైన ప్రకటనలతో భయపెట్టిన ఇరుదేశాలు చివరకు సానుకూల దౌత్య వాతావరణంలో చర్చలకు సిద్ధమయ్యాయి. ఉత్తర కొరియా అణ్వస్ర్తాలకు స్వస్తి పలుకాలన్నదే అమెరికా ప్రధాన డిమాండ్. అయితే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌ఉన్ ఏ మేరకు అందుకు అంగీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కిమ్ నిరాయుధీకరణకు సిద్ధపడితే మరి ఆ దేశం అగ్రరాజ్యం నుంచి ఏం ఆశిస్తుందన్న అంశం కూడా కీలకమైనదే. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నదే తన ఉద్దేశమని కిమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దేశభద్రతకు స్పష్టమైన హామీతోపాటు అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన కోరే అవకాశాలున్నాయి. అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే.. అగ్రరాజ్యం అమెరికాను ఉత్తర కొరియా ఏం రాయితీలు ఆశిస్తుందో స్పష్టంగా వెల్లడికావడం లేదు. పైగా గతంలో చేసిన వాగ్దానాలకు కిమ్ ఏమేరకు కట్టుబడి ఉంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌ఉన్ మధ్య సింగపూర్ వేదికగా జరుగనున్న చారిత్రక సమావేశానికి కొన్ని గంటల ముందు అగ్రరాజ్యం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. సంపూర్ణ అణునిరాయుధీకరణకు ఉత్తరకొరియా అంగీకరిస్తే, ఆ దేశానికి ఆర్థికపరమైన, భద్రతపరమైన భరోసాను అందిస్తామని వెల్లడించింది.

తమ భేటీ ఆసక్తికరంగా మారుతున్నదని, చర్చలు మంచి ఫలితాన్నిస్తాయని ఆశిస్తున్నానని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య అధికారుల స్థాయిలో సన్నాహక చర్చలు చురుగ్గా సాగుతున్నాయని, మంగళవారంనాటి కీలక భేటీలో ద్వైపాక్షిక చర్చలకు తార్కిక ముగింపు లభిస్తుందని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. మాటమార్చకుండా సంపూర్ణ అణునిరాయుధీకరణకు ఉత్తరకొరియా పూనుకుంటే ఆ దేశానికి ఆర్థిక, రక్షణ, ఇతరత్ర ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమే. గతంలో ఎన్నడూ ఎవరికీ ప్రకటించని ప్రత్యేక ప్యాకేజీ అమెరికా ఇవ్వనున్నది. దాంతో ఆ దేశానికి మంచి భవిష్యత్ ఉంటుంది. అణునిరాయుధీకరణ ద్వారా నష్టపోయామన్న భావన ఆ దేశానికి కలుగకుండా వారు సంతృప్తి చెందేలా ఈ ప్రయోజనాలుంటాయి. అయితే అది ఉత్తరకొరియా కార్యాచరణ మీదే ఆధారపడి ఉంటుంది అని పాంపియో చెప్పారు. అమెరికా, ఉత్తరకొరియా నేతలిద్దరూ జరిపే ముఖాముఖి చర్చల ఫలితం ఇరుదేశాల ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికే భారీగా ప్రయోజనాలందిస్తుందని ఆయన తెలిపారు. అణునిరాయధీకరణకు అంగీకరించడం తప్ప ఉత్తరకొరియా ముందు మరో ప్రత్యామ్నాయమేదీ లేదని పాంపియో పేర్కొన్నారు. అమెరికాలోని గత ప్రభుత్వాన్ని ఉత్తరకొరియా వెర్రిదాన్ని చేసిందని, కానీ ట్రంప్ సమర్థులైన నిపుణుల సాయంతో ఉత్తరకొరియాను దారికి తెచ్చాడని ఆయన వ్యాఖ్యానించారు. సింగపూర్ సమావేశంతోనే పరిణామాలన్నీ పూర్తిగా మారిపోతాయని అమెరికా ఏమీ ఆశించడం లేదు. కానీ ఉజ్వల భవిష్యత్‌కు ఈ సందర్భాన్ని వేదికగా వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. విచిత్ర మనస్తత్వాలు కలిగిన ట్రంప్, కిమ్‌లు ఇద్దరూ ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నట్లుగా అణు నిరాయుధీకరణకు బాటలు వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.

trump-kim2

చర్చల తుది కసరత్తులో అధికారులు

ట్రంప్, కిమ్ భేటీకోసం ఎజెండా అంశాల కసరత్తుకు ఇరుదేశాల దౌత్యాధికారులు సోమవారం రోజంతా ఎడతెగని చర్చలు జరిపారు. చర్చల్లో తొలుత ట్రంప్, కిమ్ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారని, తర్వాత తమ తమ అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొంటారని సమాచారం. దక్షిణ కొరియాలో అమెరికా దౌత్యాధికారిగా పనిచేసిన సుంగ్ కిమ్ అగ్రరాజ్యం తరఫు దౌత్యబృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తర కొరియా విదేశాంగశాఖ ఉప మంత్రి చోసోన్ హుయి తమ దేశ ప్రతినిధి బృందాన్ని ముందుండి నడిపిస్తున్నారు. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధం ముగింపులో చేసుకున్న ఒప్పందం కూడా ట్రంప్-కిమ్ భేటీలో చర్చకు రానున్నదని సమాచారం. ఆ ఒప్పందం కారణంగానే ఉభయ కొరియా దేశాల మధ్య యుద్ధం నిలిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొన్నది. ఇటీవలి కాలంలో ఉభయ కొరియా దేశాలు స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. దీనిని మరింత ముందుకుతీసుకెళ్లేలా ఇరుదేశాల మధ్య సౌహార్ద్ర వాతావరణాన్ని నెలకొల్పేలా ఒక ఒప్పందం కూడా చర్చల ఎజెండాలో ఉన్నది. మరోవైపు ట్రంప్-కిమ్ చర్చలపై అనేక ఆశల్ని పెట్టుకున్న దక్షిణ కొరియాను అనేక అనుమానాలూ వెంటాడుతున్నాయి. ఈ శిఖరాగ్ర చర్చలపై తమకు అనేక సందేహాలున్నాయని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఎలాంటి అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా చర్చల ప్రక్రియను పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి బహ్రమ్ ఘసేమీ పేర్కొన్నారు.

ఇద్దరు భారత సంతతి మంత్రుల కీలక పాత్ర!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ మధ్య మంగళవారం ఉద యం ప్రారంభం కానున్న శిఖరాగ్ర చర్చలలో భారత సంతతికి చెందిన ఇద్దరు సింగపూర్ మంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సింగపూర్ విదేశాంగశాఖ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ ట్రంప్, కిమ్ మధ్య శిఖరాగ్ర చర్చలు చివరి క్షణంలో రద్దు కాకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు దాని నిర్వహణ ఏర్పాట్లపై సంప్రదింపులకు ఇటీవల వాషింగ్టన్, ప్యొంగ్యాంగ్, బీజింగ్ మధ్య చక్కర్లు కొట్టారు. సింగపూర్ హోం, న్యాయశాఖ మంత్రి షణ్ముగం.. కిమ్, ట్రంప్ మధ్య శిఖరాగ్ర చర్చల వేదిక వద్ద భద్రతాచర్యలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా బాలకృష్ణన్ మాట్లాడుతూ దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉ ద్రిక్తతలు ఒక్క సమావేశంతోనే ముగిసిపోవని వ్యా ఖ్యానించారు. అయితే సదస్సు ఫలితాల పట్ల ట్రంప్, కిమ్ విశ్వాసంతోనూ, ఆశాభావంతోనూ ఉన్నారని చెప్పారు. హోంమంత్రి షణ్ముగం మాట్లాడుతూ చర్చల వేదిక వద్ద భద్రతపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు వారాలుగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చర్చల వేదిక వద్ద భద్రత కోసం పోలీసులు, అత్యవసర ప్రతిస్పందన బృందాలతోపాటు తాము ఐదువేల మంది హోం టీం అధికారులను నియమించామని చెప్పారు.

బర్త్‌డే వేడుకల్లో ట్రంప్.. నైట్ టూర్లో కిమ్

చర్చలకు కొద్దిగంటలముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్.. ఎవరికివారుగా సింగపూర్‌లో సరదాగా గడిపారు. సోమవారం ట్రంప్ 72వ బర్త్‌డే సందర్భంగా సింగపూర్ ప్రధాని లీసైన్ లూంగ్ భారీకేక్‌తోఆయనను ఆశ్చర్యపరిచారు. విందుకోసం అధ్యక్షభవనం ఇస్తానాకు చేరుకున్న ట్రంప్‌కు లీసైన్ లూంగ్ స్వాగతం పలికారు. ట్రంప్ నవ్వుతూ ఉన్నట్లుగా అలంకరించిన ఫ్రూట్‌కేక్‌ను లీసైన్ ఆయనతో కట్ చేయించారు. ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు అని సింగపూర్ విదేశాంగశాఖ మంత్రి వివియన్ బాలక్రిష్ణన్ ఆ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇక కిమ్‌జోంగ్ ఉన్ సింగపూర్‌లోని పలు ప్రాంతాలను రాత్రివేళ సందర్శించారు. ఆయన వెంట ఉన్న వివియన్ బాలక్రిష్ణన్ వివిధ వాటర ఫౌంటేన్లవద్ద కిమ్ సరాదాగా దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టుచేశారు.

1046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles