నోరు పారేసుకున్న ట్రంప్


Sat,January 13, 2018 11:20 AM

-మురికి హైతీ, ఆఫ్రికా దేశాల
-పౌరులనెందుకు పరిరక్షించాలని వ్యాఖ్య

trump
వాషింగ్టన్/ లండన్, జనవరి 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఆఫ్రికా ఖండ దేశాలు, హైతీ నుంచి నుంచి వచ్చిన వలస కార్మికులను ఎందుకు పరిరక్షించాలని ప్రశ్నించారు. అవి మురికి దేశాలని వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్‌లో సంస్కరణలపై చట్టసభల ప్రతినిధులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. కానీ తాను అభ్యంతరకరమైన పదజాలం వాడలేదన్న ట్రంప్.. కఠిన పదజాలం వాడినట్లు అంగీకరించారు. ఆఫ్రికా దేశాలు, హైతీ వంటి దేశాల నుంచి వలస కార్మికులను తెచ్చుకోవడం కంటే నార్వే వంటి దేశాల నుంచి వచ్చే వారికి స్వాగతం పలుకాలని ఆయన అన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ట్రంప్ వ్యాఖ్యలను డెమోక్రటిక్ ప్రజాప్రతినిధులు ఖండించారని తొలుత వాషింగ్టన్ పోస్ట్, తర్వాత న్యూయార్క్ టైమ్స్ వార్తలు ప్రచురించాయి. సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మియా లవ్ స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు దయలేనివన్నారు. సమాజాన్ని విభజించేవని, అమెరికా విలువలకు విరుద్ధమన్నారు. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


లండన్ రాయబార కార్యాలయ ప్రారంభం రద్దు చేసుకున్న ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ వచ్చేనెలలో బ్రిటన్ రాజధాని లండన్‌లో అమెరికా నూతన రాయబార కార్యాలయ ప్రారంభానికి వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో లండన్‌లోని రాయబార కార్యాలయాన్ని గ్రోస్వెనోర్ స్కేర్ నుంచి థేమ్స్ నదికి దక్షిణాన గల మే ఫెయిర్ ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. నూతన రాయబార కార్యాలయ నిర్మాణానికి 120 కోట్ల డాలర్లు ఖర్చు చేయడం అనవసరమని పేర్కొన్నారు. కాగా ఈ రాయబార కార్యాలయాన్ని ఈ నెల 16న అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ప్రారంభిస్తారు.

554

More News

VIRAL NEWS