పాక్‌కు భంగపాటు

Sun,August 18, 2019 02:28 AM

Trump asks Imran Khan to resolve Kashmir issue bilaterally

-కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా గుర్తించేందుకు భద్రతామండలి ‘నో’
-భారత్‌-పాక్‌ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని అభిప్రాయం
-నిర్ణయాన్ని వెలువరించకుండానే ముగిసిన మండలి సమావేశం
-భారత్‌కే అత్యధిక దేశాల మద్దతు.. అంతర్జాతీయంగా ఒంటరైన పాక్‌
-ఉగ్రదేశానికి మద్దతిచ్చి పరువు పోగొట్టుకున్న చైనా

ఐరాస, ఆగస్టు 17: ఆర్టికల్‌ 370 రద్దు అంశంలో మొదటి నుంచీ ‘అతి’గా ప్రవర్తిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. జమ్ముకశ్మీర్‌పై పాక్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఒక్క చైనా తప్ప ప్రపంచదేశాలేవీ నమ్మడం లేదు. కశ్మీర్‌లో ఏదో జరిగిపోతున్నదని.. ఒప్పందాలను భారత్‌ ఉల్లంఘిస్తున్నదంటూ గొంతు చించుకొని అరుస్తున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. మరోవైపు చైనా సైతం అంతర్జాతీయంగా తన పరువును పోగొట్టుకున్నది. ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు వంత పాడుతూ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నది.

తాజాగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో సైతం పాక్‌కు భంగపాటు తప్పలేదు. కశ్మీర్‌ అంశంపై అత్యవసరంగా చర్చించేందుకు శుక్రవారం నిర్వహించిన భద్రతా మండలి సమావేశం.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈ అంతర్గత సమావేశానికి ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది ఆహ్వానిత సభ్య దేశాల ప్రతినిధులు హాజరైన సంగతి తెలిసిందే. గంటకుపైగా జరిగిన చర్చల్లో కేవలం ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవడానికే పరిమితమయ్యారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేయలేదు. అయితే జమ్ముకశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షికమని, సమస్యలపై భారత్‌-పాక్‌ కలిసి చర్చించుకోవాలని భద్రతామండలి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీతోపాటు ఆహ్వానిత దేశాలైన ఐవరీకోస్ట్‌, గునియా, డొమినికన్‌ రిపబ్లిక్‌ వంటి దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. బ్రిటన్‌ నేరుగా మద్దతు ఇవ్వకున్నా.. ద్వైపాక్షిక అంశమని తేల్చిచెప్పింది. ఒక్క చైనా మాత్రమే పాక్‌కు మద్దతు పలికింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చర్చల అనంతరం మీడియా ప్రకటన విడుదల చేయాలని చైనా వాదించింది. బ్రిటన్‌ సైతం ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. అయితే.. ‘కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ అనేకమార్లు ఐరాసలో ప్రస్తావించింది. కానీ.. సమితి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడూ ఇదే విధానాన్ని పాటిద్దాం. చర్చల అనంతరం కశ్మీర్‌పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోవడం లేదు. మీడియా ప్రకటన కూడా లేదు’ అని మండలి అధ్యక్షురాలు చైనాకు స్పష్టం చేశారు. 15 సభ్య దేశాల ప్రతినిధుల్లో అత్యధికశాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సంయుక్త ప్రకటన విడుదల చేసేదిలేదని స్పష్టంచేశారు.

చైనా-పాక్‌ కారిడార్‌ సంగతేంటి?

చర్చల సందర్భంగా సభ్యదేశాల ప్రతినిధుల్లో అత్యధికులు భారత్‌కే మద్దతుగా నిలిచినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా గుర్తించాలన్న పాక్‌ ప్రతిపాదనను తిరస్కరించాయి. జమ్ముకశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, భారత్‌-పాక్‌ కలిసి పరిష్కరించుకోవాలని స్పష్టంచేశాయి. ‘ఆర్టికల్‌ 370 పూర్తిగా మా అంతర్గత విషయం. మా రాజ్యాంగ పరిధిలో మార్పులు, చేర్పులు చేసుకోవడం అంతర్జాతీయ సమస్య ఎలా అవుతుంది? పక్కదేశంలో(పాక్‌లో) భద్రతా సమస్యలను ఎలా సృష్టించగలుగుతుంది?’ అన్న భారత్‌ వాదనకు మద్దతు పలికాయి.

కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావనకు రాగా.. ‘చైనా గురివింద గింజ మాదిరిగా మానవహక్కుల గురించి మాట్లాడటంతో ఆ విషయంలోనూ పాకిస్థాన్‌కు భంగపాటు తప్పలేదు’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఒకవేళ 370 అధికరణ రద్దును ఒప్పందాల ఉల్లంఘనగా పాక్‌ భావిస్తుంటే.. మరి చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) సంగతేంటి?. పాక్‌ తన దేశంలో భౌగోళికంగా ఎన్ని మార్పులు చేసింది?’ అని సభ్యదేశాలు ప్రశ్నించాయి. దీంతో చైనా గొంతులో పచ్చివెలక్కాయ పడింది. పాకిస్థాన్‌ను ఆదుకునేందుకే ఆ ప్రాజెక్టును చేపట్టామని చెప్తూ తప్పించుకున్నది. ఇది మండలి అధికారిక సమావేశం కాదని, అంతర్గత సంప్రదింపులు మాత్రమేనని కాబట్టి.. చర్చలకు సంబంధించి ఎలాంటి రికార్డులు, మినిట్స్‌ అందుబాటులో ఉండవని ఐరాస వర్గాలు చెప్పాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా ప్రతినిధి జాంగ్‌ జున్‌, పాక్‌ ప్రతినిధి మలీహా లోధి కశ్మీర్‌ సమస్యను భద్రతామండలి అంతర్జాతీయ అంశంగా గుర్తించిందని తప్పుడు ప్రకటన ఇచ్చారు.

1990
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles